మళ్లీ 26 వేల పైకి సెన్సెక్స్..
మధ్య ప్రాచ్యం, ఉక్రెయిన్‌లలో చెలరేగిన సంక్షోభ పరిస్థితులు కొంతమేర చల్లబడటంతో ఆసియా, యూరప్ మార్కెట్లు ఊపిరి తీసుకున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగైంది. మరోవైపు దేశవ్యాప్తంగా విస్తరించిన వర్షాలు, కార్పొరేట్ దిగ్గజాల ప్రోత్సాహకర ఫలితాలు వంటి అంశాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. వెరసి వరుసగా ఆరో రోజు మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. సెన్సెక్స్ 311 పాయింట్లు ఎగసి చరిత్రలో రెండోసారి 26,000 పాయింట్లను అధిగమించింది. 26,026 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ నెల 7న మాత్రమే తొలిసారి 26,100 వద్ద నిలవడం ద్వారా సెన్సెక్స్ రికార్డు సృష్టించింది.
అయితే ఆ మర్నాడు అంటే జూలై 8న అత్యధికంగా 26,190 పాయింట్లను తాకింది. ప్రస్తుతం ఈ రికార్డుకు చేరువకావడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 84 పాయింట్లు పుంజుకుని 7,768 వద్ద నిలిచింది. గత ఆరు రోజుల్లో సెన్సెక్స్ 1,018 పాయింట్లు లాభపడటం విశేషం! ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడటం దేశీయంగానూ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికి బ్లూచిప్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు జత కలిశాయని తెలిపారు. దీంతో సమయం గడిచేకొద్దీ ఇండెక్స్ షేర్లకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించారు.
వెలుగులో టెలికం షేర్లు...
ట్రాయ్ ప్రతిపాదనల నేపథ్యంలో టెలికం షేర్లు వెలుగులో నిలిచాయి. అన్ని కేటగిరీల స్పెక్ట్రమ్‌నూ టెలికం కంపెనీలు పంచుకునేందుకు ట్రాయ్ అంగీకరించడంతో టెలికం షేర్లకు డిమాండ్ పెరిగింది. దీనికితోడు ఐడియా ఆకర్షణీయ ఫలితాలు సాధించడం కూడా ఇందుకు దోహదపడింది. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్ 5% జంప్‌చేయగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4%, ఎంటీఎన్‌ఎల్ 2% చొప్పున పరోగమించాయి.
దారి చూపిన ఆర్‌ఐఎల్
ప్రోత్సాహకర ఫలితాల కారణంగా ఆయిల్ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్ మరోసారి 3.4% ఎగసింది. మార్కెట్ల పురోగమనానికి దారి చూపింది.
ఈ బాటలో బ్లూచిప్ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, హిందాల్కో, విప్రో, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3-1.5% మధ్య లాభపడ్డాయి.
సెన్సెక్స్ దిగ్గజాలలో ఐదు మాత్రమే నీరసించాయి. మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, భెల్, యాక్సిస్ బ్యాంక్ 1-0.5% మధ్య నష్టపోయాయి.
బీఎస్‌ఈ-500 సూచీలో ఇండొకో రెమిడీస్ 18% దూసుకెళ్లి రూ. 194 వద్ద ముగిసింది. గోవాలోని 2 ప్లాంట్లకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి లభించడం దీనికి కారణమైంది. ఈ బాటలో మిడ్ క్యాప్ షేర్లకు డిమాండ్ కనిపించింది. మిగిలిన షేర్లలో జేబీ కెమ్, ఫైనాన్షియల్ టెక్, టిమ్‌కెన్, జామెట్రిక్, నోవర్టిస్, వొకార్డ్, పీఐ ఇండస్ట్రీస్, మైండ్‌ట్రీ, ఎఫ్‌డీసీ, నాల్కో 10-6% మధ్య ఎగశాయి.
సోమవారం రూ. 161 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 412 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.