
సదస్సులో పాల్గొన్న పౌల్ గై (మధ్య) తదితరులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం భారత్‌లో ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశ్రమ 20.2 శాతం వార్షిక వృద్ధితో 2025 నాటికి 7.8 బిలియన్ డాలర్లుగా నిలుస్తుందని అంచనా. ఈ సునామీ మార్పును మానవ వనరుల విభాగాలు గుర్తించాయని అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ టెక్‌ఫైండర్ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పౌల్ గై అన్నారు. హెచ్‌ఆర్ సవాళ్లను అధిగమించడంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘హెచ్‌ఆర్ రంగంలో ఏఐ అప్లికేషన్లు అమితాదరణ పొందుతున్నాయి. ప్రతిభావంతులను సొంతం చేసుకోవడమనేది సాంకేతికాధారిత హెచ్‌ఆర్ కార్యక్రమంగా మారింది. వ్యాపారాలలో ఏఐ వినియోగం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు. ఆర్థిక వ్యవస్ధ మందగమనం, అనిశ్చితి, నియామకాలలో మందగమనం, తగిన నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను ఆకర్షించడంలో పోటీ వంటివి హెచ్‌ఆర్ నిపుణులు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలని సదస్సు అభిప్రాయపడింది.