విప్రో లాభం 2,188 కోట్లు | 2,188 crore Wipro profit | Sakshi
Sakshi News home page

విప్రో లాభం 2,188 కోట్లు

Published Fri, Jul 24 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

విప్రో లాభం 2,188 కోట్లు

విప్రో లాభం 2,188 కోట్లు

క్యూ1లో 4 శాతం వృద్ధి...
♦ సీక్వెన్షియల్‌గా మాత్రం 3.7% తగ్గుదల
♦ ఆదాయం రూ. 12,895 కోట్లు; 10.5% అప్
 
 బెంగళూరు : దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో.. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2015-16, క్యూ1)లో రూ.2,188 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,103 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా ఆదాయం కూడా 10.5 శాతం పెరిగి రూ.11,669 కోట్ల నుంచి రూ.12,895 కోట్లకు చేరింది. అయితే, గతేడాది ఆఖరి తైమాసికం(మార్చి క్వార్టర్)తో పోలిస్తే(రూ.2,272 కోట్లు) సీక్వెన్షియల్‌గా లాభం 3.7 శాతం తగ్గడం గమనార్హం.

 కీలకమైన ఐటీ సేవల విషయానికొస్తే.. క్యూ1లో డాలర్ల రూపంలో కంపెనీ 1.79 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే సీక్వెన్షియల్‌గా 1.1 శాతం వృద్ధి నమోదైంది. రూపాయల్లో చూస్తే ఆదాయం రూ.11,577 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా 3 శాతం పెరిగింది. కంపెనీ గెడైన్స్(అంచనా, 1.76-1.79 బిలియన్ డాలర్లు)కు అనుగుణంగానే డాలర్ ఆదాయం నమోదైంది.

కాగా, మార్కెట్ విశ్లేషకులు ఐటీ సేవల విభాగం నుంచి క్యూ1లో రూపాయి ప్రాతిపదికన రూ11,331 కోట్ల ఆదాయాన్ని, డాలర్ల రూపంలో 1.78 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. దీనికంటే మెరుగ్గానే కంపెనీ పనితీరును ప్రదర్శించింది. ఇదిలాఉంటే.. ప్రస్తుత రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.82-1.85 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 1.5-3.5 శాతం వృద్ధి కింద లెక్క. కాగా, క్యూ1 ఆదాయ వృద్ధిలో టీసీఎస్(3.5 శాతం), ఇన్ఫోసిస్(4.4 శాతం) కంటే విప్రో వెనుకబడటం గమనార్హం.

 ఇతర ముఖ్యాంశాలివీ...
►ఐటీ ఉత్పత్తుల రంగం నుంచి ఆదాయం జూన్ క్వార్టర్‌లో రూ.817 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.766 కోట్లతో పోలిస్తే 6.7 శాతం పెరిగింది.

     క్యూ1లో విప్రో 36 క్లయింట్లను జతచేసుకుంది.
► ఐటీ సేవల విభాగంలో నికరంగా 3,572 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 1,61,789కి చేరింది. మార్చి చివరికి సిబ్బంది సంఖ్య 1,58,217గా ఉంది.

► అమెరికా ఆదాయాల్లో 2.8 శాతం వృద్ధి నమోదైంది. యూరప్ వ్యాపారం మాత్రం 1.9 శాతం తగ్గగా.. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి ఆదాయాలు 1 శాతం పెరిగాయి.
► విప్రో షేరు ధర గురువారం బీఎస్‌ఈలో 0.5 శాతం నష్టపోయి రూ.588 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.
 
 డీల్స్‌ను చేజిక్కించుకోవడంలో పోటీ అంతకంతకూ పెరుగుతోంది. ఆటోమేషన్‌పై మరింత దృష్టి పెడుతున్నాం. మరోపక్క, క్లయింట్లు డిజిటల్ సర్వీసుల కోసం మరింతగా ఆసక్తి చూపుతున్నారు క్యూ2లో వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మరింత బాగుంటుంది.
 - టీకే కురియన్, విప్రో సీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement