యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌ | Black Spots For Road Accidents Found In Mancherial | Sakshi
Sakshi News home page

యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌

Published Sat, Jul 27 2019 10:07 AM | Last Updated on Sat, Jul 27 2019 10:08 AM

Black Spots For Road Accidents Found In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ‘బ్లాక్‌స్పాట్స్‌’ను గుర్తిస్తున్న పోలీసులు, ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఇలాంటి బ్లాక్‌స్పాట్స్‌ 21 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 12 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న ఈ డేంజర్‌ స్పాట్స్‌లో గత ఒక్క ఏడాదిలోనే 146 ప్రమాదాలు జరగగా.. 49 మంది మరణించారు.

21 చోట్ల బ్లాక్‌ స్పాట్స్‌
రోడ్డు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుంటే ఆ ప్రాంతాలను పోలీసు భాషలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణిస్తారు. 2018లో జరిగిన ప్రమాదాల ఆధారంగా జిల్లాలో 21 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెల్లంపల్లి, సీసీసీ నస్పూరు, చెన్నూరు, హాజీపూర్, జైపూర్, కాసిపేట, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, తాండూరు పోలీసుస్టేషన్ల పరిధిలో 21 డేంజర్‌ స్పాట్స్‌ ఉన్నట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ స్పాట్స్‌లో గత సంవత్సరం ఏకంగా 146 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో అధికంగా నస్పూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28 ప్రమాదాలు జరగగా.. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 24 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 146 రోడ్డు ప్రమాదాల్లో 49 మంది మృత్యువాత పడగా.. 96 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

గుర్తింపుతో జాగ్రత్తలు
కుటుంబాలకు తీరని శోకం కల్పించే రోడ్డు ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తున్న పోలీసులు.. తాజాగా వాటి నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. గతంలో ఇలాంటి చర్యలు కాస్త మందగించినా.. మళ్లీ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి సరిచేసే పనులను 2017 సంవత్సరంలోనే పోలీసులు చేపట్టారు.

అప్పటి సీపీ దుగ్గల్‌ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్‌ రెజుల్యూషన్‌ టీమ్‌ (ఆర్ట్‌) పేరిట ఒక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆర్ట్‌ బృందంలో సంబంధిత పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీఐతో పాటు.. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రవాణాశాఖ, ఆర్టీసీల నుంచి ఒక్కో అధికారి ఉంటారు.

ఈ బృందం ప్రమాదాలు జరిగిన స్థలాలకు వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలు, గతంలో జరిగిన ప్రమాదాల వివరాలు సేకరించి, అక్కడ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఉన్నతాధికారులకు నివేదించేవాళ్లు. ఈ నివేదిక ఆధారంగా ఆయా స్పాట్స్‌ల్లో సూచికలు, డివైడర్లు ఏర్పాటు చేయడం, గుంతలుంటే పూడ్చడం, రోడ్డులను సరిచేయడం, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. కానీ.. ఏడాదిపాటు ఆర్ట్‌ బృందం తన కార్యకలాపాలు నిర్వహించినా.. ఆ తరువాత మందగించింది.

నివారణకు చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ముందుగా తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్స్‌) గుర్తించారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. జియోట్యాగింగ్, గూగుల్‌ మ్యాప్‌ద్వారా ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో..? ఆ స్పాట్స్‌ను గుర్తించారు.

ఇలా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్స్‌గా నిర్ణయించారు. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించడంతోపాటు, అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆర్‌అండ్‌బీ, పీఆర్, నేషనల్‌ హైవే అథారిటీ, మున్సిపాలిటీ, ఆర్టీసీ, ఆర్టీఏ, ట్రాన్స్‌కో తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్లాక్‌స్పాట్స్‌కు కారణమేమిటనే వాటిపై పోలీసులు ముందుగా దృష్టి సారించారు.

యూటర్న్‌లు, రోడ్డు ఇంజినీరింగ్‌ సరిగా లేకపోవడం, చెట్లు, హోర్డింగ్‌లు అడ్డుగా ఉండడంవంటి కారణాలతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు నిర్ధరించారు. దీంతో రోడ్లను, మూలమలుపులు, యూటర్న్‌ను సరిచేయడం.. అడ్డుగా ఉన్నచెట్లు, హోర్డింగ్‌లను తొలగించడం, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు త్వరగా పూర్తయి, జిల్లాలో బ్లాక్‌స్పాట్స్‌ లేకుండా పోవాలని, ఏ కుటుంబం రోడ్డున పడకూడదని ప్రజలు ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement