జోరుగా కార్పొరేట్‌ పెట్టుబడులు  | Smart investment moves for FY 2019-20 | Sakshi
Sakshi News home page

జోరుగా కార్పొరేట్‌ పెట్టుబడులు 

Published Wed, Feb 20 2019 2:08 AM | Last Updated on Wed, Feb 20 2019 2:08 AM

Smart investment moves for FY 2019-20 - Sakshi

న్యూఢిల్లీ: రాజకీయాంశాలపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ మధ్య స్థాయి నుంచి భారీ స్థాయి భారతీయ కంపెనీలు మరింతగా పెట్టుబడులు పెట్టడంపై ఆశావహంగా ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో దేశీ కార్పొరేట్‌ సంస్థలు 10 శాతం మేర అధికంగా ఇన్వెస్ట్‌ చేయాలనే యోచనలో ఉన్నాయి. 100 మంది పైగా చీఫ్‌ స్థాయి అధికారులతో నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడైనట్లు అంతర్జాతీయ న్యాయ నిపుణుల ఏజెన్సీ బేకర్‌ మెకెంజీ వెల్లడించింది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో స్థిరమైన పాలన, దివాలా చట్టం.. స్థూల వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి తేవడం తదితర అంశాలు సానుకూల ధోరణులకు తోడ్పడుతున్నాయని తెలిపింది. ‘భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయడంపై పలు అంతర్జాతీయ దిగ్గజాలు బులిష్‌గా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు భారత్, చైనాలను కీలక మార్కెట్లుగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు‘ అని బేకర్‌ మెకెంజీ ఇండియా ప్రాక్టీస్‌ విభాగం గ్లోబల్‌ హెడ్‌ అశోక్‌ లాల్వానీ తెలిపారు. ‘గడిచిన నాలుగైదేళ్లుగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి నెలకొనడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలన, వ్యాపారాల సులభతర నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు జీఎస్‌టీ, దివాలా చట్టం అమలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇక మిగతా మార్కెట్లతో పోలిస్తే భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుండటం కూడా సానుకూలాంశం‘ అని ఆయన పేర్కొన్నారు.  

విదేశాల్లో పెట్టుబడులపైనా బులిష్‌గా.. 
అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే విషయం లోనూ దేశీ సంస్థలు బులిష్‌గా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్స్‌లో మూడింట రెండొంతులమంది తమ విదేశీ పెట్టుబడులను 10% పైగా పెంచుకోవాలని భావిస్తుండగా, మూడో వంతు ఎగ్జిక్యూటివ్స్‌ 10% దాకా పెంచుకోవాలని యోచిస్తున్నారు. భౌగోళిక.. రాజకీయాంశాలపరమైన సవాళ్లు, కరెన్సీపరమైన ఒత్తిళ్ల పరిస్థితుల్లో ఇది చాలా సానుకూలాంశమని బేకర్‌ మెకెంజీ తెలిపింది. కంపెనీల కొనుగోళ్ల విషయంలో కార్పొరేట్లు ముందుగా దేశీ మార్కెట్‌కు, ఆ తర్వాత ఆగ్నేయాసియా మార్కెట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. ఆసియా పరిధి దాటితే అమెరికన్‌ సంస్థల కొనుగోళ్లపై దేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement