టీసీఎస్.... జోష్ !
క్యూ4, పూర్తి ఏడాది ఫలితాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించడమే కాకుండా, పోటీ కంపెనీలకంటే మార్కెట్ పరిమాణాన్ని పెంచుకోగలిగాం. గడిచిన 12 నెలల్లో యూరప్‌లోని కొత్త మార్కెట్లలో మరింతమంది కస్టమర్లను సంపాదించడమే కాకుండా, వ్యాపారాన్ని కూడా భారీగా విస్తరించాం. డిజిటల్ టెక్నాలజీలతో పాటు మేం పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు కొత్త మార్కెట్లలో తాజా ధోరణులను అందిపుచ్చుకోవడంతోపాటు మాకు మరింత విలువను చేకూర్చిపెడుతున్నాయి. విభిన్న పారిశ్రామిక విభాగాలు, మార్కెట్లు అన్నింటినుంచీ రాబోయే ఏడాది కాలంలో మరిన్ని వ్యాపారావకాశాలను చేజిక్కించుకోగలమన్న విశ్వాసం ఉంది.
- ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ
ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2013-14, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.5,358 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.3,616 కోట్లతో పోలిస్తే(వార్షిక ప్రాతిపదికన) 48.2 శాతం ఎగబాకింది. ప్రధానంగా యూరప్, ఆసియా పసిఫిక్ మార్కెట్‌ల నుంచి ఆదాయాల వృద్ధి, డిజిటల్ టెక్నాలజీల్లో పెట్టుబడుల ఆసరాతో రాబడులు జోరందుకునేం దుకు దోహదపడ్డాయని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా క్యూ4లో 31.2% వృద్ధి చెంది రూ. 21,551 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.16,430 కోట్లు మాత్రమే.
సీక్వెన్షియల్‌గా...
2013-14 మూడో త్రైమాసికం(క్యూ3)లో నమోదైన రూ.5,333 కోట్లతో పోలిస్తే క్యూ4లో నికర లాభం స్వల్పంగా 0.5 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం రూ.21,294 కోట్లతో పోలిస్తే 1.2 శాతం పెరిగింది. కాగా, మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు క్యూ4లో రూ.5,175 కోట్ల నికర లాభం, రూ.21,600 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా, దీనికి అనుగుణంగానే ఆకర్షణీయమైన పనితీరును టీసీఎస్ నమోదు చేయడం గమనార్హం. దేశీ ఐటీ దిగ్గజాల్లో రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌తో పోలిస్తే అన్నివిధాలుగా టీసీఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పూర్తి ఏడాదికి ఇలా...
2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.19,164 కోట్లకు ఎగసింది. 2012-13లో నమోదైన రూ.13,917 కోట్లతో పోలిస్తే 37.69 శాతం వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం 29.87 శాతం పెరుగుదలతో రూ.62,989 కోట్ల నుంచి రూ.81,809 కోట్లకు వృద్ధి చెందింది.
ఫలితాల్లో ఇతర ప్రధానాంశాలు...
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో పూర్తి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.32కు చేరింది.
డాలరు రూపంలో చూస్తే ఆదాయం క్యూ4లో వార్షిక ప్రాతిపదికన 16.2% వృద్ధితో 13.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నికర లాభం 22.9% పెరిగి 3.1 బిలియన్ డాలర్లకు చేరింది.
అన్ని వ్యాపార రంగాల నుంచి వ్యాపారంలో రెండంకెల వృద్ధిని కంపెనీ సాధించింది. ప్రధానంగా రిటైల్, తయారీ, లైఫ్‌సెన్సైస్-హెల్త్‌కేర్, బీఎస్‌ఎఫ్‌ఐ(బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్) రంగాలు టాప్‌లో నిలిచినట్లు కంపెనీ సీఎఫ్‌ఓ రాజేశ్ గోపీనాథన్ వివరించారు.
క్యూ4లో కంపెనీ అన్ని వ్యాపార రంగాల్లో కలిపి కొత్తగా 9 భారీ కాంట్రాక్టులను చేజిక్కించుకుంది.
బుధవారం టీసీఎస్ షేరు ధర బీఎస్‌ఈలో 2.51% నష్టపోయి రూ.2,195 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిశాక ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.