స్మార్ట్‌ఫోన్లు పెరుగుతున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జనవరి-మార్చి త్రైమాసికంలో 28.6 శాతం పెరిగి 28.15 కోట్లకు చేరుకున్నాయి. 2013 నాల్గవ త్రైమాసికంలో జరిగిన 28.96 కోట్ల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 2.8 శాతం తక్కువ. అయితే 2013 తొలి త్రైమాసికంలో మొత్తం అమ్ముడైన ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా 50.7 శాతం. ఈ ఏడాది ఇది 62.7 శాతానికి ఎగబాకిందని పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విపరీతమైన డిమాండ్, అందుబాటు ధరలో లభించడం, 4జీ సేవలు విస్తరించడం అమ్మకాల జోష్‌కు ప్రధాన కారణాలు. స్మార్ట్‌ఫోన్లలో 40 శాతం చైనా కస్టమర్లు చేజిక్కించుకున్నారు.
శాంసంగ్‌దే హవా..
కంపెనీల వారీగా చూస్తే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ అగ్రస్థానంతో 30.2 శాతం వాటా కైవసం చేసుకుంది. ఆపిల్ 15.5, హువావె 4.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ తొలిసారిగా ఒక త్రైమాసికంలో 4 కోట్ల యూనిట్ల మార్కును దాటింది. భారత్‌తోసహా చైనా, జపాన్, బ్రెజిల్, ఇండోనేసియా మార్కెట్లలో ఆపిల్ రెండంకెల వృద్ధి నమోదు చేసింది. ఇక 2013 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది 3.9 శాతం వృద్ధితో ఫీచర్, స్మార్ట్‌ఫోన్లు మొత్తం 44.86 కోట్ల యూనిట్లు విక్రయమయ్యాయి. శాంసంగ్ 10.89 కోట్లు, నోకియా 5.05 కోట్లు, ఆపిల్ 4.37 కోట్ల పీసులతో అగ్రస్థానంలో ఉన్నాయి.