న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్ మేనేజ్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి.
దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్ వాహనాలపై కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment