కణతల మీద మచ్చలు... తగ్గేదెలా? | women self confidence | Sakshi
Sakshi News home page

కణతల మీద మచ్చలు... తగ్గేదెలా?

Published Wed, Sep 7 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

కణతల మీద మచ్చలు... తగ్గేదెలా?

కణతల మీద మచ్చలు... తగ్గేదెలా?

అతివ - ఆత్మవిశ్వాసం

నా వయసు కేవలం 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - శ్రీజ, కందుకూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటోపిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింద సూచనలు పాటించండి.

     
మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించండి.       ఇక ఎండకు వెళ్లినా వెళ్లకపోయినా 50 ఎస్‌పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి రాస్తూ ఉండాలి.  రాత్రివేళ కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును  ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి.

     
కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రోడెర్మాబ్రేషన్ లేదా ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు.

 
మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం. అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.  అందులో ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి.

 

 నా వయసు 18 ఏళ్లు. నా ఒంటి మీద దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ (ఫెయిర్‌గానూ), మిగతా ప్రాంతంలో స్కిన్ కాస్త నల్లగా (డార్క్‌గా) కనిపిస్తుంది. నా మేని రంగు అంతా ఒకేలా ఉండి, దానికి నిగారింపు వచ్చేందుకు ఏం చేయాలి? - కావ్య, కాకినాడ
దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. ఆ భాగాలతో పోలిస్తే సూర్యకాంతి పడేచోట అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల సన్ డ్యామేజీ వల్ల మేని రంగు కాస్త డార్క్‌గా ఉంటుంది.  మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా ఉండటంతో పాటు, మెరుస్తూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...

     
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే  మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి.సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్‌పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి. సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది.  గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి. పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో మీ చర్మాన్ని నిగారింపుతో ఉండేలా చేస్తారు.

 

నా వయసు 25 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. తల మీద వెంట్రుకలు బాగా పలచబారిపోయాయి. నాకు బట్టతల చాలా అర్లీగా వస్తున్నట్లు అనిపిస్తోంది. దయచేసి నా జుట్టు రాలపోకుండా తగిన సలహా ఇవ్వండి. - శ్రీదేవి, కందుకూరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు యాండ్రోజెనిక్ అలపేషియా అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బహుశా మీకు ఇది వారసత్వంగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీని వల్ల మీకు బట్టతల రాబోతోందని అర్థమవుతోంది.  బట్టతలలో మొదటి దశ నుంచి మూడో దశ ఉన్నవారు బయోటిన్‌తో పాటు... సా పాల్‌మెట్టో, మినాక్సిడిల్ 5 శాతం ఉన్న లోషన్లను తలపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగు, ఐదు దశల్లో పై మందులకు తోడుగా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ  వంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.  ఇక ఇవేవీ పనిచేయకపోతే జుట్టు పుష్కలంగా ఉన్న ప్రాంతం నుంచి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను అనుసరించడం మంచి ప్రత్యామ్నాయ మార్గం. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.

 

నా వయసు 15 ఏళ్లు. నాకు ముఖం నిండా మొటిమలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి తగ్గేదెలా?  - జయ, హైదరాబాద్
మీలాంటి టీనేజీ యువతీయువకుల్లో సాధారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాలు, లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి అనే అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి.

 

డాక్టర్  స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్

 

న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్
కీరదోసతో  అదుపులోకి హైబీపీ
కీరదోసలో 96 శాతం నీరే. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషాలను (టాక్సిన్స్) బయటకు పంపుతుంది ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినాలి. ఇందులోని ‘ కె’ విటమిన్ ఎముకలు కీళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి అల్జీమర్స్ సమస్యను నివారిస్తుంది.

     
కీరదోస ... గ్యాస్ట్రిక్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది, జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. గోళ్లు పెళుసుబారడాన్ని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కడుపులో బద్దె పురుగులను నిర్మూలిస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ తినవచ్చు. బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు. 

 

డాక్టర్ రాధిక  చీఫ్ డైటీషియన్
కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement