
అన్నీ విద్వేష దాడులు కావు
- విదేశాల్లో భారతీయుల మృతిపై అప్రమత్తంగా ఉన్నాం
- హెచ్1బీ వీసాలపై ఆంక్షలతో అమెరికాకు నష్టమే: సుష్మ
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై జరిగిన దాడులు, మరణాలన్నింటినీ విద్వేష చర్యలుగా పరిగణించకూడదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అమెరికాలో ఇటీవల భారతీయులపై వరుసదాడులపై రాజ్యసభలో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సుష్మ సమాధానమిస్తూ.. విదేశాల్లో భారతీయుల మరణాలపై ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ప్రభుత్వం వద్ద అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దాడులపై అమెరికా అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, విద్వేష కోణంలోనూ విచారణ కొనసాగుతుందన్నారు.
కేసు పురో గతిపై అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని చెప్పారు. కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై స్పందిస్తూ.. నిందితుడ్ని తర్వాతి రోజే పట్టుకున్నారని, అయితే కెంట్‌లో దీప్ రాయ్‌పై దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. దీప్ రాయ్ కేసు విద్వేష చర్యా? కాదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి అరెస్టులు జరగలేదని తెలిపారు. హర్నీష్ పటేల్ పై దాడిని అమెరికన్ పోలీసులు దోపిడీగా తేల్చారని సుష్మ పేర్కొన్నారు.
మరో రెండు కేసుల వివరాల్ని వెల్లడిస్తూ.. ఒక కేసులో న్యూజెర్సీలో ఉన్న బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడానని, అది విద్వేష చర్య కాదని వ్యక్తిగత, కుటుంబ అంశంమని వారు తెలిపారన్నారు. మరో కేసు కూడా విద్వేష చర్య కాదని అమెరికా అధికారులు తేల్చారని సుష్మ వెల్లడించారు. అమెరికాలో భారతీయుల హత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందన్న ప్రతిపక్షాల వాదనను ఖండించారు. విదేశాల్లో మరణించే ప్రతీ భారతీయుడి వివరాలు విదేశాంగ శాఖ వద్ద ఉన్నాయని, ఆయా వ్యక్తుల కుటుంబాలతో మాట్లాడుతున్నామని చెప్పారు.
1.5 లక్షల భారతీయులకు ఉద్యోగ వీసాలు
2016 నాటికి అమెరికాలో 1.5 లక్షల మంది భారతీయులకు ఉద్యోగ వీసాలు జారీచేశారని, అందులో 1.26 లక్షలు హెచ్1బీ వీసాలేనని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్ రాజ్యసభకు చెప్పారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సమాచారం మేరకు దాదాపు 5.4 లక్షల మంది ఎన్నారైలకు గ్రీన్ కార్డులు ఉన్నాయని తెలిపారు.
గోయల్, సింధియా మధ్య వాగ్వాదం
దేశంలో విద్యుత్ పరిస్థితిపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సింధియా లేవనెత్తుతూ.. ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చినా ఇంతవరకూ 7 కోట్ల గృహాలకు విద్యుత్ సరఫరా లేదన్నారు. సింధియా ఆరోపణల్ని గోయల్ ఖండిస్తూ.. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరును సింధియా బయటపెట్టారని విమర్శించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని చెప్పారు.
లక్షన్నర మందికి ఉపాధి
హెచ్1బీ వీసాలపై ఆంక్షలు పెడితే భారత్‌కే కాకుండా అమెరికాకు నష్టమేనని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. హెచ్1బీ పరస్పర ప్రయోజన భాగస్వామ్యంగా ఆమె అభివర్ణించారు. భారత ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాల్ని కల్పించడమే కాకుండా ఆ దేశ ఆర్థిక రంగానికి సాయం చేస్తున్నారని చెప్పారు. అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారన్న వాదనలో వాస్తవం లేదని, భారతీయ కంపెనీలే అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని సభకు వెల్లడించారు.
భారతీయ కంపెనీలు 1.56 లక్షల మంది అమెరికన్లకు ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతో పాటు, 4.11 లక్షల మందికి అనుబంధ ఉద్యోగావకాశాలు కల్పించాయని చెప్పారు. 2011 నుంచి 2015 మధ్యలో భారతీయ కంపెనీలు అమెరికాలో రూ. 13,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయని, అలాగే 1.32 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. సోషల్ సెక్యూరిటీ కోసం భారతీయ ఉద్యోగులు రూ. 45,500 కోట్లు చెల్లించారని చెప్పారు. భారత్‌లోని అమెరికన్ కంపెనీలు ఏటా 1.81 లక్షల కోట్ల ఆర్జిస్తున్నాయని వెల్లడించారు.