1.7 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించాయ్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వీసా ప్రొగ్రామ్స్ లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ దేశాలను ఆకట్టుకోవడానికి భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆసియా-పసిఫిక్ రీజన్ లో భారత కంపెనీలు భారీగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. తక్కువ మంది భారతీయులకు వర్క్ పర్మిట్స్ తో ఈ తొమ్మిది దేశాల్లో కనీసం 1.7 లక్షల మందికి భారతీయ కంపెనీలు ఉద్యోగాలు సృష్టించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP) ఒప్పందం కింద ఇటీవలే ఈ అంశం తెరపైకి వచ్చింది. చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియన్ దేశాలు ఈ ఒప్పందంలో భాగమై ఉన్నాయి. కేవలం భారతీయ నిపుణులు తమ ఆర్థికవ్యవస్థలకు సహకరించడమే కాక, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ వంటి టెక్ కంపెనీలు కూడా వేలకొలదీ ఉద్యోగాలను కల్పిస్తున్నాయని పేర్కొంది.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ భారతీయ ఉద్యోగులకు షాకిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ నిపుణులను అనుమతించే విషయంలో సింగపూర్ తన కమిట్ మెంట్ ను మరిచిపోయిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆస్ట్రేలియా కూడా విదేశీయుల వీసాల్లో కఠినతరమైన రూల్స్ తీసుకొస్తోంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధానితో డైరెక్ట్ గా మన ప్రధాని నరేంద్రమోదీనే చర్చించారు. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఫిలిఫిన్స్ లో కార్యకలాపాలు నిర్వహించే దేశీయ ఐటీ సంస్థలు స్థానికంగా 60వేల ఉద్యోగాలు కల్పించినట్టు తెలిసింది. కానీ కేవలం 1500-2000 మందికే వర్క్ ఫర్మిట్స్ అవసరం పడినట్టు వెల్లడైంది.