డెత్‌ స్పాట్‌లు! | Death Spots In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

డెత్‌ స్పాట్‌లు!

Published Tue, Apr 24 2018 8:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Death Spots In Greater Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ‘ప్రమాదకరంగా’ మారిన పాట్‌హోల్‌ ఓ యువ వ్యాపారి ప్రాణం తీసింది. నారాయణగూడకు చెందిన వ్యాపారి విశాల్‌ గత మంగళవారం హబ్సిగూడ ప్రాంతంలో స్కూటర్‌పై వెళుతుండగా రోడ్డుపై ఇబ్బందికరంగా ఉన్న పాట్‌హోల్‌ను తప్పించేందుకు తన వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. కేవలం ఇదొక్కటే కాదు... నగర వ్యాప్తంగా పాట్‌హోల్స్, మ్యాన్‌హోల్స్‌ కారణంగా నిత్యం అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భూగర్భ మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, కమ్యూనికేషన్‌ కేబుళ్ల కోసం రహదారులపై ఏర్పాటు చేస్తున్న పాట్‌హోల్స్‌/మ్యాన్‌హోల్స్‌ ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌Š  ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్‌టీఎహెచ్‌) తొలిసారిగా ఈ కేటగిరీని తమ గణాంకాల్లో చేర్చింది. రోడ్‌ యాక్సిడెంట్స్‌ ఇన్‌ ఇండియా పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో ఈ రకమైన ప్రమాదాలు 282 చోటు చేసుకున్నాయి. ఇందులో 82 మంది మృత్యువాత పడగా 424 మంది క్షతగాత్రులయ్యారు. ఆయా హోల్స్‌కు మూతలు ఏర్పాటు చేయడంలో యంత్రాంగాల నిర్లక్ష్యం, సరైన సూచికలు లేకుండా ఎక్కడికక్కడ మరమ్మతుల పేరుతో తవ్వకాలు, పెరుగుతున్న రోడ్ల ఎత్తుకు తగ్గట్టు వీటి ఎత్తు పెంచకపోవడం ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా అడ్డదిడ్డంగా స్పీడ్‌బ్రేకర్లు దర్శనమిస్తుంటాయి. వీటి ఏర్పాటులో ప్రభుత్వ యంత్రాంగాలు నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం ప్రమాదాలకు కారణమవుతోంది. స్పీడ్‌బ్రేకర్ల వద్ద చోటు చేసుకున్న 293 ప్రమాదాల్లో 80 మంది చనిపోయినట్లు, మరో 367 మంది క్షతగాత్రులైనట్లు ఎంఓఆర్‌టీహెచ్‌ నివేదిక పేర్కొంటోంది. రోడ్లు సరిగ్గా లేకపోవడం, ప్రతికూల వాతావరణం, అననుకూల పరిస్థితుల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సాధారణంగా భావిస్తుంటాం. అయితే రాష్ట్రంలో గుడ్‌ సర్ఫేస్‌ (ఎలాంటి లోటుపాట్లు లేని) రహదారుల్లోనే 4328 ప్రమాదాలు జరిగి 1623 మంది మృత్యువాతపడగా మరో ఐదు వేల మందికి గాయాలపాలయ్యారు. మొత్తమ్మీద ఎలాంటి మలుపులు లేకుండా సరిసరిగా ఉన్న రోడ్లలో (గుడ్‌ సర్ఫేస్‌ వాటితో కలిపి) 5631 ప్రమాదాలు జరిగి 2691 మంది చనిపోగా, 3436 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దీని ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో అత్యధికం డ్రైవర్ల కారణంగా జరిగినవేనని ఎంఓఆర్‌టీహెచ్‌ స్పష్టం చేస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన  ప్రమాదాల్లో 70 శాతం వరకు సిగ్నల్స్, పోలీసు బూత్స్‌ తదితర పోలీసుల పర్యవేక్షణ, ఉనికి లేని చోట్లే జరిగాయి.

ఈ ప్రాంతాల్లో 10,226 ప్రమాదాలు జరిగి 4405 మంది మృత్యువాతపడగా 8373 మంది క్షతగాత్రులుగా మారారు. ఎంఓఆర్‌టీహెచ్‌ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన, అసలు ఎలాంటి లైసెన్స్‌ లేని డ్రైవర్ల కారణంగా 2833 ప్రమాదాలు జరిగి 871 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో రోడ్డు నిబంధనల అమలు, లైసెన్సుల జారీ, జరిమానాలు/శిక్షల విధింపు తదితరాలు భారత మోటారు వాహనాల చట్టాన్ని అనుసరించి జరుగుతాయి. అంటే... ఈ చట్టం కేవలం మోటారుతో కూడిన వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఎలాంటి మోటారు లేకుండా రోడ్డుపై సంచరించే వాహనాలూ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నాయి. గత ఏడాది సైకిళ్లు, రిక్షాలు, మనుషులు, జంతువులు లాగే బండ్ల కారణంగా 617 ప్రమాదాలు జరిగి 177 మంది మృత్యువాతపడగా, 796 మంది క్షతగాత్రులు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించి విడుదల చేసిన ఎంఓఆర్‌టీహెచ్‌ ప్రమాదాల నిరోధానికి యాక్షన్‌ ప్లాన్స్‌ రూపొందించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement