సీఎంసీ నికర లాభం 46% వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన ఐటీ సేవల కంపెనీ సీఎంసీ మార్చితో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 45.8% వృద్ధిని నమోదు చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.61 కోట్లుగా ఉన్న నికరలాభం 2013-14లో రూ.89.43 కోట్లకు పెరిగింది. న్యాయపరంగా ఒక కేసులో విజయం సాధించడం నికరలాభం భారీగా పెరగడానికి కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ కేసుతో రూ.19 కోట్ల అదనపు ఆదాయం రూ.25 కోట్ల నికరలాభం వచ్చినట్లు సీఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.రమణన్ తెలిపారు.
సమీక్షా కాలంలో ఆదాయం 19 శాతం వృద్ధి చెంది రూ. 523 కోట్ల నుంచి రూ.623 కోట్లకు పెరిగింది. గడిచిన మూడు నెలల కాలంలో కొత్తగా 15 క్లయింట్లు చేరగా అందులో 12 స్వదేశానికి చెందినవారేనన్నారు. ఏడాది మొత్తంమీద 64 క్లయింట్లు చేరారు. రవాణా, యుటిలిటీస్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వంటి రంగాల నుంచి డిమాండ్ ఉందని రమణన్ తెలిపారు. షేరుకు రూ. 22.50 డివిడెండ్‌ను సిఫార్సు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఎంసీలో 11,109 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఈ ఏడాది కొత్తగా 500 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు.