న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ జూన్ త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. లాభం 25 శాతం వృద్ధితో రూ.153 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.122 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం సైతం 15 శాతం వృద్ధితో రూ.1,137 కోట్లకు చేరుకుంది. డాలర్ల రూపంలో చూస్తే నికర లాభం 19.5 శాతం వృద్ధితో 22.7 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 10 శాతం వృద్ధితో 168 మిలియన్ డాలర్లుగా ఉంది.
‘‘మరో త్రైమాసికంలోనూ స్థిరమైన పనితీరును ప్రదర్శించాం. త్రైమాసికం వారీగా చూస్తే ఆదాయంలో 3.8 శాతం వృద్ధి ఉంది. అన్నింటినీ ఆటోమేషన్, క్లౌడిఫై చేయడమనే మా విజయవంతమైన విధానానికి ఇది నిదర్శనం’’ అని హెక్సావేర్ టెక్నాలజీస్ చైర్మన్ అతుల్ నిషార్ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తు వృద్ధి అంచనాలను కూడా కంపెనీ పెంచింది. ఆదాయంలో 12 శాతం వృద్ధి ఉంటుందన్న గత అంచనాలను 13 శాతానికి, షేరు వారీ ఆర్జన అంచనాను 13 శాతం నుంచి 14 శాతానికి సవరించింది.
స్థిరమైన, బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, కనుక అంచనాలను పెంచుతున్నామని కంపెనీ సీఈవో ఆర్. శ్రీకృష్ణ తెలిపారు. భౌగోళిక ప్రాంతాల వారీగా చూస్తే... అమెరికా ప్రాంతం నుంచి 6.2 శాతం, యూరోప్ విభాగం నుంచి 5.4 శాతం క్వార్టర్ వారీగా వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయంలో అమెరికా వాటా 77 శాతం కాగా, యూరోప్ 12.7 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతం 10.3 శాతం వాటా ఆక్రమించాయి.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ సేవల్లో 37 శాతం వృద్ధి ఉంటే, బిజినెస్ ప్రాసెస్ సేవల్లో 11.5 శాతం వృద్ధి నెలకొంది. జూన్ త్రైమాసికంలో 41 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. జూన్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 15,357గా ఉంటే, రూ.742 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment