ఆకర్షణీయంగా.. ఎన్‌పీఎస్
జాతీయ పింఛను విధానం. ఇంగ్లిష్‌లో ముద్దుగా ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్). 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని 2009 నుంచీ అందరికీ వర్తింపజేసినా... అది అత్యంత ఆకర్షణీయంగా మారింది మాత్రం ఇప్పుడే. ఎందుకంటే ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీలో ఉన్న ఈ పథకాన్ని... ఇకపై 80సీసీడీ (1బీ) కిందికి తెచ్చారు. అంటే ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పటిదాకా 80సీ పరిధిలో ఉండగా...
ఇక నుంచి కొత్త సెక్షన్ పరిధిలోకి వస్తాయన్న మాట. అంటే 80సీ కింద ఉన్న మినహాయింపులకు అదనంగా ఈ మినహాయింపులు లభిస్తాయన్న మాట. ఇదే అత్యంత ఆకర్షణీయ అంశం కూడా. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
ఇక రూ. 50 వేల వరకూ పన్ను మినహాయింపు
⇒ 80సీ నుంచి తొలగించి 80సీసీడీ(1బీ) కిందికి
⇒ ప్రత్యేక సెక్షన్ కిందికి తేవటంతో గరిష్టంగా రూ. 15,000 పన్ను ఆదా
⇒ 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి
సెక్షన్ 80సీ కింద స్కూల్ ఫీజులు, బీమా పథకాలు, పీఎఫ్ వంటి పథకాల్లో పెట్టే పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకూ ఐటీ మినహాయింపు ఉంది. ఇప్పటిదాకా ఎన్‌పీఎస్ కూడా దీని పరిధిలోనే ఉంది. ఇపుడు దీన్ని ప్రత్యేక సెక్షన్ కిందికి తేవటం ద్వారా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటే ఇచ్చారు. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచీ ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులపై గరిష్టంగా రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
దేశంలో అత్యధికంగా ఉన్న యువత భవిష్యత్తు అవసరాల దృష్ట్యా జాతీయ పెన్షన్ విధానంపై (ఎన్‌పీఎస్) ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రూ.50 వేల వరకూ మినహాయింపు ఇవ్వటం ద్వారా 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి గరిష్టంగా రూ.15,000, 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రూ.10,000, అదే 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి రూ.5,000 ఆదా అవుతుంది. అయితే ఈ సెక్షన్ పరిధిలోకి అన్ని పెన్షన్ పథకాలను తేకుండా కేవలం ఎన్‌పీఎస్‌నే తేవటాన్ని ఈ సందర్భంగా గమనించాలి. బీమా పెన్షన్ పథకాలనూ దీని పరిధిలోకి తెచ్చేలా ఒత్తిడి తెస్తామని బీమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)
దేశంలో ప్రతి వ్యక్తీ పెన్షన్ పొందేలా 2009లో కేంద్రం నేషనల్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీనిని ప్రారంభించుకోవచ్చు. కనీసం సంవత్సరానికి రూ.6,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పింఛను నిధుల నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పరిధిలో పనిచేసే ఈ పథకంలో 18 ఏళ్ళ వారి నుంచి 55 ఏళ్ళ వారు ఖాతాను ప్రారంభించవచ్చు. సమీపంలోని పోస్టాఫీసు, బ్యాంకులు లేదా బ్రోకింగ్ సంస్థల దగ్గర ఎన్‌పీఎస్ ఖాతాను ప్రారంభించొచ్చు.
మూడు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు..
ఎన్‌పీఎస్ మూడు రకాలైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను అందిస్తోంది. మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఈ, సీ, జీ పేరుతో మూడు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎలా పనిచేస్తాయంటే...
ఈ (ఈక్విటీ)
⇒ ఇందులో పెట్టే పెట్టుబడులను గరిష్టంగా 50 శాతం వరకూ ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
సీ (క్రెడిట్ రిస్క్ బేరింగ్ ఇన్‌స్ట్రమెంట్స్)
⇒ ఈ ఆప్షన్ తీసుకుని పెట్టే పెట్టుబడులను స్వల్ప రిస్క్ ఉండే లిక్విడ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్, ఇతర స్థిరాదాయం ఇచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
జీ (గవర్నమెంట్ సెక్యూరిటీస్)
⇒ ఈ ఆప్షన్‌ను తీసుకుని పెట్టే పెట్టుబడులను ఎటువంటి రిస్క్ లేని కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
ఎన్‌ఏ (ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకుంటే)
⇒ ఏ ఆప్షన్‌నూ తీసుకోకుండా పెట్టే పెట్టుబడులను ఆటో చాయిస్ కింద భావించి మీ వయస్సు ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఆప్షన్స్‌ను మార్చుకుంటూ పోతారు. ఉదాహరణకు 35 సంవత్సరాల్లో జీ ఆప్షన్‌లో 20 శాతం ఇన్వెస్ట్ చేస్తే అతని వయస్సు 55 సంవత్సరాలు వచ్చేసరికి జీ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ 80 శాతానికి చేరుకుంటుంది.
అందుబాటులో ఏడు ఫండ్‌లు
ఈ పెన్షన్ ఫండ్స్‌ను నిర్వహించడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ ఎనిమిది సంస్థలకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఏడు పెన్షన్ ఫండ్స్‌లో మీకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. త్వరలోనే బిర్లాసన్‌లైఫ్ ఈ రంగంలోకి అడుగు పెట్టనుంది. మీరు ఎంచుకున్న ఫండ్ హౌస్ పనితీరు నచ్చకపోతే వీటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
రెండు ఖాతాలు..
ఎన్‌పీఎస్ టైర్-1, టైర్-2 పేరుతో రెండు ఖాతాలను అందిస్తోంది. ఇందులో టైర్-1 ఖాతాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ను 60 ఏళ్ళు వచ్చే వరకు వెనక్కి తీసుకునే అవకాశం లేదు. దీనికి అదనంగా టైర్-2 ఖాతాను ప్రారంభించి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. టైర్-2 ఖాతా నుంచి ఎప్పుడైనా వైదొలగొచ్చు. కానీ టైర్-1 ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై మాత్రమే సెక్షన్ 80సీసీడీ(1బీ) పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
ఇక విత్‌డ్రాయల్ విషయానికి వచ్చేసరికి 60 సంవత్సరాల లోపు వైదొలిగితే పెన్షన్ నిధిలో 80 శాతాన్ని తప్పకుండా యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉం టుంది. అదే 60 ఏళ్ల తర్వాత వైదొలిగితే కనీసం 40% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ యాన్యుటీ పథకాలే ప్రతి నెలా పెన్షన్‌ను అందిస్తాయి. - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం