మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు | TCS market capitalisation shoots past Rs 5 lakh crore, larger than other Tata Group cos put together | Sakshi
Sakshi News home page

మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు

Published Thu, Jul 24 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు

మార్కెట్ కింగ్... టీసీఎస్ రూ. 5 లక్షల కోట్లు

ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) స్టాక్ మార్కెట్లలో సంచలనానికి తెరలేపింది. బుధవారం ట్రేడింగ్‌లో షేరు బీఎస్‌ఈలో 2% లాభపడి రూ. 2,587 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక రికార్డు ధరకాగా, తద్వారా దేశీ కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, కొత్త చరిత్రను సృష్టించింది.

 తొలిసారి 2004లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన టీసీఎస్ తొలిసారి 84 బిలియన్ డాలర్ల(రూ. 5,06,703 కోట్లు) విలువను అందుకున్న ఒక దేశీ కంపెనీగా కొత్త రికార్డును లిఖించింది. ఇందులో విశేషమేమిటంటే...  దేశీ ఐటీ రంగంలో తరువాతి స్థానాల్లో ఉన్న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల మొత్తం మార్కెట్ క్యాప్‌కంటే ఇది అధికం కావడ ం! ఇక టాటా గ్రూప్‌లోని ఇతర 16 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 3,06,334 కోట్లు మాత్రమే కావడం విశేషం!

 విశేషాలెన్నో...
టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) మార్కెట్ క్యాప్‌లో 6% వాటాకు సమానం.

దశాబ్దంక్రితం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్‌లో ఇది సగభాగం. 2004 జూలైలో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ క్యాప్ సుమారు రూ. 10 లక్షల కోట్లు.

 2014 మే 9 - జూలై 23 కాలంలో కంపెనీ మార్కెట్ విలువ రూ. 83,000 కోట్లమేర పెరిగింది.

 2009 మార్చిలో నమోదైన రూ. 52,700 కోట్లతో పోలిస్తే ప్రస్తుత విలువ 10 రెట్లు ఎగసింది.

అక్టోబర్ 2009లో కంపెనీ సీఈవోగా ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టాక కంపెనీ మరింత వృద్ధి బాటలో సాగుతూ వచ్చింది.  

దేశీ ఐటీ సేవలకు ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ ఆదాయం  2009-10లో రూ. 7,600 కోట్లు మాత్రమే ఎక్కువ.

ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఆదాయం కంటే టీసీఎస్ టర్నోవర్ రూ. 20,000 కోట్లు అధికం.

ఇదే విధంగా ఇన్ఫోసిస్ నికర లాభం కంటే టీసీఎస్ లాభం 2010లో రూ. 782 కోట్లు మాత్రమే అధికం.

 2013-14లో ఇన్ఫోసిస్ కంటే టీసీఎస్ రూ. 8,300 కోట్లు అధికంగా నికర లాభాన్ని ఆర్జించింది.

ఇన్ఫోసిస్ సిబ్బంది సంఖ్య సుమారు 1.6 లక్షలుకాగా, టీసీఎస్‌లో 3 లక్షలకుపైగా సిబ్బంది ఉన్నారు.

విఖ్యాత మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్త ఇన్నోవేటివ్ దిగ్గజాల జాబితాలో టీసీఎస్‌కు 40వ స్థానం లభించింది.
 
 టీసీఎస్ సంగతిదీ...
 2004 ఆగస్ట్ తొలి వారంలో రూ. 850 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఆగస్ట్ 25న  స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. వాటాదారులకు రెండుసార్లు బోనస్ షేర్లను జారీ చేసింది. 2006 జూలైలో ఒకసారి, 2009 జూన్‌లో మరోసారి వాటాదారుల వద్దనున్న ఒక్కో షేరుకి మరో షేరును ఫ్రీ(బోనస్)గా ఇచ్చింది.

 అంటే ఐపీవోలో రూ. 85,000  ఇన్వెస్ట్‌చేసి 100 షేర్లను కొనుగోలు చేసిఉంటే ప్రస్తుతం ఆ విలువ రూ. 11,54,800కు చేరి ఉండేది! ఎలాగంటే ఐపీవోలో లభించిన 100 షేర్లు 2006లో 200 షేర్లుగా మారి ఉండేవి. ఆపై 2009లో మరోసారి ఈ 200 షేర్లు 400 షేర్లు అయ్యేవి. వెరసి 400 షేర్లను ప్రస్తుత ధర రూ. 2,887 తో గుణిస్తే వచ్చే విలువ రూ. 11.54 లక్షలు!!

కంపెనీలో ప్రమోటర్ల వాటా 74%కాగా, విదేశీ ఇన్వెస్టర్లకు వాటా 16.5%.

2013-14 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 64,673 కోట్లు కాగా.. నికర లాభం 18,475 కోట్లుగా నమోదైంది.

టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.5% వృద్ధి చెందగా, డాలర్ల రూపేణా 5.7% పుంజుకుంది. ఇదే కాలంలో మరో దిగ్గజం ఇన్ఫోసిస్ ఆదాయం 2% మాత్రమే వృద్ధి చూపడం గమనార్హం.

సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఈ ఏడాది ఐటీ రంగం 13-15% పురోగమించగలదని అంచనా వేసింది. ఈ బాటలో ప్రస్తుత ఏడాదికి నాస్కామ్ అంచనాలను మించిన పనితీరును చూపగలమని టీసీఎస్ ప్రకటించగా, 7-9% వృద్ధిని సాధించగలమని ఇన్ఫోసిస్ అంచనా వేసింది.

తొలి క్వార్టర్‌లో టీసీఎస్‌లో ఉద్యోగుల వలస(అట్రిషన్) రేటు 12%కు చేరగా, ఇన్ఫోసిస్‌లో ఇది 19%పైగా నమోదైంది.

 గతేడాది(2013-14)లో 100 మిలియన్ డాలర్ల క్లయింట్లు 24కు చేరారు. ఇన్ఫీ 13 మంది క్లయింట్లను పొందగా, విప్రోకు 10 మంది లభించారు.

దేశీ ఐటీ సర్వీసుల ఆదాయంలో కేవలం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 40% వాటాను ఆక్రమిస్తుండటం విశేషం! అయితే గతేడాది డాలర్ల రూపేణా టీసీఎస్ 16% జోరు చూపగా, ఇన్ఫీ 11.5%, విప్రో 6.4% వృద్ధిని సాధించాయి.

ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి టీసీఎస్ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. టర్నోవర్‌లో ఉత్తర అమెరికా వాటా 53%. బ్రెజిల్, ఉరుగ్వే, చిలీ, కొలంబియా, పెరూ, అర్జెంటీనా వంటి లాటిన్ అమెరికా దేశాలలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఆఫ్రికాలో దేశాలలోనూ విస్తరణ పథంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement