హెచ్‌సీఎల్ టెక్ భేష్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ జవనరి-మార్చి(క్యూ3)లో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. నికర లాభం 59% ఎగసి రూ. 1,624 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 1,021 కోట్లను మాత్రమే ఆర్జించింది. కంపెనీ జూలై-జూన్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. ఇక ఇదే కాలానికి ఆదాయం కూడా దాదాపు 30% పుంజుకుని రూ. 8,349 కోట్లకు చేరింది. గతంలో రూ. 6,430 కోట్లు నమోదైంది.
ఇక డాలర్ల రూపేణా చూస్తే... నికర లాభం 40% వృద్ధితో 26.42 కోట్ల డాలర్లకు చేరగా, 14% అధికంగా 136 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, త్రైమాసిక ప్రాతిపదికన కూడా 3% స్థాయిలో వృద్ధిని చూపగలిగినట్లు హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్ అనంత్ గుప్తా చెప్పారు. వరుసగా 10వ క్వార్టర్‌లో మార్జిన ్లను పెంచుకోగలిగినట్లు తెలిపారు. అక్టోబర్-డిసెంబర్(క్యూ2) కాలంతో పోలిస్తే క్యూ3లో నికర లాభం 8.5% పుంజుకోగా, ఆదాయం 2% వృద్ధిని సాధించినట్లు వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సేవలను అందించడం ద్వారా కాంట్రాక్ట్‌లను పెంచుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అనిల్ చనానా చెప్పారు. సాధారణ, పాలనా సంబంధ వ్యయాలను కట్టడి చేయడం ద్వారా మార్జిన్లను 15.9% నుంచి 19.4%కు మెరుగుపరచుకున్నట్లు తెలిపారు.
ఇతర విశేషాలివీ...
వాటాదారులకు షేరుకి రూ. 4 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
క్యూ3లో స్థూలంగా 8,291 మందికి ఉద్యోగాలను కల్పించగా, నికరంగా 1,858 మంది మిగిలారు.
మార్చి చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 90,190గా నమోదైంది.
50 మిలియన్ డాలర్లు, 30 మిలియన్ డాలర్ల విభాగంలో కొత్తగా ఇద్దరేసి చొప్పున క్లయింట్లను పొందింది.
నగదు, తత్సమాన నిల్వల విలువ దాదాపు రూ. 1,046 కోట్లకు చేరింది.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు ఇంట్రాడేలో 3% ఎగసి గరిష్టంగా రూ.1,455ను తాకింది. చివరికి 1% లాభంతో రూ. 1,424 వద్ద ముగిసింది.