న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అస్తవ్యస్తమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో... భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం.. 500 మిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెలికం పరికరాల ఉత్పత్తి తదితర రంగాలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కింద ఇన్వెస్ట్ చేసే సంస్థలు.. జూన్ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.
100 మిలియన్ డాలర్లు.. నాలుగేళ్లు ...
ఇక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో 100 మిలియన్ డాలర్లు.. ఆపైన ఇన్వెస్ట్ చేసే సంస్థలకు నాలుగేళ్ల పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆ తర్వాత ఆరేళ్ల పాటు తక్కువ స్థాయిలో 10% కార్పొరేట్ ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ తదితర రంగాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు తాజా మినహాయింపులు అదనం. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సమగ్ర అభివృద్ధిపై దృష్టి..
ప్రధానంగా టెక్స్‌టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వజ్రాభరణాలు వంటి రంగాలతో పాటు వివిధ పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై కేంద్రం వాణిజ్య శాఖ దృష్టి పెడుతోంది. సేవల రంగానికి చెందిన టూరిజం వంటి విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల అప్‌గ్రెడేషన్ కోసం 50 పారిశ్రామిక క్లస్టర్లను వాణిజ్య శాఖ గుర్తించింది.
చైనా నుంచి భారత్‌కు కంపెనీలు..
ఎన్నో ఉత్పత్తుల కోసం ప్రపంచదేశాలు చైనాపైనే అధికంగా ఆధారపడడం వల్ల వైరస్ విస్తరణకు దారితీయడంతోపాటు.. సరఫరా పరంగా తీవ్ర ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు చైనాపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోనూ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చైనాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లను భారత్ వైపు ఆకర్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే సంస్థలకు స్థల సమీకరణను సులభతరం చేయడం, కొత్త ప్లాంట్లకు పన్నుపరమైన రాయితీలివ్వడం తదితర చర్యలు తీసుకుంటోంది.
‘‘ఎన్నో చర్యల దిశగా పనిచేస్తున్నాం. రాష్ట్రాలు భూముల అందుబాటు వివరాలను సిద్ధం చేసి ఇస్తే, వాటిని ఆసక్తిగల ఇన్వెస్టర్ల ముందు ఉంచుతాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు. బహుళజాతి సంస్థలు చైనా నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఆలోచనలో లేవని, కాకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని, వారికి భారత్ ఆకర్షణీయ కేంద్రం అవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సకాలంలో అన్ని అనుమతులను ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని ఎగుమతుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్ శరద్ సరాఫ్ అభిప్రాయపడ్డారు.
భారత్ వైపు.. యాపిల్ చూపు..
టెక్ దిగ్గజం యాపిల్ కూడా చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్‌కు మళ్లించాలని యోచిస్తోంది. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో భారత్ అమలు చేస్తున్న ఉత్పత్తిపరమైన ప్రోత్సాహకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి అందిస్తున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం భారత్‌లో తయారు చేసేందుకు .. ఈ కాంట్రాక్టర్లను యాపిల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం.. గత త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటా దక్కించుకుంది. దేశీయంగా రీసెల్లర్స్ ద్వారానే విక్రయిస్తున్న యాపిల్.. సొంతంగా కూడా స్టోర్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2021 నాటికి తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభిస్తామని ఇటీవలే సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్‌ఫోన్లు తయారవుతున్నాయి.
చిన్న వ్యాపారాలు, తయారీకి ప్యాకేజీ దన్ను ...
కరోనా కష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు పన్నుల రూపంలో ప్రయోజనం కల్పించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి ఊతం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఇబ్బందుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి ఇప్పటికే అమెరికా తమ జీడీపీలో 13% ప్యాకేజ్‌ని ప్రకటించగా, జపాన్ విషయంలో ఇది 21%. మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇదే తరహా భారీ ప్యాకేజ్ కిందకు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ తనంతట తానుగా నిలదొక్కుకోడానికి దోహదపడే ప్యాకేజ్‌లో ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అలాగే ఆర్‌బీఐ ద్రవ్య, వడ్డీరేట్ల పరమైన ప్రయోజనలు కలిపి ఉన్నాయి. భూ, కార్మిక, ద్రవ్య, న్యాయ పరమైన అంశాలు ప్యాకేజ్‌లో ఇమిడి ఉంటాయని మోదీ తన మంగళవారంనాటి ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment