న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా 2 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. అమెరికాకు చెందిన బీమా సంస్థ ట్రాన్స్ అమెరికా నుంచి ఈ కాంట్రాక్టు లభించినట్లు టీసీఎస్ తెలిపింది. ఈ కాంట్రాక్టు కింద అమెరికాలో ఆ కంపెనీ బీమా, యాన్యుటీ వ్యాపార విభాగాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సర్వీసులు అందించాల్సి ఉంటుంది. 2018 రెండో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని టీసీఎస్ తెలియజేసింది.
దీంతో ట్రాన్స్‌అమెరికాకు వార్షికంగా 70–100 మిలియన్ డాలర్ల దాకా వ్యయాలు ఆదా కాగలవని పేర్కొంది. ప్రస్తుతం ట్రాన్స్ అమెరికాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,200 మంది సిబ్బందికి తమ సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అలాగే, స్థానికంగా మరింత మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు.
మరింతగా పొదుపు, మదుపు చేసేలా తమ కస్టమర్లకు తోడ్పాటునివ్వడానికి టీసీఎస్‌తో డీల్ ఉపయోగపడగలదని ట్రాన్స్ అమెరికా ప్రెసిడెంట్ మార్క్ మలిన్ చెప్పారు. టీసీఎస్ డిసెంబర్ క్వార్టర్‌లో సుమారు నాలుగు శాతం క్షీణతతో రూ.6,531 కోట్లకు నికర లాభం ప్రకటించిన నేపథ్యంలో తాజా డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం బీఎస్‌ఈలో టీసీఎస్ షేరు సుమారు అరశాతం క్షీణించి రూ. 2,773 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment