harley davidson
-
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్‌సైకిల్స్ (ఫోటోలు)
-
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్ నిలిపివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ 25,597 యూనిట్లు బుకింగ్స్‌ను నమోదు చేసిందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. జూలై 4న బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బుకింగ్స్ నిలిపివేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. సెప్టెంబరులో తయారీ మొదలుపెట్టి అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. ఎక్స్‌షోరూంలో ఎక్స్440 ధరలు డెనిమ్ వేరియంట్ రూ.2.39 లక్షలు, వివిడ్ రూ.2.59 లక్షలు, ఎస్ వేరియంట్ రూ.2.79 లక్షలు ఉంది. ‘ప్రీమియం విభాగంలోకి ప్రవేశించడంపై కస్టమర్లు చూపుతున్న విశ్వాసాన్ని చూస్తుంటే సంతోషం కలుగుతోంది. బుకింగ్స్ ఎక్కువ భాగం టాప్ ఎండ్ మోడల్ నుండి వస్తున్నాయి. వినియోగదార్లు సరైన బ్రాండ్, మోడల్‌కు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని దీనినిబట్టి స్పష్టం అవుతోంది. ప్రీమియం విభాగంలో గెలుపొందేందుకు కంపెనీ ప్రయాణానికి ఇది ప్రారంభం మాత్రమే’ అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. హార్లే డేవిడ్సన్ బైక్స్ అభివృద్ధి, విక్రయం కోసం 2020 అక్టోబరులో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. -
గత నెలలో విడుదలైంది.. అప్పుడే కొత్త ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ధరను అన్ని వేరియంట్లలో రూ.10,500 పెంచినట్లు హీరో మోటోకార్ప్ బుధవారం ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్లో రూ.2.29–2.69 లక్షల ధరలో కంపెనీ ఈ మోడల్‌ను గత నెలలో ఆవిష్కరించింది. తాజా సవరణతో ప్రస్తుతం ఈ ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త ధర ఆగస్ట్ 4 నుంచి అమలులోకి రానుందని కంపెనీ వెల్లడించింది. 2023 నుంచి ఎక్స్440 డెలివరీలు ఉంటాయని వివరించింది. -
హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్, ఏకంగా పదివేలు!
Harley Davidson X440:హార్లే-డేవిడ్సన్ లవర్స్‌కు భారీ షాక్. హీరో మోటోకార్ప్ హార్లే-డేవిడ్సన్ బైక్స్ లేటెస్ట్ బైక్ ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 10,500 మేర ధరలను పెంచింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని హీరో మోటోకార్ప్ ధృవీకరించింది. ధర పెంపు తర్వాత, హార్లే-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ. 2,39,500 నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ప్రస్తుత ప్రారంభ ధర ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు హీరో మోటోకార్ప్ గత నెలలో విడుదల చేసిన హార్లే డేవిడ్సన్ ఎక్స్440 కొత్త ధరను ప్రకటించింది. కంపెనీ ప్రయోగ ధరతో పోలిస్తే రూ.10,500 ఖరీదు ఎక్కువ. ఇది 2,29,000 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. (టికెట్ల ధరలకు ‘రెక్కలు’: ప్రయాణీకులకు ఇక చుక్కలే!) హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, హార్లీ-డేవిడ్సన్ ఎక్స్ 440 ప్రారంభించినప్పటి నుంచి మంచి ఆదరణ లభించిందనీ, ఆన్లైన్ బుకింగ్‌ల తదుపరి విండోకు వర్తించే కొత్త ధరను ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. హీరో మోటో భాగస్వామ్యంతో, అమెరికా ప్రీమియం ఆటోమొబైల్ హార్లే-డేవిడ్సన్ భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను అందుబాటులోకి తెస్తోంది. డిమాండ్కనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ధృవీకరించింది.సెప్టెంబర్‌లో భారతదేశంలోని రాజస్థాన్‌లోని నీమ్రానాలోని వారి గార్డెన్ ఫ్యాక్టరీలో హార్లే-డేవిడ్సన్ X440 ఉత్పత్తిని ప్రారంభిస్తారు. బుకింగ్ తేదీల ఆధారంగా అక్టోబర్ 2023లో కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా హార్లే-డేవిడ్సన్ ఎక్స్ 440 సెగ్మెంట్లో అత్యంత సరసమైన బైక్‌గా చెప్పవచ్చు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా హెచ్నెస్ CB350, బెనెల్లీ ఇంపీరియాలే 400 వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బైక్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్టు హీరో మోటోకార్ప్ మంగళవారం ప్రకటించింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయి. హార్లే డేవిడ్సన్ షోరూంలు, ఎంపిక చేసిన హీరో మోటోకార్ప్ ఔట్లెట్స్, ఆన్లైన్లో రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 440 సీసీ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్స్‌ను నీమ్రానా ప్లాంటులో హీరో మోటోకార్ప్ తయారు చేస్తోంది. 440 సీసీ విభాగంలోకి ఇరు కంపెనీలు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లలో ఎక్స్440 లభిస్తుంది. ఎక్స్‌షోరూం ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం. 2020 అక్టోబర్‌లో హీరో మోటోకార్ప్, హార్లే డేవిడ్సన్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేయడంతోపాటు విక్రయిస్తుంది. (తప్పుదోవ పట్టించే ప్రకటనలు బీమా బ్రోకరేజీలపై ఫిర్యాదు) -
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ఫొటోలు విడుదల
అమెరికన్ టూవీలర్ కంపెనీ హార్లే డేవిడ్సన్ బైక్‌లంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉంది. అత్యంత ఖరీదైన ఈ బైక్‌లను భారత్‌లోనూ చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440) ఫొటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో భారత్‌లో వీటిని అభివృద్ధి చేసి తయారు చేయడం విశేషం. కంపెనీ విడుదల చేసిన కొత్త ఫొటోల ఆధారంగా హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ఇంజిన్, డిజైన్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజిన్ ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ 440సీసీ ఇంజన్ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ మోటార్‌తో ఇది పోటీపడుతుంది. తరువాతి పవర్ ఫిగర్లు 20.2బీహెచ్పీ, 27ఎన్ఎం టార్క్. హార్లే-డేవిడ్సన్ 440సీసీ పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్లను వెల్లడించనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్కు సమానమైన అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ హార్లే డేవిడ్సన్ XR డిజైన్ ఎథోస్ నుంచి ప్రేరణ పొందిన ఎక్స్440 అనేది రోడ్‌స్టర్ అంటే ఇది ఫ్లాట్, విశాలమైన హ్యాండిల్‌బార్‌తో రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. పాదాల పెగ్‌లు క్రూయిజర్ లాగా ముందుకు, వెనుకకు కదిలే వీలు ఉండదు కాబట్టి సీటింగ్ స్థానం తటస్థంగా ఉంటుంది. సరళమైన గుండ్రని ఆకారపు ఎల్ఈడీ హెడ్‌లైట్, వృత్తాకార ఇండికేటర్లు, అద్దాలు ఉంటాయి. స్లిమ్‌గా రూపొందించిన చతురస్రాకారపు ఇంధన ట్యాంక్‌పై హార్లే డేవిడ్సన్ ఎక్స్440 ట్యాగ్ ఉంటుంది. హార్డ్‌వేర్ కొత్త ఎక్స్440 రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్‌లతో వస్తుంది. ఎంఆర్ఎఫ్ టైర్లతో 18 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ ఉంటాయి. అలాగే సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. Soak in the beauty. The scenery isn’t too shabby either. Come 3rd July, everything will change. The H-D X440.#HarleyDavidson #HarleyDavidsonIndia #HD120 #HDIndia #HDX440 #X440 All pictures shown are for illustration purposes only. Actual products may vary. pic.twitter.com/onkurmHRY1 — Harley-Davidson Ind (@HarleyIndia) June 9, 2023 ధర బజాజ్ ట్రయంఫ్ 400, హార్లే డేవిడ్సన్ ఎక్స్440 రెండు మోటార్‌సైకిళ్లూ పోటాపోటీగా వస్తున్నాయి. జులైలో వీటిని ఆయా కంపెనీలు మార్కెట్‌కు పరిచయం చేయనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350కి పోటీగా వస్తున్న హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలు ఉండవచ్చు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
రూ. 3.93 లక్షలకే హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్350 బైక్
ప్రముఖ లగ్జరీ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్సన్ ఎట్టకేలకు X350 మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రస్తుతం కేవలం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంటుంది. దీని ధర 33,388 యువాన్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.93 లక్షలు. చైనా మార్కెట్లో విజయం పొందిన తరువాత ఇండియా, బ్రెజిల్, థాయ్‌లాండ్ మార్కెట్లలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ 353 సీసీ, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 34 బిహెచ్పి పవర్, 31 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో హ్యార్లీ డేవిడ్సన్ బైకులు చెప్పుకోదగ్గవి. అయితే ఇప్పుడు విడుదలైన ఎక్స్350 తక్కువ ధరతో లభించే మొదటి బైక్ అవుతుంది. ఈ లేటెస్ట్ బైక్ ముందు వైపు 41 మిమీ యుఎస్డి ఫోర్క్స్, వెనుక వైపు మోనో షాక్, ట్రెల్లిస్ ఫ్రేమ్, ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్‌లు పొందుతుంది. (ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్: కొత్త 'హ్యుందాయ్ కోన' వచ్చేస్తోంది) ఈ కొత్త బైక్ 13.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల లాంగ్ రైడింగ్‌కి కూడా అనుకూలంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అదే సమయంలో జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. -
హ్యార్లీ డేవిడ్సన్ కొత్త బైకులు.. మునుపెన్నడూ చూడని కొత్త డిజైన్‌తో
పాపులర్ అమెరికన్ బైక్ తయారీ కంపెనీ హార్లే-డేవిడ్సన్, చైనీస్ దిగ్గజం కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్‌తో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో తక్కువ సామర్థ్యం కలిగిన బైక్ మోడల్ అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా పుట్టుకొచ్చిన X350 రేపు (మార్చి 10) మార్కెట్లో విడుదలకానుంది. హార్లే-డేవిడ్సన్ చైనీస్ మార్కెట్లో ఎక్స్350 బైకుతో పాటు, ఎక్స్500 బైకుని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ బైకులో (ఎక్స్500) ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ బైకుల్లో వి-ట్విన్ ఇంజిన్ లేకపోవడం గమనార్హం. దీని స్థానంలో లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఈ బైకుల డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. నియో రెట్రో రోడ్‌స్టర్ స్టైలింగ్ ఇప్పుడు చూడవచ్చు. ఎల్ఈడీ లైటింగ్స్, యుఎస్డీ ఫోర్క్, ఆఫ్సెట్ మోనోషాక్ సెటప్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా చిన్న డిజిటల్ ఇన్సెట్తో అనలాగ్ స్పీడోమీటర్ కూడా అందుబాటులో ఉంటుంది. రెండు బైక్‌లు హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ లైనప్‌లో జాబితా చేయబడ్డాయి. కావున భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా విక్రయించబడే అవకాశం ఉంది, ప్రస్తుతం ఈ కొత్త బైకులు చైనీస్ మార్కెట్లో మాత్రమే విడుదలవుతాయి, భారతదేశంలో ఈ బైకుల లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
వందేళ్ల నాటి బైక్‌కి ఇంత క్రేజా.. కోట్లు పెట్టి మరీ..!
సాక్షి, ముంబై: 'హార్లే డేవిడ్సన్' ఈ పేరుకి ప్రపంచ మార్కెట్లో పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అత్యంత ఖరీదైన వెహికల్ తయారీ సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచిన ఈ బ్రాండ్ చాలా సంవత్సరాల క్రితం కూడా వాహనాలను తయారు చేసింది అని చాలా తక్కువమందికే తెలుసు. 1908వ సంవత్సరంలో అంటే సుమారు 110 సంవత్సరాల ముందు హార్లే డేవిడ్సన్ తయారు చేసిన ఒక వెహికల్ ఇటీవల వేలంలో అక్షరాలా రూ. 7 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజమే. 'ఓల్డ్ ఐస్ గోల్డ్' అంటే ఇదేనేమో.. నిజానికి ఆశ్చర్యం కలిగించే రీతిలో అమ్ముడైన ఈ 'హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్‌సైకిల్' అమెరికాలో లాస్ వెగాస్‌లో మెకమ్ వేలం ద్వారా విక్రయించారు. వేలం పాటలో ఇది 9,35,000 డాలర్లకు అమ్ముడు బోయింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 7.73 కోట్లు. ఈ రకమైన మోటార్ సైకిల్స్‌ని కంపెనీ 1908 లో కేవలం 450 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అందులో ఒకటే ఇటీవల వేలం పాటలో విక్రయించబడిన హార్లే డేవిడ్సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్. దాదాపు 110 సంవత్సరాల క్రితం మోటార్‌సైకిల్ ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉండటం విశేషమే మరి. ఇందులో వీల్స్ , ఇంజిన్ బెల్ట్-పుల్లీ, మఫ్లర్ స్లీవ్, సీటు కవర్ , దాని ఆయిల్ ట్యాంక్ వంటి భాగాలను కూడా ఇందులో స్పష్టంగా చూడవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీ వెహికల్స్ కంటే కూడా ఇది చాలా ఖరీదైనది స్పష్టంగా తెలుస్తోంది. -
భారత్ ఆటోమొబైల్.. ‘అమ్మో’రికా!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో.. అమెరికన్ కంపెనీలు రాణించలేక చతికిలపడుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం యూఎస్ బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. భారత్ మార్కెట్ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం.. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉండడం వాటి వైఫల్య కారణాల్లో ప్రధానమైనవి. జనరల్ మోటార్స్ (చెవ్రోలెట్), హార్లే డేవిడ్సన్ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా ఫోర్డ్ మోటార్స్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లో దిగ్గజ బ్రాండ్లు కావడం గమనార్హం. దీంతో భారత ఆటో మార్కెట్ ప్రపంచ ఆటో దిగ్గజాలకు, ముఖ్యంగా అమెరికన్ కంపెనీలకు ఎందుకు మిస్టరీగా ఉంటోందన్న ప్రశ్న మరోసారి ఉదయించింది. ముందు అంచనాలు ఘనంగానే ఉంటాయి. కానీ భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా కంపెనీల అంచనాలు మారిపోతున్నాయి. ఒక స్థాయికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు సాహసించడం లేదు. ఇదే మార్కెట్లో దక్షిణ కొరియా, జపాన్, ఆఖరుకు చైనా కంపెనీలు పోటీపడుతూ బలంగా చొచ్చుకుపోతుంటే.. అమెరికా కంపెనీలకే ఈ పరిస్థితి ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది. వృద్ధి బలహీనం భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. దీనికితోడు 2010 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం మధ్య విక్రయాల్లో వార్షిక వృద్ధి 3.6 శాతం మించి లేదు. అంతకుముందు పదేళ్ల కాలంలో విక్రయాల్లో వృద్ధి 10 శాతంపైనే కొనసాగుతూ వచ్చింది. వృద్ధి బలహీనంగా> ఉండడం కూడా అమెరికా కంపెనీల కష్టాలకు కారణమేనని చెప్పుకోవచ్చు. 2011లో ఫోర్డ్ అత్యధికంగా 98,537 కార్లను విక్రయించగా.. అదే గరిష్టంగా మిగిలిపోయింది. ఇందులో సగం కార్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక్క నెలలోనే విక్రయిస్తుండడాన్ని పరిశీలించాలి. మారుతి సుజుకీ తర్వాత దేశీ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ రెండో దిగ్గజంగా కొనసాగుతోంది. ఫలించని ఫోర్డ్ ప్రయత్నాలు ఫోర్డ్ మోటార్స్ 2019లో మహీంద్రా అండ్ మహీంద్రాతో కలసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఫోర్డ్‌కు 49 శాతం వాటా, మహీంద్రాకు మెజారిటీ వాటాను ప్రతిపాదించాయి. ఈ ప్రయత్నంతో అయినా నష్టాలకు చెక్‌పెట్టి.. లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఫోర్డ్ ఆశపడగా.. అది కూడా సఫలం కాలేదు. జాయింట్ వెంచర్ ప్రతిపాదన నుంచి రెండు సంస్థలు గతేడాది విరమించుకున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత పదేళ్లలో రెండు బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను (రూ.15వేల కోట్లు) మూటగట్టుకున్న ఫోర్డ్.. ఇక్కడ ఇక నెగ్గలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. ఫలితమే నిష్క్రమణ నిర్ణయం. ఖరీదైన బైక్‌లకు పేరొందిన హార్లేడేవిడ్సన్ కూడా 2020 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ప్రత్యక్ష కార్యకలాపాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించడం గమనించాలి. విక్రయాలు ఆశించిన మేర లేకపోవడం, బైక్‌ల తయారీని స్థానికంగా చేపట్టకుండా దిగుమతులపైనే ఈ సంస్థ ఆధారపడడం ప్రతిబంధకాలుగా మారాయి. దిగుమతి చేసుకునే బైక్‌లపై పన్నుల భారం అధికంగా ఉండడంతో.. దీన్ని తగ్గించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పలు సందర్భాల్లో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు కూడా. అయినా ఆ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు. దీంతో భారత్‌లో నేరుగా విక్రయ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు హార్లే డేవిడ్సన్ ప్రకటించింది. ఆ తర్వాత భారత్‌లో హార్లే డేవిడ్సన్ విక్రయాలు, సర్వీసు కోసం హీరో మోటోతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. సరైన వ్యూహాల్లేకపోవడం? భారత కస్టమర్లు ‘వ్యాల్యూ ఫర్ మనీ’ చూస్తారు. తాము పెడుతున్న డబ్బుకు తగిన విలువ లభిస్తుందా? అని ఎక్కువ మంది పరిగణించే అంశం. అమెరికా దిగ్గజాలు.. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో మాదిరే భారత్‌లోనూ ‘బిగ్ ఈజ్ బ్యూటిఫుల్’ (పెద్దదే ముద్దు) మంత్రం ఫలిస్తుందన్న అంచనాలు తప్పాయి. చిన్న కార్లు, తక్కువ ఖరీదున్న బైక్‌లకే ఇక్కడ పెద్ద మార్కెట్ అన్న సూక్ష్మాన్ని అవి గుర్తించలేకపోయాయి. భారత్‌లో ప్రతీ 10 కార్లు, మోటారుసైకిళ్ల విక్రయాల్లో 7 బడ్జెట్ విభాగంలోనివే ఉంటున్నాయి. పైగా ఇతర మార్కెట్లలో మాదిరే ఉత్పత్తులు, మార్కెటింగ్ విధానాలు భారత్‌లో ఫలిస్తాయన్న అంచనాలూ సరికాదు. భారత కస్టమర్లు విక్రయానంతర సేవలనూ దృష్టిలో పెట్టుకుంటారన్నది నిజం. మారుతీ, హ్యాందాయ్, ఇటీవలే ప్రవేశించిన కియా మెరుగ్గా రాణించడానికి మార్కెట్నాడిని పట్టుకోవడం వల్లేనని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. ‘‘జపాన్, కొరియా సంస్థల్లా కాకుండా.. ఇతర పాశ్చాత్య వాహన కంపెనీలు బలహీన యాజమాన్య నిర్వహణ, భారత్ లో పోటీ విషయం లో బలహీన అంచనా లే అవి రాణించలేకపోవ డానికి కారణాలు’’ అని రెనో అండ్ స్కోడా భారత ఆపరేషన్స్‌కు గతంలో చీఫ్‌గా పనిచేసిన సుధీర్‌రావు చెప్పారు. పన్నుల పాత్ర.. జీఎం, ఫోర్డ్, ఇతర అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు భారత్‌లో విజయం సాధించలేకపోవడం వెనుక పన్నుల పాత్ర కూడా ఉందని పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉన్న విషయాన్ని పేర్కొంటున్నారు. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.2 లీటర్ల సామర్థ్యం వరకు ఇంజన్లు కలిగిన కార్లపై జీఎస్టీ 28 శాతం, ఒక శాతం సెస్సు అమల్లో ఉంది. ఇంతకుమించి పొడవు, ఇంజన్ సామర్థ్యాలతో కూడిన కార్లపై పన్ను భారం 50% వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా పన్నుల విధానం లేదని టొయోటా కిర్లోస్కర్ మోటార్ మాజీ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. చిన్న కార్ల మోడళ్లను తీసుకొచ్చినా విక్రయాలు భారీగా ఉంటే తప్ప లాభసాటి కాదన్నారు. ‘టొయోటా ఒక్క ఇన్నోవా వాహనం విక్రయంపై వచ్చిన లాభాన్ని.. చిన్న కార్ల నుంచి తెచ్చుకోవాలంటే కనీసం 80 ఎటియోస్లను విక్రయించాల్సి ఉంటుంది’ అన్నారు. -
కంటిన్యూ అవుతాం: హార్లీ డేవిడ్సన్
న్యూఢిల్లీ, సాక్షి: లగ్జరీ బైకులను ఇష్టపడేవారికి శుభవార్త! హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. వెరసి 2021 జనవరి నుంచి అమ్మకాలు, విడిభాగాలు, సర్వీసులు తదితరాలను ఎప్పటిలాగే అందించనున్నట్లు తెలియజేసింది. సుమారు రెండు నెలల క్రితం డిసెంబర్‌కల్లా దేశీ మార్కెట్ల నుంచి వైదొలగనున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం విదితమే. దేశీయంగా తయారీ, అమ్మకాలను నిలిపివేయనున్నట్లు సెప్టెంబర్ చివరి వారంలో కంపెనీ తెలియజేసింది. కాగా.. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు.. ఇతర బిజినెస్‌లను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. హీరో మోటోతో జత దేశీ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో ఇప్పటికే హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యం, పంపిణీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల విక్రయాలు, సర్వీసింగ్ బాధ్యతలను హీరో మోటో నిర్వహించనుంది. అంతేకాకుండా విడిభాగాలు, కంపెనీ సంబంధ యాక్సెసరీస్, దుస్తులు తదితరాల అమ్మకాలను సైతం చేపట్టనుంది. హీరో మోటోతో ఒప్పందం ప్రకారం కొత్త మోడళ్లను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు హీరో మోటో, హార్లీ డేవిడ్సన్కుగల డీలర్షిప్ నెట్‌వర్క్‌ను రెండు కంపెనీలూ వినియోగించుకోనున్నాయి. ప్రణాళికలో మార్పులు ప్రస్తుతం దేశీ మార్కెట్లకు సంబంధించి బిజినెస్ మోడల్ ప్రణాళికలను సవరించుకున్నట్లు హార్లీ డేవిడ్సన్ ఇండియా, వర్ధమాన మార్కెట్ల ఎండీ సంజీవ్ రాజశేఖరన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప్‌తో కలసి ప్రయాణించనున్నట్లు పేర్కొన్నారు. తమ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు హీరో మోటోతో కలసి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. హెచ్‌వోజీ ర్యాలీలతోపాటు ఈ అంశాలపై జనవరి నుంచి అప్డేట్స్ను అందించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ దేశీయంగా హార్లీ ఓనర్స్ గ్రూప్(హెచ్‌వోజీ) కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వివరించారు. ప్రస్తుత డీలర్లు డిసెంబర్‌వరకూ కొనసాగుతారని.. తదుపరి కొత్త డీలర్‌షిప్స్‌ను ప్రకటించగలమని పేర్కొన్నారు. డీలర్ల అసంతృప్తి దేశవ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్కు 33 ప్రత్యేక డీలర్షిప్స్ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కాగా.. హార్లీ డేవిడ్సన్ దేశీయంగా కార్యకలాపాల నిలిపివేతకు నిర్ణయించుకున్న నేపథ్యంలో డీలర్లకు చెల్లించనున్న నష్టపరిహారం మరీ తక్కువగా ఉన్నట్లు పలువురు డీలర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశాయి. డీలర్షిప్స్పై వెచ్చించిన పెట్టుబడులతో పోలిస్తే తాము భారీగా నష్టపోయే అవకాశమున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. దీంతో కొంతమంది డీలర్లు ఏజెడ్‌బీ అండ్ పార్టనర్స్‌ను న్యాయ సలహాల కోసం ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం! -
భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం -
బైక్ లవర్స్ కు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది. కుర్రకారు డ్రీమ్ బైక్ అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాలనుంచి నిష్ర్కమించాలని భావిస్తోంది. భవిష్యత్తు డిమాండ్ పై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుందని తాజా వార్తల ద్వారా తెలుస్తోంది. హర్యానాలోని బావాల్ వద్ద తన ప్లాంట్ ను త్వరలోనే మూసివేయనుంది. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఒప్పందం నిమిత్తం కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు సమాచారం. గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా హార్లే-డేవిడ్సన్ ఈ సంకేతాలు అందించింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి బైక్‌లతో దేశీయ కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించింది. అంతేకాదు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అటు దేశీయంగా ఇటు, అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. విక్రయాలు దాదాపు శూన్యం కావడంతో స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలోనే హార్లే డేవిడ్సన్ ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది. 2018 లో విక్రయించిన 3,413 యూనిట్లతో పోలిస్తే 2019 లో 22 శాతం తగ్గి 2,676 యూనిట్లకు చేరుకోగా, 2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్ పరంగా తమకు భారత్ అత్యంత చెత్త మార్కెట్ అని పేర్కొంది. అయితే తాజా ఊహాగానాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. హార్లే-డేవిడ్సన్ నిష్క్రమణ అంచనాలు నిజమైతే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి భారతదేశంలో కార్యకలాపాలను మూసివేసిన రెండవ వాహన తయారీదారుగా హార్లే-డేవిడ్సన్. 2017 లో జనరల్ మోటార్స్ గుజరాత్ ప్లాంట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే. -
సీఎఫ్ఓ ఔట్, 700 ఉద్యోగాలు కట్
సాక్షి, న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రసిద్ధ బైక్స్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను తొలగించనున్నామని ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారికారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సంస్థను పునరుద్ధరించే తన కొత్త వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. 'ది రివైర్' పేరుతో హార్లే-డేవిడ్సన్ ఉద్యోగ కోతలు, పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణం, ఖర్చులు తగ్గింపులాంటి చర్యల్లో భాగంగా 700మంది తొలగించనున్నామని, వీరిలో 200మంది ఇప్పటికే నిష్క్రమించగా, మిగిలిన 500మందిని 2020 చివరి నాటికి తొలగించాలని భావిస్తున్నామని హార్లే డేవిడ్సన్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. తద్వారా కంపెనీకి 42 మిలియన్ల డాలర్లు ఖర్చు ఆదా అవుతుంది 17 సంవత్సరాల పాటు హార్లేతో ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ ఒలిన్ సంస్థకు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన డారెల్ థామస్‌ను ఎంపిక చేసింది. హార్లే-డేవిడ్సన్ను విజయవంతమైన మార్గంలో తీసుకురావడానికి గణనీయమైన మార్పులు అవసరం, అందుకు సరికొత్త దశలో కృషి జరుగుతోందనీ, మొత్తం కంపెనీ అంతటా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని హార్లే-డేవిడ్సన్ సీఈఓ జోచెన్ జైట్జ్ ప్రకటించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా హార్లేలో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
బీఎస్–6 ప్రమాణాలతో దూసుకొచ్చిన ‘స్ట్రీట్ 750’
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్.. తాజాగా తన ‘స్ట్రీట్ 750’ బైక్‌లో నూతన వెర్షన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన మోడల్‌ను మంగళవారం విడుదలచేసింది. దీని ధర రూ.5.47 లక్షలు. యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), 750 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చిన ఇదే మోడల్లో 300 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్‌లో హార్లీ 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తమ జర్నీని ప్రతిబింబించే విధంగా లిమిటెడ్ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ ఎండీ సజీవ్ రాజశేఖరన్ పేర్కొన్నారు. ప్రీమియం విభాగంలో తొలి ఎలక్ట్రిక్ బైక్ భారత్‌లో తన తొలి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌ను హార్లీ డేవిడ్సన్ ఆవిష్కరించింది. ‘లైవ్‌వైర్’ మోడల్లో ఈ వాహనాన్ని పరిచయంచేసింది. ఇక గడిచిన పదేళ్ల కాలంలో కంపెనీ 24,000 యూనిట్లను ఇక్కడి మార్కెట్లో విక్రయించింది. మొత్తం 17 మోడళ్లను ప్రస్తుతం విక్రయిస్తోంది. వీటిలో 11 మోడళ్లను హర్యానాలోని బావాల్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తోంది. -
భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్ బైక్‌లపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్ బైక్ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28–29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్ ట్రంప్, భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు. భారత ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆయన హెచ్చరించారు. హార్లే డేవిడ్సన్ బైక్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యే బైక్‌లపై విధిస్తున్న సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుంకాల విషయమై సుదీర్ఘకాలంగా అమెరికా దోపిడీకి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు 80,000 కోట్ల డాలర్ల మేర ఉందని పేర్కొన్నారు. చైనా తర్వాత ట్రంప్ తదుపరి లక్ష్యం భారతేనని అమెరికా మీడియా భావిస్తోంది. ఈ–కామర్స్, డేటా లోకలైజేషన్‌పై భారత్ ఆంక్షలు అమెరికా కంపెనీలపై బాగా నే ప్రభావం చూపాయని, ఇది భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
హార్లీ డేవిడ్సన్ బాయ్‌కాట్
అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్‌కు తగిలిన సంగతి తెలిసిందే. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్.. తన బైకుల ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ హార్లీ డేవిడ్సన్ కనుక అమెరికా వెలుపల ఉత్పత్తిని చేపడితే, వినియోగదారులు ఈ బైకులను బాయ్‌కాట్ చేయనున్నారు. వినియోగదారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతిస్తున్నారు. అంతేకాక వినియోగదారులను పొగుడుతూ... గ్రేట్ అని ప్రశంసలు కురిపించారు. దీనిపై ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు. ‘ఒకవేళ అమెరికా వెలుపల హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తిని ప్రారంభిస్తే చాలా మంది హార్లీ డేవిడ్సన్ యజమానాలు కంపెనీని బాయ్‌కాట్ చేయాలనుకుంటున్నారు. గ్రేట్! చాలా కంపెనీలు ముఖ్యంగా హార్లీ ప్రత్యర్థులు మా బాటలో నడుస్తున్నాయి. కానీ ఇది చాలా చెత్త తరలింపు’ అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌పై హార్లీ డేవిడ్సన్ ఇంకా స్పందించలేదు. ట్రంప్ కార్యాలయానికి, హార్లీ డేవిడ్సన్ కంపెనీకి గత కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించారు. ట్రంప్ ఆ నిర్ణయానికి కౌంటర్‌గా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుపై పన్నులు విధించింది. వాటిలో హార్లీ మోటార్‌సైకిల్స్ కూడా ఉన్నాయి. దీంతో హార్లీ డేవిడ్సన్ ఏడాదికి 100 మిలియన్ డాలర్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీగా ఆదాయం కోల్పోతుండటంతో, కంపెనీకి చెందిన కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ కొన్ని ఆపరేషన్లను థాయ్‌లాండ్ తరలించాలని చూస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొంత ఉత్పత్తిని తరలించినట్టు హార్లీ డేవిడ్సన్ చెప్పింది. అమెరికాలోకి వచ్చే ఇతర మోటార్ సైకిల్ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని ట్రంప్ గత నెలలోనే చెప్పారు. -
హార్లీ డేవిడ్సన్ నుంచి చిన్న బైక్‌లు!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ భారత మార్కెట్లో పట్టు పెంచుకునే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చిన్న బైక్‌లను ఇక్కడ విడుదలచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన విధంగా 200 నుంచి 500సీసీ కేటగిరీలో ద్విచక్ర వాహనాలను అందించే యోచనలో ఉన్నట్లు ఇన్వెస్టర్ కమ్యూనికేషన్లో హార్లీ డేవిడ్సన్ తెలియజేసింది. వచ్చే రెండేళ్లలో ఈ బైక్‌లను భారత్‌లో విడుదలచేయనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఇతర ఆసియా దేశాలలో కూడా బైక్‌లను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ఆదాయం, నూతన ఉత్పత్తుల కారణంగా భారత్‌లో 200–500సీసీ విభాగం అమ్మకాలు 2017లో 7 లక్షల యూనిట్లకు చేరుకుని 25 శాతం వృద్ధిరేటును నమోదుచేసినట్లు వివరించింది. పలు వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాట్లు చేసుకుంటూ పోటీ కంపెనీలు ఇప్పటికే భారత మార్కెట్లో పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. -
ప్రపంచంలోనే ఖరీదైన బైక్! కానీ..
భూగోళం మీద ఇప్పటిదాకా తయారుచేసినవాటిలో అత్యంత ఖరీదైన బైక్ ఇది. ధర మన కరెన్సీలో అక్షరాల 12కోట్ల రూపాయలు! ‘వజ్రవైఢూర్యములు పొదగబడిన కంఠాభరణములు... రత్నమాణిక్యములు కూర్చబడిన కంకణములు...’ అంటూ బ్రహ్మీ చెప్పిన డైలాగ్ తరహాలో ఈ బైక్‌కు.. 350 వజ్రాలు, బంగారు రేకులు, విలువైన రంగురాళ్లు తదితర హంగులన్నీ అద్దారు. ఈ అరుదైన సృష్టి మరెవరిదోకాదు.. ప్రఖ్యాత హార్లే డేవిడ్సన్ కంపెనీదే. సరే, బైక్ అంటే ప్రాణమించ్చే కొందరు.. రిస్క్ చేసైనా దీన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ అది సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే.. హార్లే డేవిడ్సన్ బ్లూ ఎడిషన్ అనే పేరుతో రూపొందిన ఈ మోడల్‌ను.. ప్రఖ్యాత చేతి గడియారాల కంపెనీ ‘బుకెరర్’ ప్రత్యేకంగా తయారుచేయించింది. ఖరీదైన గడియారాలు రూపొందించే బుకెరర్.. అతిత్వరలోనే సరికొత్త వాచ్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఆ వాచ్ ప్రమోషన్ కోసం ఏకంగా బైక్‌ను వాడేసుకుందిలా. అఫ్కోర్స్, హార్లే డేవిడ్సన్ కంపెనీ కూడా తన ఖ్యాతికి తగ్గట్లుగా బ్లూ ఎడిషన్‌ను అత్యద్భుతంగా తయారుచేసిందనుకోండి. ఎప్పటికీ (రోడ్డుమీదికి) మార్కెట్లోకి రాదన్నమాటేగానీ.. ఆ ఠీవీ, లుక్కు సూపర్ కదా! (వీడియో కింద ఫొటో గ్యాలరీ చూడండి) -
ప్రపంచంలోనే ఖరీదైన బైక్.. ధర 12కోట్లు
-
హార్లే డేవిడ్సన్లో రెండు కొత్త మోడళ్లు
న్యూఢిల్లీ: విలాసవంతమైన బైక్‌లు తయారు చేసే అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ కంపెనీ సాఫ్టైల్ పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త మోడళ్లు– లో రైడర్, డీలక్స్‌లను భారత మార్కెట్లోకి తెచ్చింది. లో రైడర్ మోడల్ ధర రూ.12.99 లక్షలని, డీలక్స్ ధర రూ.17.99 లక్షలని హార్లే డేవిడ్సన్ ఇండియా, చైనా ఎమ్డీ పీటర్ మ్యాక్ కోంజీ తెలిపారు. ఈ రెండు బైక్‌లను 1745 సీసీ మిల్వాకీ–ఎయిట్ 107 ఇంజిన్‌తో రూపాందించామని పేర్కొన్నారు. ఈ రెండు బైక్‌ల్లో డ్యుయల్–బెండింగ్ వాల్వ్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనక భాగంలో అడ్జెస్ట్ చేసుకునే మోనోషాక్ అబ్జార్బర్స్ ఉన్నాయని తెలిపారు.మై18 సాఫ్టైల్ మోడళ్లను గత ఏడాది అక్టోబర్‌లో అందుబాటులోకి తెచ్చామని, తాజాగా ఇప్పుడు మరో రెండు మోడళ్లను అందిస్తున్నామని మ్యాక్ తెలిపారు. కాగా హార్లే డేవిడ్సన్ కంపెనీ టూరింగ్, సీవీఓ మోడళ్ల ధరలను సవరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. -
భారీగా తగ్గిన హార్లే డేవిడ్సన్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికన్ బైకు తయారీదారు హార్లే డేవిడ్సన్ తన బైకు ధరలను భారీగా తగ్గించింది. 2017 ఎడిషన్‌కు చెందిన ఫ్యాట్ బాయ్, హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ మోడల్ ధరలను రూ.2.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. స్టాక్‌ను క్లియర్ చేసుకోవడం కోసం హార్లే డేవిడ్సన్ వీటిపై భారీగా ధరలను తగ్గించింది. ఫ్యాట్ బాయ్ ధర రూ.2,01,010మేర చౌకగా మారి, 14,99,990 రూపాయలకు దిగొచ్చింది. ఈ బైకు అసలు ధర 17,01,000 రూపాయలు. అదేవిధంగా హెరిటేజ్ సాఫ్టైల్ క్లాసిక్ మోడల్ కూడా 18,50,000 రూపాయల నుంచి 15,99,990 రూపాయలకు తగ్గినట్టు తెలిసింది. అంటే ఎక్స్‌షోరూం ఢిల్లీలో దీని ధర రూ.2,50,010 తగ్గింది. ఈ సమీక్షించిన ధరలు 2017 మోడల్ కలిగి ఉన్న వాటికి వర్తిస్తాయని, 2017 సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయని హార్లే డేవిడ్సన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. నెలవారీ పేమెంట్లను తగ్గిస్తూ కూడా కంపెనీ ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. -
పోలీసులకు హర్లీ డేవిడ్ సన్ బైక్స్
కోల్‌కతా: హర్లీ డేవిడ్ సన్ బైకులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. దానిపై మనసు పడినా ధర ఆకాశాన్నంటుతుంది. అలాంటి బైకులను పెట్రోలింగ్ కోసం మన పోలీసులు ఉపయోగిస్తున్నారు. అవును. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులను కోల్‌కతా పోలీసుల కోసం కొనుగోలు చేసింది. ప్రస్తుతం కోల్‌కతా పోలీసు డిపార్ట్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వాడుతున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన హర్లీ డేవిడ్ సన్ బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు జత కలిశాయి. కోల్‌కతా పోలీసులకు కొత్త సాంకేతికతను అందించడంలో కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందే ఉంటోంది. ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారి కోల్‌కతా పోలీసులు హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకులపై పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ బైకులను కొనుగోలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం చూస్తే కళ్లు తేలేయాల్సిందే. ఒక్కో బైక్‌కు రూ.5.5 లక్షల చొప్పున మమత ప్రభుత్వం హర్లీ డేవిడ్ సన్‌కు చెల్లించింది. మామూలుగా హర్లీ డేవిడ్ సన్ స్ట్రీట్ 750 బైకు ధర రూ.4.9 లక్షలే. అయితే, పోలీసుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించి వీటిని తయారు చేయించారు. దాంతో ధర తడిసి మోపిడైంది.