సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం దిశగా యోచిస్తోంది. కుర్రకారు డ్రీమ్ బైక్ అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాలనుంచి నిష్ర్కమించాలని భావిస్తోంది. భవిష్యత్తు డిమాండ్ పై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుందని తాజా వార్తల ద్వారా తెలుస్తోంది. హర్యానాలోని బావాల్ వద్ద తన ప్లాంట్ ను త్వరలోనే మూసివేయనుంది. ఈ మేరకు ఔట్‌సోర్సింగ్ ఒప్పందం నిమిత్తం కొంతమంది వాహన తయారీదారులను సంప్రదించినట్లు సమాచారం. గత నెలలో రెండవ త్రైమాసిక ఫలితాల సందర్భంగా హార్లే-డేవిడ్సన్ ఈ సంకేతాలు అందించింది. భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా లాభాలు లేని అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ఆలోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.
2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ 10 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి బైక్‌లతో దేశీయ కస్టమర్లను, ముఖ్యంగా యువతను ఆకర్షించింది. అంతేకాదు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో అటు దేశీయంగా ఇటు, అంతర్జాతీయంగా ఆటో మొబైల్ రంగం ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయింది. విక్రయాలు దాదాపు శూన్యం కావడంతో స్పేర్ పార్ట్స్ ని కూడా విక్రయించుకోలేని స్థితికి దిగజారింది. ఈ నేపథ్యంలోనే హార్లే డేవిడ్సన్ ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది. 2018 లో విక్రయించిన 3,413 యూనిట్లతో పోలిస్తే 2019 లో 22 శాతం తగ్గి 2,676 యూనిట్లకు చేరుకోగా, 2020 ఏప్రిల్- జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ తాజా నివేదికలో తెలిపింది. మార్కెట్ పరంగా తమకు భారత్ అత్యంత చెత్త మార్కెట్ అని పేర్కొంది. అయితే తాజా ఊహాగానాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది.
హార్లే-డేవిడ్సన్ నిష్క్రమణ అంచనాలు నిజమైతే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి భారతదేశంలో కార్యకలాపాలను మూసివేసిన రెండవ వాహన తయారీదారుగా హార్లే-డేవిడ్సన్. 2017 లో జనరల్ మోటార్స్ గుజరాత్ ప్లాంట్ ను విక్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment