రానుంది.. కొలువుల జాతర!
కంపెనీల సన్నాహాలు: సర్వే
న్యూఢిల్లీ : భారతీయ కంపెనీలు అధిక మొత్తంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాయి. అలాగే కంపెనీలు ఉద్యోగుల వేతనాలను పెంచాలని భావిస్తున్నాయి. ఈ విషయాలు కెరీర్‌బిల్డర్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రానున్న కాలంలో శాశ్వత ఉద్యోగుల నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు 73% కంపెనీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 60% కంపెనీలు తెలిపాయి. దాదాపు 46% మంది వర్కర్లు ఉద్యోగ బదిలీ వేటలో ఉన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో ఉద్యోగుల వేతనాలను పెంచాలని దాదాపు 86% కంపెనీలు భావిస్తున్నాయి.
ఉద్యోగుల ప్రారంభ జీతాన్ని ఐదు శాతంపైగా పెంచాలనే ఉద్దేశంలో 57% కంపెనీలు ఉన్నాయి. రానున్న కాలంలో కస్టమర్ సర్వీసెస్, సేల్స్, మార్కెటింగ్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెచ్‌ఆర్ విభాగాల్లో అధిక ఉద్యోగ నియామకాలు నమో దు కానున్నాయి. అలాగే మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి తదితర విభాగాల్లో కూడా నియామకాల జోరు కనిపించనుంది.