అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.
దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు సమాచారం.
విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కాగ్నిజెంట్‌కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్‌పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్‌ఓ జతిన్ దలాల్‌ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్‌పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్‌బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం..
ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం
తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
మేము అదృష్టవంతులం
ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు.
మాకేం డోకా లేదు
"మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు.
నా పని మాత్రమే చేస్తున్నా..
“నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్‌ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్‌ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment