ఫుట్బాల్ ప్రపంచకప్ లో రెండో డ్రా
నాటల్(బ్రెజిల్): ఫుట్బాల్ ప్రపంచకప్ లో రెండో డ్రా నమోదయింది. గ్రూప్ ‘సి’లో జపాన్, గ్రీస్ జట్ల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు గోల్స్ చేయకపోవడంతో 0-0తో మ్యాచ్ డ్రా అయింది. ఇరాన్, నైజిరీయా జట్ల మధ్య సోమవారం అర్థరాత్రి దాటాకా జరిగిన మ్యాచ్ డ్రా అయిన సంగతి తెలిసిందే.
కాగా తొలి మ్యాచ్ లో ఐవరీకోస్ట్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయిన జపాన్ రెండో మ్యాచ్ లోనూ సత్తా చాటలేకపోయింది. గ్రీస్ జట్టు పది మందికి పరిమితమైనా సొమ్ముచేసుకోలేకోయింది. గ్రీస్ కెప్టెన్ కొనస్టాటినోస్ కస్టోరానిస్ రెండు పొరపాట్లతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని జపాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఈ రెండు జట్లు నాకౌట్ ఆశలు నిలుపుకోవాలంటే తమ చివరి మ్యాచుల్లో కచ్చితంగా నెగ్గాల్సివుంటుంది. ఐవరీకోస్ట్ తో గ్రీస్, కొలంబియాతో జపాన్ తలపడనున్నాయి. ఒక గ్రూప్ 'సి'లో అగ్రస్థానంలో నిలిచిన కొలంబియా ఇప్పటికే నాకౌట్ కు చేరుకుంది. 24 ఏళ్ల తర్వాత కొలంబియా నాకౌట్ కు చేరుకోవడం విశేషం.