న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో భారత కంపెనీలు ప్రతిభ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ రంగంలో టీసీఎస్ ప్రపంచంలోనే మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను యాక్సెంచర్, ఐబీఎం మొదటి రెండు స్థానాల్లో నిలవగా, టీసీఎస్ మూడో స్థానంలో ఉన్నట్టు ‘బ్రాండ్ ఫైనాన్స్’ రిపోర్ట్ తెలియజేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో సైతం టాప్–10లో చోటు సంపాదించుకోవడం గమనార్హం. 26.3 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలిచింది.
క్రితం ఆర్థిక సంవత్సరం నివేదికలో ఐబీఎం మొదటి స్థానంలో ఉండగా, దాన్ని వెనక్కి నెట్టి యాక్సెంచర్ మొదటి స్థానానికి చేరుకుంది. 20.4 బిలియన్ డాలర్లతో ఐబీఎం రెండో స్థానానికి పరిమితమైంది. 12.8 బిలియన్ డాలర్లతో టీసీఎస్ మూడో స్థానం దక్కించుకుంది. సంస్థ మార్కెట్ విలువ క్రితం నివేదికతో పోలిస్తే 23 శాతం పెరిగినట్టు బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక తెలిపింది. జపాన్ మార్కెట్లో విజయం సాధించిన తొలి భారత ఐటీ కంపెనీ టీసీఎస్ అని ప్రస్తావించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఆటోమేషన్ సహా అన్ని రకాల కస్టమర్ సేవలను అందించడంలో లీడర్‌గా నిలిచినట్టు వివరించింది.
టాప్–10లో తొలిసారిగా విప్రో
విప్రో తొలిసారి ఈ జాబితాలో టాప్–10లో చోటు దక్కించుకుంది. డిజిటల్ సామర్థ్యాల పెంపు, కీలకమైన కొనుగోళ్లపై కంపెనీ చేసిన గణనీయమైన పెట్టుబడులతో ఈ విభాగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మూడో కంపెనీగా విప్రో నిలిచినట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ (8.7 బిలియన్ డాలర్లు) నాలుగు, ఇన్ఫోసిస్ (6.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచాయి. క్యాప్‌జెమిని, డీఎక్స్‌సీ టెక్నాలజీ, ఎన్‌టీటీ డేటా టాప్–10లో నిలిచిన ఇతర సంస్థలు. నైపుణ్య ఉద్యోగులు, ప్రపంచ స్థాయి సదుపాయాలు, వసతులు వంటివి భారత్‌ను ఆకర్షణీయమైన ప్రదేశంగా, ప్రపంచానికి చోదకంగా నిలుపుతున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్‌హేగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment