ఎవరి లీగ్ వాళ్లదే..! | Another sticky bun whose league ..! | Sakshi
Sakshi News home page

ఎవరి లీగ్ వాళ్లదే..!

Published Sat, Jun 21 2014 12:06 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Another sticky bun whose league ..!

ప్రస్తుతం ప్రపంచం అంతా ఫుట్‌బాల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ సంగ్రామంతో క్రీడా ప్రపంచం సందడిగా ఉంది. స్టార్ ఆటగాళ్లంతా తమ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ప్రపంచకప్ ఆడుతున్న ఓ స్టార్ పేరు చెప్పి అతడిది ఏ దేశమో చెప్పమంటే ఫుట్‌బాల్ అభిమాని కాస్త ఆలోచిస్తాడు. కానీ అతడిది ఏ క్లబ్ అని అడిగితే మాత్రం ఠక్కున చెప్పేస్తాడు. ఫుట్‌బాల్‌లో లీగ్‌ల ప్రభావం అలా ఉంటుంది. నిజానికి ఫుట్‌బాల్‌లో ప్రపంచకప్‌ను మినహాయిస్తే దేశాల మధ్య జరిగే మ్యాచ్‌ల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అదే క్లబ్‌ల సంగ్రామం మాత్రం ప్రతి ఏడాదీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది.
 - శ్యామ్ తిరుక్కోవళ్లూరు
 
దేశానికి ప్రాతినిధ్యం వహించకుండా క్లబ్  క్రికెట్‌పై మోజు చూపెడుతున్నారు... ఇటీవల కాలంలో మనం తరచుగా ఐపీఎల్ విషయంలో క్రికెటర్లపై ఈ విమర్శను వింటున్నాం. ఇక ఫుట్‌బాల్ విషయంలో ఈ విమర్శ దానికి వెయ్యి రెట్లు ఉంటుంది. దేశం తరఫున పెద్దగా ఆడని ఆటగాళ్లు క్లబ్‌లకు మాత్రం పదుల సంఖ్యలో గోల్స్ కొడతారు. క్లబ్‌లకు ఆడటం ద్వారా వచ్చే డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రతిష్ట దేశానికి ఆడితే రావు మరి. ఫుట్‌బాల్ మీద లీగ్‌ల ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫిఫా కూడా క్లబ్ టోర్నీలకు ఇబ్బంది రాకుండానే తమ ఈవెంట్లను నిర్వహిస్తుంది. ప్రపంచకప్ ప్రైజ్‌మనీ 3 వేల కోట్ల రూపాయల పైచిలుకే అనే వార్తను చూసి మన దేశంలో చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ లీగ్‌ల ద్వారా వచ్చే ఆదాయం, అందులో టర్నోవర్ చూస్తే కళ్లు తిరుగుతాయి. ఫుట్‌బాల్‌కు ప్రధాన మార్కెట్ యూరోప్. అమెరికా దేశాల్లోనూ మార్కెట్ బాగున్నా యూరోప్ తర్వాతే ఏదైనా. అందుకే ఈ ఖండంలో దాదాపు ప్రతి దేశంలోనూ ఓ లీగ్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇంగ్లండ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌లలో జరిగే లీగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం...
 
 యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్...
 ఆవిర్భావం: 1955
 పాల్గొనే జట్లు: 32
 ప్రస్తుత చాంపియన్: రియల్ మాడ్రిడ్
 అత్యధిక టైటిళ్లు: రియల్ మాడ్రిడ్(10)
 సీజన్: జూలై నుంచి మే వరకు
 ప్రైజ్‌మనీ: దాదాపు రూ. 2000 కోట్లు
 
 ప్రముఖ జట్లు: యూరోప్‌లోని అన్ని లీగ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన జట్లు ఇందులో ఆడతాయి. కాబట్టి అన్ని దేశాల ప్రముఖ క్లబ్స్ ఇందులో పాల్గొంటాయి.
 
 యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాల యూనియన్ (యూఈఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ప్రతియేటా సాకర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లబ్ టోర్నీల్లో చాంపియన్స్ లీగ్ ఒకటి. యూరోప్‌లోనూ నిస్సందేహంగా ఇదే టాప్‌లో నిలుస్తుంది.. చాంపియన్స్ లీగ్ 1955లో ఆరంభమైంది. 1992 వరకు యూరోపియన్ చాంపియన్ క్లబ్స్ కప్ (యూరోపియన్ కప్)గా పిలిచేవారు. చాంపియన్స్ లీగ్‌లో యూరోప్‌కు చెందిన 53 దేశాలకు చెందిన 453 క్లబ్‌ల ప్రాతినిధ్యం ఉన్నా  ఈ టోర్నీలో ఇప్పటిదాకా 76 నుంచి 77 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇక గ్రూప్ స్టేజ్‌లో పాల్గొనే 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్లుంటాయి. ఒక్కోజట్టు డబుల్ రౌండ్ రాబిన్ పద్ధ్దతిన తన గ్రూప్‌లోని మిగిలిన మూడు జట్లతో పోటీ పడుతుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు  వెళతాయి. మేలో జరిగే ఫైనల్లో 2 జట్లు తలపడతాయి. ఈ ఏ డాది రియల్ మాడ్రిడ్ టైటిల్ గెలిచింది.
 
 ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్...
 ఆవిర్భావం: 1992 (అంతకుముందు 1888 నుంచి ఇంగ్లిష్ ఫుట్‌బాల్ లీగ్ పేరుతో ఉండేది)
 దేశం: ఇంగ్లండ్,
జట్లు: 20
  ప్రముఖ జట్లు: మాంచెస్టర్ యునెటైడ్, మాంచెస్టర్ సిటీ, లివర్‌పూల్, చెల్సి, ఆర్సెనల్
 ప్రస్తుత చాంపియన్: మాంచెస్టర్ సిటీ
 అత్యధిక టైటిళ్లు: మాంచెస్టర్ యునెటైడ్ (13)
 సీజన్: ఆగస్ట్ నుంచి మే వరకు
 సీజన్‌లో మ్యాచ్‌లు: 380
 
ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) అంటే అభిమానుల్లో ఫుల్‌క్రేజ్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈపీఎల్ మ్యాచ్‌లను చూస్తారు. 212 దేశాల్లో 64.30 కోట్ల గృహాల్లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. సుమారు 470 కోట్ల మంది అభిమానులు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌ను వీక్షిస్తారని లెక్కలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే స్కైస్పోర్ట్స్, బీటీ స్పోర్ట్ చానెళ్లు ప్రసార హక్కుల్ని ఒక బిలియన్ పౌండ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 9,800 కోట్లకు పైమాటే) వెచ్చించి కొంటాయంటేనే ఈ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌కు ఉన్న క్రేజ్ గురించి అర్థం చేసుకోవచ్చు. 1992లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటయింది. అంతకుముందు ఇంగ్లిష్ ఫుట్‌బాల్ పేరుతో ఆడేవారు. అప్పట్లో 46 క్లబ్‌లు ఈ టోర్నీలో పోటీ పడేవి. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా ఐదు జట్లు మాత్రమే విజేతగా నిలిచాయి. ప్రతియేటా జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో 20 జట్లు పాల్గొంటాయి. 2013-14 సీజన్‌కు మాంచెస్టర్ సిటీ చాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నీలో హవా మాత్రం మాంచెస్టర్ యునెటైడ్‌దే. ఇప్పటిదాకా ఆ జట్టు 13 సార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఆగస్ట్ నుంచి మే వరకు ఉంటుంది. ప్రతీ జట్టు 38 మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తానికి ఒక సీజన్‌లో 380 లీగ్‌లు జరుగుతాయి.  
 
 యూఈఎఫ్‌ఏ యూరోపా లీగ్...
 ఆవిర్భావం: 1971 (2009 నుంచి కొత్త ఫార్మాట్)
 ప్రాంతం: యూరోప్
 పాల్గొనే జట్లు: 48 + 8 (చాంపియన్స్ లీగ్ తర్వాత మరో 8 జట్లు)
 ప్రస్తుత చాంపియన్: సెవిల్లా
 అత్యధిక టైటిళ్లు: జువెంటస్, ఇంటర్ మిలన్, లివర్‌పూల్, సెవిల్లా (3 టైటిళ్లు)
 
 ప్రముఖ జట్లు: చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లలో నుంచి కొన్ని జట్లు ఈ లీగ్‌లో ఆడతాయి. ఉదాహరణకు... ఈపీఎల్ నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు చాంపియన్స్ లీగ్‌కు వెళితే... తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు యూరోపా లీగ్‌లో ఆడతాయి.
 
 యూఈఎఫ్‌ఏ సూపర్ కప్...
 ఆవిర్భావం: 1972 (1973 నుంచి యూఈఎఫ్‌ఏ గుర్తింపు)
 ప్రాంతం: యూరోప్, పాల్గొనే జట్లు: 2
 ప్రస్తుత చాంపియన్: బేయర్న్ మ్యూనిచ్ (తొలి టైటిల్)
 అత్యధిక టైటిళ్లు: ఏసీ మిలన్ (5)
 
 యూఈఎఫ్‌ఏ చాంపియన్స్ లీగ్, యూఈఎఫ్‌ఏ యూరోపా లీగ్ విజేతలు యూఈఎఫ్‌ఏ సూపర్ కప్‌లో తలపడతాయి. ప్రతీ ఏడాది ఆగస్ట్‌లో సూపర్ కప్ జరుగుతుంది.
 
 బుండెస్‌లిగా...
 ఆవిర్భావం: 1963, దేశం: జర్మనీ,
పాల్గొనే జట్లు: 18
 ప్రస్తుత చాంపియన్: బేయర్న్ మ్యూనిచ్
 అత్యధిక టైటిళ్లు: బేయర్న్ మ్యూనిచ్(23)
 సీజన్: ఆగస్ట్ నుంచి మే వరకు
 ప్రముఖ జట్లు: బేయర్న్ మ్యూనిచ్, షాల్కే 04, డార్ట్‌ముండ్
 
 బుండెస్‌లిగా.. స్టేడియంలో ప్రత్యక్షంగా అభిమానులు ఎక్కువగా చూసే లీగ్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోర్నీకి క్రేజ్ ఎక్కువ. 18 జట్లు పాల్గొనే బుండెస్‌లిగా 1963లో మొదలైంది. ప్రస్తుత చాంపియన్ బేయర్న్ మ్యూనిచ్ కాగా.. టోర్నీలో అత్యధిక టైటిళ్లు కూడా బేయర్న్(23)వే కావడం విశేషం. ఆగస్ట్ నుంచి మే వరకు ఉండే ఈ సీజన్ మ్యాచ్‌లు 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.
 
 ఇతర ప్రధాన లీగ్‌లు...
 సెరియా...
 ఆవిర్భావం: 1898 (1929 నుంచి రౌండ్ రాబిన్ టోర్నీ),
దేశం: ఇటలీ
 పాల్గొనే జట్లు: 20
 ప్రస్తుత చాంపియన్: జువెంటస్
 
 మేజర్ లీగ్ సాకర్...
 ఆవిర్భావం: 1993
 దేశం: అమెరికా
 పాల్గొనే జట్లు: 19
 ప్రస్తుత చాంపియన్: స్పోర్టింగ్ కన్సాస్ సిటీ (2013)
 
 లా లిగా
 ఆవిర్భావం: 1929
 దేశం: స్పెయిన్
 పాల్గొనే జట్లు: 20
 సీజన్: సెప్టెంబర్ నుంచి జూన్ వరకు
 ప్రస్తుత చాంపియన్: అట్లెటికో మాడ్రిడ్(10)
 అత్యధిక టైటిళ్లు: రియల్ మాడ్రిడ్(32)
 ప్రముఖ జట్లు: రియల్ మాడ్రిడ్, బార్సిలోనా
 
 క్లబ్ టోర్నీల్లో ప్రతిష్టాత్మకమైనది స్పానిష్ లీగ్ లా లిగా.. 1929లో మొదలైన ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. ప్రతియేటా జరిగే ఈ టోర్నీలో చివరి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సెగుండా డివిజన్‌కు పడిపోతాయి. అలాగే డివిజన్‌లో మంచి ప్రతిభ కనబర్చిన మూడు జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇప్పటిదాకా లా లిగాలో మొత్తం 59 జట్లు పాల్గొన్నాయి. అయితే ఇందులో తొమ్మిది జట్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచాయి. 1950 నుంచి రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్లు ఈ టోర్నీలో సత్తా చాటాయి. రియల్ మాడ్రిడ్ అత్యధికంగా 32 సార్లు, బార్సిలోనా 22 సార్లు చాంపియన్లుగా నిలిచాయి. గత రెండు దశాబ్దాలుగా అట్లెటికో మాడ్రిడ్, అథ్లెటిక్ బిల్‌బావో, వాలెన్సియా, రియల్‌సోసిడాడ్, డిపోర్టివో, రియల్ బెటిస్, సెవిల్లా జట్లు ఈ టోర్నీలో సత్తా చాటుతున్నాయి. యూఈఎఫ్‌ఏ ప్రకారం లా లిగాను యూరోప్‌లో పటిష్టమైన లీగ్‌గా చెబుతారు. ఈ టోర్నీకి అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ ఉంది.  ఈ టోర్నీలో ఆడే జట్లలో రియల్ మాడ్రిడ్, బార్సిలోనా, అట్లెటికో మాడ్రిడ్, వాలెన్సియా యూరోప్‌లో జరిగే ప్రముఖ క్లబ్ పోటీల్లో ఆధిపత్యాన్ని చాటుతున్నాయి.  స్పెయిన్‌కు చెందిన ఈ నాలుగు జట్లు అంతర్జాతీయ క్లబ్ ట్రోఫీలను(ఐదు అంత కంటే ఎక్కువ) గెల్చుకున్నాయి. ఇక లా లిగాలో బార్సిలోనా స్టార్ మెస్సీ గోల్స్‌లో టాప్. ఇప్పటిదాకా మెస్సీ 243 గోల్స్ కొట్టాడు. అట్లెటికా మాడ్రిడ్‌కు చెందిన డేవిడ్ విల్లా 185, రియల్ మాడ్రిడ్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 177 గోల్స్ చేశారు. ఇక అత్యంత ధనిక లీగ్ అయిన లా లిగాలో చాంపియన్‌గా నిలిచేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా జట్లు వెనకాడవు.
 
 ఆటగాళ్లపై కాసుల వర్షం..

 క్లబ్ ఫుట్‌బాల్ ద్వారా ఆటగాళ్ల మీద కనక వర్షం కురుస్తుంది. ఏ క్లబ్ తరఫున ఆడినా ఒక్క సీజన్‌లో సత్తా చాటితే ఆటగాడి రాత మారిపోతుంది. క్లబ్ ఫుట్‌బాల్ ద్వారా అత్యధిక మొత్తం సంపాదించిన ఆటగాడు బెక్‌హామ్ అనుకోవాలి. గత ఏడాది రిటైరైన బెక్‌హామ్... ఏడాదికి రూ. 283.2 కోట్ల రూపాయలు సంపాదించేవాడు. ఇప్పటికీ ఇదే రికార్డు. 2013-14 సీజన్‌లో ఆయా జట్లు ఆటగాళ్లకు చెల్లించిన మొత్తం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. రియల్ మాడ్రిడ్ రూ. 1,766.35 కోట్లు, బార్సిలోనా 1,565.63 కోట్లు, అట్లెటికో మాడ్రిడ్ 578.07 కోట్లు వాలెన్సియా 361.29 కోట్లు, సెవిల్లా 329.18 కోట్లు ఖర్చుపెట్టాయి.
 
 రియల్ మాడ్రిడ్ టాప్...

 ఇక క్లబ్‌ల ఆదాయం కూడా భారీగా ఉంటుంది. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ జట్టు విలువలోనూ, ఆదాయంలోనూ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం బార్సిలోనాది. అటు క్లబ్‌ల విలువలో, ఇటు ఆదాయంలో ఇంగ్లండ్‌కు చెందిన ఐదు క్లబ్‌లు టాప్-10లో ఉన్నాయి. ఇటలీ క్లబ్‌లు కూడా ఏ మాత్రం తక్కువ తినలేదు. జర్మనీకి చెందిన బేయర్న్ మ్యూనిచ్ నాలుగో స్థానంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement