వేగమే యమపాశం | Speed ​​yamapasam | Sakshi
Sakshi News home page

వేగమే యమపాశం

Published Fri, Dec 6 2013 2:46 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Speed ​​yamapasam

సాక్షి, సిటీబ్యూరో: అతి వేగం.. రాంగ్‌రూట్ డ్రైవింగ్.. గడిచిన 96 గంటల్లో నగరంలో 12 మందిని బలిగొన్నాయి. రోడ్డెక్కితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోవాలనే కొందరి ధోరణి పాదచారులు, ఒక్కోసారి ఇళ్లలో ఉన్న వారి ప్రాణాలూ తోడేస్తోంది. ప్రమాద స్థలాల్లో కొన్ని నిత్యం యాక్సిడెంట్లు జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ అయినప్పటికీ.. కనీస నియంత్రణ చర్యలు కరువయ్యాయి. ఫలితంగా రోడ్లు నిత్యం రక్తమోడుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు, ఇతర ప్రభుత్వ యంత్రాగాలకు చిత్తశుద్ధి ఉంటే వాహనాల అతి వేగానికి కళ్లెం వేయడం కష్టమేం కాదని నిపుణులు అంటున్నారు. ‘డ్రంకన్ డ్రైవ్’ విస్తరించడం, వివిధ సమయాల్లో, ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం అవసరం. మరోపక్క గత నాలుగు రోజుల్లో ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో గండిమైసమ్మ రోడ్డు, నెక్లెస్‌రోడ్డు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారేలేరు. స్పీడ్ లేజర్‌గన్, ఇంటర్‌సెప్ట్ వాహనాలను తగిన స్థాయిలో వినియోగించి, అవసరమైన చోట్ల ఆకస్మిక తనిఖీలు చేయాలి. నిత్యం ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్స్’తో పాటు ప్రమాదాలకు ఆస్కారమున్న చోట తగిన ఏర్పాట్లు చేస్తే ఫలితాలుంటాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే...
 
కాషనరీ సైన్స్

 ప్రమాదకరమైన ప్రాంతం, హేతువు గురించి సదరు స్పాట్‌కు కొద్దిదూరంలోనే హెచ్చరిక/సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు ఇరువైపులా కనీసం 200, 100 మీటర్ల దూరాల్లో రెండు బోర్డులు ఉంచాలి. జాతీయ రహదారి అయితే 900 ఎంఎం కొలతలో, ‘ప్రమాదకర ప్రాంతం’ అని స్పష్టంగా తెలిసేలా బోర్డులుండాలి.
 
  కలర్స్, క్యాట్ ఐస్
 ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్ మార్జిన్స్‌లోనూ పెయిం టిం గ్ వేయాలి. రిఫ్లెక్టివ్ పెయింట్స్ అయితే రాత్రి వేళ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. మా ర్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలి.
 
  హజార్డ్ మార్కర్స్
 అత్యంత ప్రమాదకర స్పాట్స్ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాం తాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా అవసరమైనంత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్ మార్కర్స్ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి.
 
   స్పీడ్ బ్రేకర్, రంబ్లర్ స్ట్రిప్స్
 నెక్లెస్‌రోడ్ వంటి చోట్ల వేగానికి ఆస్కారం ఉంది. ఇక్కడ 24 గంటలూ పోలీసులు కాపుకాయలేరు. కాబట్టి కీలక స్పాట్‌ల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారులపై నిబంధనల ప్రకారం వీటి ఏర్పాటుకు అవకాశం లేదు. ఇలాంటి ప్రాంతాల్లో రెండు అంగుళాల ఎత్తు, అదే వె డల్పుతో ఉండే రంబ్లర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయవచ్చు. వీటిని మలుపునకు 100 మీటర్ల దూరంలో ఇరువైపులా రోడ్డుపై 10-15 చొప్పున ఏర్పాటు చేయాలి.
 
  జిగ్‌జాగ్ మార్కింగ్
 ప్రమాదాల నివారణలో కీలకమైంది జిగ్‌జాగ్ మార్కింగ్. ప్రమాదకర ప్రాంతం కేంద్రంగా అటు-ఇటు దాదాపు 100 మీటర్ల మేర ఈ మార్కింగ్స్ వేయాలి. వీటిపై నుంచి ప్రయాణిస్తున్న వాహనచోదకుడు.. ఎక్కువ వేగంతో వెళ్తున్నట్టు భ్రాంతి చెందితే వెంటనే స్లో అవుతాడు.
 
   ఫాగ్‌లైట్స్
 శీతాకాలంలో అర్థరాత్రి దాటాక, తెల్లవారుజామున పొగమంచు అలుముకుంటుంది. రోడ్డు కని పించక, ఎదుటి వాహనం కానరాక ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి వాహనానికీ ఫాగ్‌లైట్ ఏర్పాటు కచ్చితం చేయాలి. దీనివల్ల వాహనం ఉనికి ఎదుటి వారికి తెలుస్తుంది. వాహనచోదకుడికీ మార్గం కొంతమేర స్పష్టంగా కనిపిస్తుంది.
 
 వారం- మృతులు/క్షతగాత్రులు

 సోమవారం- 3/1
 దుండిగల్‌లోని గండి మైసమ్మ వద్ద ఆటో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను అతి వేగంతో ఢీకొట్టింది. డ్వాక్రా మహిళలు రాజేశ్వరి, చిట్టెమ్మ, ఆటోడ్రైవర్ న ర్సింహులు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు.
 
 మంగళవారం- 3/2
 నాచారం ప్రాంతంలో హమాలీ రాజు, లారీడ్రైవర్ బాబూమియా ఉదయమే రోడ్డు పక్కన నిల్చుని టీ తాగుతున్నారు. మల్లాపూర్ నుంచి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో వీరిద్దరు అక్కడికక్కడే మరణించారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు   నేరేడ్‌మెట్ జేజే నగర్ వద్ద రోడ్డు దాటుతున్న మాజీ సైనికోద్యోగి గోపాలకృష్ణన్‌ను వేగంగా దూసుకువచ్చిన కారు బలిగొంది
 

బుధవారం- 3/3
 కుషాయిగూడ పరిధిలో.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని రాంగ్‌రూట్‌లో నడపటమే కాక రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి పోనిచ్చాడు. కూలీ ఎల్లమ్మ మరణించగా, డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు.
     
 నాచారం పారిశ్రామికవాడలో ఉండే పారిశుద్ధ్య కార్మికురాలు పెంటమ్మ వాటర్‌ట్యాంకర్‌లో డ్రైవర్ పక్కన కూర్చుని ప్రయాణిస్తుండగా, స్పీడ్ బ్రేకర్ వద్ద కుదుపునకు ఎగిరి రోడ్డుపై పడి.. ట్యాంకర్ వెనక చక్రం కింద నలిగి ప్రాణాలు వదిలింది
     
 మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు
 

గురువారం-3/1
 నెక్లెస్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో విద్యార్థి హరీష్, స్వీపర్ అనసూయ మరణించారు. మొబిన్ గాయపడ్డాడు.
     
 సైబర్‌టవర్స్ ప్రాంతంలో రాంగ్‌రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొట్టడంతో బీఫార్మసీ విద్యార్థిని తీవ్రగాయాల పాలై మృతిచెందింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement