
క్యూ4 అంతంతే: టీసీఎస్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్(జనవరి-మార్చి’14)లో ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండబోవని సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తెలిపింది. మరో సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం క్యూ4 ఫలితాలకు సంబంధించి ఇప్పటికే ఇదే విధంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు దాదాపు 4% పతనమై రూ. 2,041 వద్ద ముగిసింది. ఒక దశలో 5%పైగా దిగజారి రూ. 2,015కు కూడా చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా, కంపెనీ మార్కెట్ విలువలో రూ. 16,000 కోట్లు ఆవిరైంది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ. 3.99 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈ బాటలో ఇన్ఫోసిస్ షేరు సైతం 2.3% క్షీణించి రూ. 3,271 వద్ద ముగిసింది.
సాధారణమే...
అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంతో పోలిస్తే ప్రస్తుతం నడుస్తున్న క్యూ4లో ఫలితాలు బలహీనంగా ఉండవచ్చునని టీసీఎస్ యాజమాన్యం వెల్లడించింది. ఇందుకు అధిక సెలవులు కారణంకాగా, సహజంగానే సాఫ్ట్‌వేర్ కంపెనీల నాలుగో క్వార్టర్ ఫలితాలు అంత ప్రోత్సాహకరంగా ఉండవని వ్యాఖ్యానించింది. యూరప్‌లో మంచి వృద్ధిని సాధిస్తున్నప్పటికీ అమెరికా, యూకే మార్కెట్లలో సగటు వృద్ధి నమోదవుతున్నట్లు వివరించింది. ఇక దేశీయ మార్కెట్లలో మందగమనం కొనసాగుతున్నదని, క్షీణత నమోదుకావచ్చునని వెల్లడించింది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3లో కంపెనీ నికర లాభం 50%పైగా ఎగసి రూ. 5,333 కోట్లకు చేరిన విషయం విదితమే. ఇదే కాలంలో ఆదాయం కూడా 32.5% జంప్ చేసి రూ. 21,294 కోట్లను తాకింది. కాగా, ప్రాజెక్ట్‌లు రద్దుకావడం, డిమాండ్ మందగించడం వంటి కారణాల వల్ల సమీప కాలానికి పనితీరు బలహీనపడే అవకాశమున్నదని ఇన్ఫోసిస్ సీఈవో ఎస్‌డీ సిబూలాల్ గత వారమే పేర్కొన్నారు. దీంతో ఇన్ఫోసిస్ షేరు 9% పడింది కూడా. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2014-15) ప్రోత్సాహకర ఫలితాలను సాధించగలమంటూ టీసీఎస్ యాజమాన్యం నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ఇందుకు క్లయింట్ల వ్యయాలు పెరుగుతుండటం దోహదపడగలదని తెలిపింది. మీడియా, లైఫ్‌సైన్స్ విభాగాలకు పటిష్ట డిమాండ్ కనిపిస్తుండగా, బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, తయారీ, టెలికం సైతం సగటు వృద్ధిని సాధించగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇక కరెన్సీకి సంబంధించి పెద్ద ప్రభావం ఉండబోదని అభిప్రాయపడింది. ఇటీవల సాఫ్ట్‌వేర్ షేర్లలో వచ్చిన పటిష్టమైన ర్యాలీ కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపడుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. మార్చి ముగియనుండటంతో లాభాల స్వీకరణ ధ్యేయంతో అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపారు.