హైదరాబాద్‌లో భారీ సాఫ్ట్‌వేర్ డెలివరీ సెంటర్
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ (టీసీఎస్) హైదరాబాద్‌లోని ఆదిభట్లలో భారీ సాఫ్ట్‌వేర్ డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇది మొదలు కావొచ్చని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయేంద్ర ముఖర్జీ తెలిపారు. 79 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సెంటర్‌లో సుమారు 26,000 మంది ఉద్యోగులు ఉండగలరని పేర్కొన్నారు. అయితే, దీనిపై ఎంత పెట్టుబడి పెడుతున్నదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ డెలివరీ సెంటర్లలో 24,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారని ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా టీసీఎస్‌లో 27,000 మంది ఉద్యోగులు చేరారని, మిగతా వ్యవధిలో మరో 23,000 మంది చేరొచ్చని ముఖర్జీ పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25,000 మందిని తీసుకోవచ్చని, ఇందులో సుమారు 75% మంది చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లకు సంబంధించి వచ్చే ఏడాది దాదాపు 3,000-3,500 దాకా ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు.