ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : ఇంతకాలం తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ పలువురు అమెరికన్ అతివాదులు ఇండియన్లపై విద్వేష దాడులకు పాల్పడ్డారు. ఇంకా పాల్పడుతూనే ఉన్నారు. భారతీయ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా పలు ఆంక్షలు విధించారు. కానీ అవన్నీ అపోహలేనని తేలిపోయింది. భారతీయ కంపెనీలు అమెరికాలోనూ ఉద్యోగాల కల్పనలో దూసుకెళ్తున్నాయి. అక్కడ భారతీయ సంస్థలు 1,13,000 ఉద్యోగాలు కల్పించినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
‘ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్’ పేరిట ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)’ గతేడాది కాలానికి సంబంధించి ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారత సంస్థలు అమెరికాలో భారీగా ఉద్యోగాలు కల్పించడంతోపాటు, మొత్తంగా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా 147 మిలియన్ డాలర్ల నిధుల్ని కూడా మన సంస్థలు అందించాయి.
అంతేకాదు, పరిశోధనలు, అభివృద్ధి కోసం 588 మిలియన్ డాలర్లు వెచ్చించాయి. దాదాపు వందకు పైగా భారత కంపెనీలు అమెరికా, అక్కడి సరిహద్దుల్లోని ప్యుర్టొరికో దీవిలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మొత్తం అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. దాదాపు 87 శాతం భారత సంస్థలు రానున్న ఐదేళ్లలో మరింత మంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థల్లో ఇండియన్ కంపెనీలు ముందంజలో ఉన్నాయని క్రిస్ వ్యాన్ అనే సెనేటర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment