గ్లోబల్ బైక్ బ్రాండ్స్‌కు భారత్ లైఫ్‌లైన్!
విదేశీ దిగ్గజాలను కొనుగోలు చేసి సత్తా చాటుతున్న దేశీ కంపెనీలు
మనోళ్ల చేతిలో ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న అమ్మకాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్‌ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్‌లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్‌లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్‌లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!
మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్‌ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్‌లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది.
2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్‌ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.
యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’
అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్‌ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్‌తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్‌ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.
అదే బాటలో టీవీఎస్, హీరో...
ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్‌లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్‌ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు.
ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్‌సన్‌కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం!
→ 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్‌ఏ వంటి గ్లోబల్ ఐకాన్‌లను దక్కించుకుని, పునరుద్ధరించారు.
→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.
→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.
→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్‌సన్‌కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment