84% స్మార్ట్ ఫోన్ ప్రియులే!
హైదరాబాద్: విద్యార్థులకు అత్యంత ప్రియమైన గాడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ సర్వేలో తేలింది. డిజిటల్ గాడ్జెట్ వినియోగంలో విద్యార్థులు ముందున్నారని, వీరిలో 84 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులని తేటతెల్లమైంది. 83 శాతం మంది విద్యార్థులు ఫేస్‌బుక్ వినియోగిస్తున్నారని, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ 80 శాతం మంది సమాచారం, వినోదం కోసం టీవీలు, న్యూస్ పేపర్లపైనే ఆధారపడుతున్నారని వెల్లడైంది. విద్యార్థులకు డిజిటల్ అవగాహనపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ జనరేషన్ జెడ్ హైదరాబాద్‌లోని 50 స్కూళ్లలో చదివే వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికమైన విషయాలు వెలుగు చూశాయి.
శుక్రవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ సినర్జీ పార్కులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీసీఎస్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్, వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ వి.రాజన్న సర్వే వివరాలను వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద సర్వేల్లో ఇది ఒకటని, నగరంలోని 50 స్కూళ్లలో చదివే 12 నుంచి 18 ఏళ్లలోపు వెయ్యి మంది విద్యార్థులపై సర్వే నిర్వహించామని తెలిపారు. ప్రధానంగా 10 అంశాలైన స్మార్ట్‌ఫోన్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా, వాట్సప్, ఆన్‌లైన్ వినియోగం, ఎనీ టైమ్ ఎనీవేర్ లెర్నింగ్, టీవీ చూడడం, న్యూస్‌పేపర్లు చదవడం, ప్రొఫెషనల్ కోర్సుల పట్ల వారికున్న అవగాహనపై సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను చదవాలని 61 శాతం మంది విద్యార్థినులు అభిప్రాయపడగా, 48 శాతం మంది విద్యార్థులు మా త్రమే ప్రొఫెషనల్ కోర్సు లు చేయాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలిందన్నారు.
ఆన్‌లైన్ షాపింగ్‌పై 62 శాతం మంది.. బుక్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 59 శాతం, సినిమాలు, ఇతర ఈవెంట్లపై 55 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ప్రతి నిత్యం 75 శాతం మంది గంట పాటు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారని, వీరిలో 59 శాతం మందికి వచ్చే స్పందనలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సాగడం విశేషమని రాజన్న వివరించారు.
అవగాహనకు కార్యక్రమాలు
విద్యార్థులకు డిజిటల్ రంగంలో అవగాహన పెంచేందుకు టీసీఎస్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు రాజన్న వివరించారు. విద్యార్థుల కోసం క్యాంపస్ కమ్యూన్ పేరిట దేశంలో ఎక్కడివారైనా వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశామని అలాగే యాస్పైర్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ-లెర్నింగ్, ఆన్‌లైన్ కోర్సులను శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లో కూడా ఈ కేంద్రం పనిచేస్తోందన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శిక్షణ కోసం విద్యార్థుల ఎంపిక జరుగుతోందన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐదు యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని వారికి చేయూత ఇస్తున్నామని రాజన్న తెలిపారు.