'మా బిడ్డను బలవంతంగా లాక్కున్నారు'
జైపూర్: తాము ఏ తప్పూ చేయకపోయినా తామేదో కావాలని చేసినట్లు భావించి అమెరికా అధికారులు తమ బిడ్డను బలవంతంగా లాక్కున్నారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రానికి అప్పగించారని రాజస్థాన్కు చెందిన దంపతులు వాపోయారు. జైపూర్ కు చెందిన దంపతులు ఆశిష్ పరీక్, విదిశా అమెరికాలోని న్యూజెర్సీ లో టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. విదిశా గత అక్టోబర్ నెలలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. గత నెలలో ఆ బాలుడు చేతిలోకి తీసుకొని ఆడిస్తుండగా చేయి జారి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతడి తల టీవీ స్టాండ్ కు తగిలి అనంతరం నేలకు బలంగా తాకింది.
దీంతో ఆ బాలుడిని న్యూజెర్సీలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి ప్రాణగండం తప్పింది. సురక్షితంగా కోలుకున్నాడు. అయితే, అమెరికా శిశు సంరక్షణ శాఖకు చెందిన అధికారులు మాత్రం వారు కావాలనే బాబుకు హానీ కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ వారి చేతినుంచి బిడ్డను తీసుకొని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పుడు తమ బిడ్డను ఎలాగైనా తమకు ఇప్పించండని, అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని అంటున్నారు. గతంలో నార్వేలో కూడా తమ పిల్లలకు సంబంధించి భారతీయ దంపతులకు ఇలాంటి చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే.