అనుకున్నంత పన్నైంది. ఓ వైపు నుంచి ట్రంప్ ప్రభావం మరోవైపు నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటితో అమెరికాకు వెళ్లాలనుకునేవారి కలలు కల్లలవుతున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు దేశీయ ఐటీ దిగ్గజాలకు హెచ్-1బీ వీసాలు భారీగా తగ్గిపోయాయి. 2015తో పోలిస్తే 2016 ఈ కంపెనీలకు హెచ్-1బీ వీసాలు 37 శాతం పడిపోయినట్టు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ కంపెనీలు ముందటేడాదితో పోలిస్తే 2016లో ఆమోదం పొందిన పిటిషన్లు 5,436 కోల్పోయినట్టు వాషింగ్టన్ కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ రిపోర్టు చేసింది.
ఏడు భారత ఐటీ దిగ్గజాలకు 2016 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9,356 కొత్త హెచ్-1బీ పిటిషన్లు మాత్రమే ఆమోదం పొందినట్టు పేర్కొంది. అంటే అమెరికా లేబర్ ఫోర్స్ లో కేవలం 0.006 శాతమేనట. రిపోర్టు ప్రకారం దేశీయ టాప్ టెక్ దిగ్గజం టీసీఎస్ కు ఆమోదం పొందిన కొత్త అప్లికేషన్లు 56 శాతం పడిపోయినట్టు తెలిసింది. అంటే గతేడాది 4674 ఉంటే 2016లో 2634 పిటిషన్లు కోల్పోయి, 2040మాత్రమే ఆమోదం పొందాయి. విప్రో పిటిషన్లు కూడా 2016, 15 మధ్యకాలంలో 52 శాతం తగ్గిపోయినట్టు వెల్లడించింది. అంటే ఈ కంపెనీ కూడా 1605 పిటిషన్లను కోల్పోయింది. ఇన్ఫోసిస్ కు 16 శాతం తగ్గాయి.
ప్రభుత్వ డేటా ఆధారంగా లాభాపేక్ష లేని ఈ కంపెనీ వీటి రీసెర్చ్ చేపట్టింది. దేశీయ ఐటీ కంపెనీలు పొందుతున్న కొత్త హెచ్-1బీ వీసాలు మరింత తగ్గిపోనున్నాయని ఈ రిపోర్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి డిజిటల్ సర్వీసుల్లోకి ఇండస్ట్రీ మరలుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు వెల్లడైంది. కంపెనీలు కూడా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాలో స్థానిక వర్క్ ఫోర్స్ ను పెంచుతున్నాయని రిపోర్టు నివేదించింది. అయితే ఈ హెచ్-1బీ వీసాలు పడిపోవడం డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన్నప్పటి నుంచి కాదని, ముందు నుంచీ ఉందని చెబుతోంది.
కొత్త హెచ్-1బీ వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అసెంచర్, విప్రో, ఐబీఎం, అమెజాన్, టెక్ మహింద్రా, క్యాప్జిమినీ, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్ అమెరికా, ఇంటెల్, డెలాయిట్, గూగుల్, లార్సెన్ అండ్ టర్బో, ఆపిల్, సింటెల్, ఫేస్ బుక్, ఒరాకిల్, సిస్కో, మైండ్ ట్రి, గోల్డ్ మాన్ సాచ్స్, యూఎస్టీ గ్లోబల్, జేపీ మోర్గాన్ ఛేస్, స్టాన్ ఫోర్డ్, కేపీఎంజీ, యాహులు ఉన్నాయి.