
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ భారత మార్కెట్లో పట్టు పెంచుకునే దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చిన్న బైక్‌లను ఇక్కడ విడుదలచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆసియాలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన విధంగా 200 నుంచి 500సీసీ కేటగిరీలో ద్విచక్ర వాహనాలను అందించే యోచనలో ఉన్నట్లు ఇన్వెస్టర్ కమ్యూనికేషన్‌లో హార్లీ డేవిడ్‌సన్ తెలియజేసింది. వచ్చే రెండేళ్లలో ఈ బైక్‌లను భారత్‌లో విడుదలచేయనున్నట్లు పేర్కొంది.
ఇదే సమయంలో ఇతర ఆసియా దేశాలలో కూడా బైక్‌లను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న మధ్య తరగతి వర్గాల ఆదాయం, నూతన ఉత్పత్తుల కారణంగా భారత్‌లో 200–500సీసీ విభాగం అమ్మకాలు 2017లో 7 లక్షల యూనిట్లకు చేరుకుని 25 శాతం వృద్ధిరేటును నమోదుచేసినట్లు వివరించింది. పలు వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాట్లు చేసుకుంటూ పోటీ కంపెనీలు ఇప్పటికే భారత మార్కెట్‌లో పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది.