
ఇక దిశ-దశ విదేశీయమే!
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాల సీజన్ దాదాపు ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ అంశాలపైనే ఆధారపడనున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరు ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను నిర్దేశించనున్నాయని పేర్కొన్నారు. అయితే రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఫలితాల అంచనాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయవచ్చునని వివరించారు. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉంటుందన్నది నిపుణుల అంచనా.
నిఫ్టీకి 5,900 పాయింట్ల స్థాయి కీలకం
ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి గరిష్ట శ్రేణిలో 5,900-6,000 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ డెరైక్టర్ రజత్ రాజ్‌గారియా పేర్కొన్నారు. అయితే సమీప కాలానికి మార్కెట్లు స్వల్పస్థాయి కదలికలకే పరిమితం కావచ్చునని చెప్పారు. ఆర్థిక వృద్ధి గాడినపడుతున్న సంకేతాలు, ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ట్రెండ్‌ను నిర్దేశించవచ్చునని అంచనా వేశారు. పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రోత్సాహాన్నివ్వలేదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. దీంతో విదేశీ సంకేతాలు, కరెన్సీ కదలిక లే సమీప కాలానికి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చునని చెప్పారు.
మేలు చేసిన యెలెన్: సహాయక ప్యాకేజీలు కొనసాగుతాయంటూ అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న జానట్ యెలెన్ చేసిన వ్యాఖ్యలు వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రోత్సాహాన్నిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యెలెన్‌ను ఫెడ్ చైర్మన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బెన్ బెర్నాంకీ స్థానంలో యెలెన్ బాధ్యతలను స్వీకరించనుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకున్న బలమైన సంకేతాలు కనిపించేటంత వరకూ నెలకు 80 బిలియన్ డాలర్ల బాండ్‌ల కొనుగోలుతో చేపడుతున్న సహాయక ప్యాకేజీని కొనసాగిస్తామని యెలెన్ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రివ్వున ఎగశాయి. సెన్సెక్స్ 205 పాయింట్లు పుంజుకుని 20,399 వద్ద నిలవగా, నిఫ్టీ 67 పాయింట్లు జంప్‌చేసి 6,056 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ప్యాకేజీ ఉపసంహరణ ఆందోళనలతో వారం మొత్తంలో నికరంగా 267 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో డాలరుతో మారకంలో రూపాయి కూడా కాస్త(0.3%) బలపడి 63.11 వద్ద ముగిసింది. కరెంట్ ఖాతా లోటు అంచనాలకంటే తక్కువగానే నమోదవుతుందంటూ ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ ఇచ్చిన హామీ ఇందుకు దోహదపడింది.
కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు
ఈ నెలలోనూ రూ. 4,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయ్. ఈ నెలలో ఇప్పటి వరకూ నికరంగా రూ. 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలు, నెలకు 80 బిలియన్ డాలర్లతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు ఇకపై కూడా కొనసాగుతాయన్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ నెల 1-12 కాలంలో 64.5 కోట్ల డాలర్ల(రూ. 4,002 కోట్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ రూ. 28,700 కోట్ల పెట్టుబడులను స్టాక్స్ కొనుగోలుకు వెచ్చించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 92,936 కోట్లకు(16.8 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాలివి. అయితే మరోవైపు ఇదే కాలంలో డెట్ మార్కెట్ల నుంచి రూ.54,225 కోట్లను పసంహరించుకున్నారు.