‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు! | After Wipro Now Infosys Has Sent Notice To Cognizant, Accusing It Of Poaching Its Valuable Employees - Sakshi
Sakshi News home page

Cognizant Vs Other IT Companies: ‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు!

Published Fri, Dec 29 2023 8:38 AM | Last Updated on Fri, Dec 29 2023 12:49 PM

After Wipro, Now Infosys Has Sent Notice To Cognizant - Sakshi

నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ ప్రముఖ దిగ్గజ టెక్‌ దిగ్గజ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడీ నోటీసుల పర్వం ఐటీ జాబ్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.       


మీ పద్దతి అస్సలు బాగోలేదు.. మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు? అంటూ భారత్‌కు చెందిన టెక్‌ కంపెనీలు ఒక్కటై అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్‌కు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. 

ఇప్పటికే విప్రో.. కాగ్నిజెంట్‌కు నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఇన్ఫోసిస్‌ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. ‘‘ కాగ్నిజెంట్‌ భారత్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.  నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌ స్థాయిలో విధులు నిర్వహించే నలుగురు టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు ఉన్నారు’’ అని ఆరోపిస్తూ కాగ్నిజెంట్‌కు నోటీసులు పంపింది.

     
ఈ సందర్భంగా ‘‘ తాము కాగ్నిజెంట్‌కు పంపిన నోటీసులు ఆ సంస్థకు ఓ హెచ్చరికలాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయి’’ అంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు మాట్లాడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

విప్రో వర్సెస్‌ కాగ్నిజెంట్‌
ఇటీవల, విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO) జతిన్‌ దలాల్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్ హక్ (Mohd Haque)లు కాగ్నిజెంట్‌లో చేరారు.  వాళ్లిద్దరూ కాగ్నిజెంట్‌లో చేరిన రెండు రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది.     


జతిన్‌ దలాల్‌,మహమ్మద్ హక్

మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్-కాంపిటీ క్లాజ్‌ను ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్‌కు బిజినెస్ యూనిట్ హెడ్‌గా చేరారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, హక్ తన నాన్ కాంపిటేట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్ట విరుద్దం అని కోర్టుకు విన్నవించుకుంది.  

అంతేకాదు, విప్రోను వదిలి కాగ్నిజెంట్‌లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన ఏడు ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్‌ మెయిల్‌ నుంచి తన వ్యక్తిగత మెయిల్‌కు కంపెనీ రహస్యాల్ని సెండ్‌ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని కోర్టు ఫిర్యాదులో వెల్లడించింది. 


ఫిర్యాదు ప్రకారం.. హక్‌.. విప్రో లక్ష్యాల్ని, వ్యాపార వ్యహరాల్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని అందించారు. రాజీనామాకు కొద్ది సేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాల్ని మెయిల్స్‌కి పంపుకున్నారు అని వరుస ఆరోపణల్ని గుప్పిస్తూ వస్తోంది. 

కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్, విప్రో ఎగ్జిక్యూటీవ్‌ల క్యూ 
2022 నుండి విప్రో , ఇన్ఫోసిస్ సంస్థల్లో సీనియర్‌ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్‌లో చేరారు. ముఖ్యంగా, సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్, ఈవీపీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండీ రవి కుమార్ వంటి కీలక వ్యక్తుల ఇన్ఫోసిస్ నుంచి కాంగ్నిజెంట్‌లో చేరడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది.



అదే విధంగా, విప్రో సీఎఫ్‌ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్‌మాన్, ఎస్‌వీపీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్‌ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలి వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కాగ్నిజెంట్‌తో పాటు ఇతర కాంపీటీటర్‌ సంస్థల్లో చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో, ఇన్ఫోసిస్‌లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు, వారిని చేర్చుకున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి. అందులో కాగ్నిజెంట్‌ కూడా ఉంది.  


మూల కారకులు కాగ్నిజెంట్‌ సీఈఓ రవి కుమార్‌ 

కాగ్నిజెంట్ ప్రస్తుత సీఈఓ రవికుమార్‌ గతంలో ఇన్ఫోసిస్‌లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇన్ఫోసిస్‌ నుంచి బయటకొచ్చి సీఈఓగా కాగ్నిజెంట్‌లో చేరారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌లుగా, నలుగురిని వైస్ ప్రెసిడెంట్‌లుగా మొత్తం 20 మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని తన సంస్థలోకి ఆహ్వానించారు.ఈ అంశమే కాగ్నిజెంట్‌పై ఇన్ఫోసిస్‌, విప్రోలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement