Voyager-1: హస్త లా విస్తా.. బేబీ! | Voyager 1 First Craft In Interstellar Space, May Have Gone Dark | Sakshi
Sakshi News home page

వోయేజర్-1.. బహుదూరపు బాటసారికి బై బై!

Published Sun, Mar 10 2024 7:20 AM | Last Updated on Sun, Mar 10 2024 11:18 AM

Voyager 1 First Craft in Interstellar Space May Have Gone Dark - Sakshi

అవసాన దశలో ‘వోయేజర్-1’ 

 ‘నక్షత్రాంతర’ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య

 భూమికి ‘పిచ్చి’ సందేశాలు  

 సరిదిద్దే పనిలో ‘నాసా’ 

 మనకు 2,440 కోట్ల కి.మీ. దూరంలో స్పేస్ క్రాఫ్ట్ 

 విశ్వవీధుల్లో చెరగని మానవాళి ముద్ర

వోయేజర్-1.. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తి. ఈ పేరు.. ఉత్సాహంగా నింగికేసి చూసేలా కొన్ని తరాల వారిని పురిగొల్పిన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర.. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర.. దాదాపు అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం.. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యం సాకారం.. అది గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికేగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక.. అదే వోయేజర్-1.

అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. అమెరికా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ఏడాది జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి.  గత ఏడాది నవంబరు నుంచి వోయేజర్-1 భూమికి సరైన సమాచారం ఇవ్వడం లేదు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం కోల్పోయిన వృద్ధ పక్షవాత రోగిలా... ‘నాసా’ శాస్త్రవేత్తలకు అది ‘పిచ్చి’ సందేశాలు పంపుతోంది.

వోయేజర్-1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్-1ను నిర్మించి, ప్రయోగించినప్పటి ‘నాసా’ సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు.

ప్రస్తుత సమస్య నుంచి తమ వ్యోమనౌక బయటపడితే అద్భుతం జరిగినట్టేనని వోయేజర్ ప్రాజెక్టు మేనేజర్ సుజానే డాడ్ వ్యాఖ్యానించారు. ఆమె 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. వోయేజర్-1 నేడు ముదిమి వయసులో ఉంది. దాని చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని తెలుస్తోంది.


జంట వోయేజర్స్ విజయాలు..
వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్-1, వోయేజర్-2 భాగస్వాములు. వోయేజర్-2ను వోయేజర్-1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్-2 ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ దాన్ని కూడా సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్-10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగా… గురుడు, శని గ్రహాల అన్వేషణ కోసం వోయేజర్ జంటనౌకలను పంపారు.

వీటితో గురు గ్రహం (బృహస్పతి)పై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగుచూశాయి. వోయేజర్-1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగ్నిపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి.

1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్-1 తన కెమెరాలో బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో...  ‘మానవాళి తనకుతాను గీసుకున్న సొంత చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక వోయేజర్-2 యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలు అంటారు. వాయుమయ గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లను బాహ్యగ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్-2 1989లో రికార్డు సృష్టించింది. 



సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! 
హీలియోస్ఫియర్ అంటే సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. హీలియోస్ఫియర్ అంచును హీలియోపాజ్ అంటారు. ఈ ‘హీలియోపాజ్’ను 2012లోనే వోయేజర్-1 దాటవేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా అది గణుతికెక్కింది. 2018లో  వోయేజర్-2 కూడా హీలియోస్ఫియర్ బాహ్య అంచును దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ (సూర్యుడు, ఇతర నక్షత్రాల మధ్యనున్న ప్రాంతం)లోకి ప్రవేశించింది. హీలియోపాజ్ ఆవల నుంచి నక్షత్రాంతర రోదసి మొదలవుతుంది.

కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్-1 అధ్యయనం చేస్తోంది. వోయేజర్-1కు భూమి నుంచి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, వ్యోమనౌక నుంచి శాస్త్రవేత్తలు డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. 



ఫ్లైట్ డేటా సిస్టమ్ లోపాలు   
వోయేజర్-1లో మూడు కంప్యూటర్లు ఉన్నాయి. అవి ఫ్లైట్ డేటా సిస్టమ్ (ఎఫ్డీఎస్), కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్ సిస్టమ్, ఆటిట్యూడ్ కంట్రోల్ అండ్ పాయింటింగ్ సిస్టమ్. వ్యోమనౌక సైన్స్ పరికరాల నుంచి శాస్త్ర పరిశోధనల డేటాను, నౌక ఆరోగ్యానికి సంబంధించిన ఇంజినీరింగ్ డేటాను ఎఫ్డీఎస్ సేకరించి సింగిల్ ప్యాకేజీగా మారుస్తుంది. అనంతరం అది టెలిమెట్రీ మాడ్యులేషన్ యూనిట్ (టీఎంయూ) ద్వారా బైనరీ కోడ్ రూపంలో భూమికి ప్రసారమవుతుంది.

ప్రస్తుతం ఎఫ్డీఎస్ కంప్యూటరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంజినీరింగ్, సైన్స్ డేటాను భూమికి పంపే సామర్థ్యాన్ని వోయేజర్-1 కోల్పోయింది. వోయేజర్-1, 2లలో ప్రయోగ సమయంలో రెండేసి ఎఫ్డీఎస్ లు ఉన్నాయి. దురదృష్టవాశాత్తు వోయేజర్-1 బ్యాకప్ ఎఫ్డీఎస్ 1981లో విఫలమైంది. ‘నాసా’ శాస్త్రవేత్తలు తాజాగా ఎఫ్డీఎస్ ను రీ-స్టార్ట్ చేసేందుకు యత్నించారు. కానీ ఈ అన్ ‘ప్లగ్ అండ్ ప్లగ్ ఇన్’ పద్ధతి ఫలితమివ్వలేదు. 2025 నాటికి వోయేజర్ జంట నౌకల్లోని ప్లూటోనియమ్ ఆధారిత అణుశక్తి జనరేటర్లు పని చేయడం మానేస్తాయని ‘నాసా’ అంచనా. భూమ్మీది జీవం, మానవాళి భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు, వివిధ భాషల్లో శుభాకాంక్షలు, ఆడియో-విజువల్ సందేశాలను డిస్కుల (గోల్డెన్ రికార్డులు) రూపంలో ఈ నౌకల్లో పంపారు. 

(Photo Credits: The New York Times, NASA, Business Insider, Gizmodo, NPR, Popular Mechanics, WIRED, Ars Technica, Science Alert, Popular Science, Smithsonian Magazine)

✍️ జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement