న్యూఢిల్లీ: సవాళ్లతో గడిచిపోయిన సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో దేశీ ఉక్కు తయారీ సంస్థల లాభదాయకత మెరుగుపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న డిమాండ్, తగ్గుతున్న ముడి ఉత్పత్తుల వ్యయాలు ఇందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. ‘ఒకవైపు ఉక్కు ధరలు పడిపోతూ మరోవైపు ముడి వస్తువుల రేట్లు.. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరిగిపోతూ ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ స్టీల్ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడింది.
అయితే, కోకింగ్ కోల్ వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలు పుంజుకంటూ ఉండటం వంటి అంశాలతో మూడో త్రైమాసికంలో వాటి లాభదాయకత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి‘ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ జయంత రాయ్ చెప్పారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉక్కు రంగం లాభదాయకత ఒక మోస్తరుగా మెరుగుపడవచ్చని ఎక్యూయిట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. సరఫరాపరమైన సవాళ్లతో పెరిగిన ముడి వస్తువుల రేట్లు ద్వితీయార్థంలో తగ్గుముఖం పట్టనుండటం, సీజనల్‌గా డిమాండ్ పుంజుకుని ఉక్కు ధర పెరగడం వంటివి ఇందుకు సహాయపడగలవని తెలిపారు.
ప్రాంతీయంగా ఆశావహంగా భారత్..
ముడి వస్తువులు .. ఇతర ఉత్పత్తుల వ్యయాలు అధిక స్థాయిలో ఉండి, ఉక్కు ధరలు గణనీయంగా పడిపోవడం వల్ల సీజనల్‌గా స్టీల్ కంపెనీలకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంగా బలహీనంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) కౌస్తుభ్ చౌబల్ తెలిపారు. అయినప్పటికీ, ప్రాంతీయంగా భారత్ ఆశావహంగానే ఉందని, వచ్చే 12 నెలల్లో స్టీల్ వినియోగం సింగిల్ డిజిట్ శాతంలో వృద్ధి నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.
ఆటో రంగం నుండి డిమాండ్, ఇన్‌ఫ్రాపై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు కొనసాగిస్తుండటం ఇందుకు దోహదపడగలవని వివరించారు. ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్ బలహీనంగా ఉన్నా దేశీయంగా మాత్రం బాగానే ఉండటంతో పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధి చెందవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా చెప్పారు. ఉక్కు ధరలు ఒక శ్రేణిలో తిరగవచ్చని పేర్కొన్నారు.
చదవండి: ఎస్‌బీఐ ఖాతాదారులకు భారీ షాక్.. నేటి నుంచి
Comments
Please login to add a commentAdd a comment