Energy production
-
పెట్టుబడులు రూ.1.98 లక్షల కోట్లు..ఉద్యోగాలు 1.14 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుఎల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ స్టోరేజీ+ పంప్డ్ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం (కాంట్రాక్టెడ్ కెపాసిటీ) 10,095.20 మెగావాట్లు ఉండగా, 2029–30 నాటికి సుమారు 20,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జత చేసి మొత్తం 31,400 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది.2034–35 నాటికి అదనంగా మరో 18,100 మెగావాట్ల సామర్థ్యాన్ని జత చేసి మొత్తం సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం వచ్చే పదేళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది. పదేళ్లపాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. బిడ్డింగ్ ద్వారా డెవలపర్లకు ఆహ్వనం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, జియో థర్మల్, మినీ హైడల్, వేస్ట్ టూ ఎనర్జీ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి, ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. చౌకగా లీజుకు సర్కారీ భూములు.. డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. బిడ్డింగ్‌లో గెలిచిన సంస్థకు మార్కెట్ రేటులో 10 శాతం లీజు రేటుగా నిర్ణయిచి భూములను కేటాయిస్తారు. అనంతరం ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం లీజు ధరను ప్రభుత్వం పెంచనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద (పీపీఏ) జరిగాక జిల్లా కలెక్టర్లతో లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కరెంటు ప్రైవేటుకూ అమ్ముకోవచ్చు డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధరతో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి స్థలాలను కేటాయిస్తుంది. ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత సబ్ స్టేషన్ పరిధిలో కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంత సామర్థ్యం లభ్యత ఉందో.. ఆ మేరకు మాత్రమే అనుమతిస్తారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత లభించనుంది. సౌర, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. మహిళా సంఘాలతో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపన 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి ఆసక్తి వ్యక్తీకరణను డిస్కంలు విడతలవారీగా ఆహ్వనించనున్నాయి. వారి నుంచి నిరీ్ణత ధరకు విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి. భారీ ప్రోత్సాహకాలు.. ⇒ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే భూములకు నాలా కన్వర్షన్ నుంచి మినహాయింపు. ⇒ టీజీ–ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులను సత్వరం జారీ చేస్తారు. ⇒ పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను వర్తింపుజేస్తారు. ⇒ప్రతి మెగావాట్‌కు 4 ఎకరాలు చొప్పున భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. ⇒ భూముల కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లిస్తారు. ⇒వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లుఅందుతాయి. జెన్కో, ట్రాన్స్‌కో సాంకేతిక సహకారం అందిస్తాయి. ⇒ పీసీబీ నుంచి ఎన్ఓసీ మినహాయింపు. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్ వాడుకుంటే 8 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు కల్పిస్తారు. ⇒ పీఎస్పీ ప్రాజెక్టులకు నీటి సుంకాన్ని తిరిగి చెల్లిస్తారు. డిస్కంలకు విద్యుత్ విక్రయిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు ⇒ సూపర్వైజేషన్ చార్జీల మినహాయింపు. ⇒ ఇతర సౌర, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు 50 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ ఎస్‌హెచ్‌జీలు/గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత గృహాలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ స్కూల్స్, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం స్టేట్ జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. పీఎస్పీ ప్రాజెక్టులకు 45 ఏళ్ల లీజుకు స్థలాలు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల లీజుకు కేటాయిస్తారు. వీటి స్థాపన కోసం ప్రైవేటు డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 6 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. 45 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. పీఎస్పీ విద్యుత్‌లో 80 శాతం తొలి హక్కు రాష్ట్రమే కలిగి ఉంటుంది. హైబ్రిడ్ పవర్‌కు ప్రాధాన్యత.. ఒకే ప్రాంతంలో సౌర+పవన, పవన+ఫ్లోటింగ్ సోలార్, విండ్+ స్టోరేజీ, హైబ్రిడ్+స్టోరేజీ వంటి పునరుత్పాదక ఇంధన స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ ద్వారా ప్రోత్సహించనున్నారు. -
‘హరిత ఇంధనం’లో ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరుల్ని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 8,998.323 మెగావాట్లకు చేరినట్టు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీ ఏపీ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా తాజాగా వెల్లడించింది. పునరుత్పాదక విద్యుత్‌తో ఉపాధి ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్ పవర్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్లపాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8,025 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. వీటిద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో 2 వేల మందికి ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. భారీగా పెరిగిన సామర్థ్యం నెడ్‌క్యాప్ లెక్కల ప్రకారం.. 2019లో రెండు మెగావాట్లు, 2021లో 4.20 మెగావాట్ల చొప్పున కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన విద్యుత్ పెరిగింది. సౌర విద్యుత్ విషయానికి వస్తే.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం పెరిగింది. చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు చొప్పున కొత్తగా వచ్చాయి. మునిసిపాలిటీల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులు 2021లో గుంటూరులో 15 మెగావాట్లు, 2022లో విశాఖలో 15 మెగావాట్లు సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది. -
అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరణ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన విభాగంలో కార్యకలాపాలు మరింత విస్తరించింది. తాజాగా పూర్తి అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్ ద్వారా మూడు అనుబంధ సంస్థల ఏర్పాటుకు తెరతీసింది. పునరుత్పాదక ఇంధన బిజినెస్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్‌కు ఇవి అనుబంధ సంస్థలుగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. వీటి ద్వారా ప్రధానంగా పవన విద్యుత్, సౌర విద్యుత్‌సహా వివిధ పునరుత్పాదక ఇంధన మార్గాల ద్వారా విద్యుత్ ప్రసారం, అభివృద్ధి, పంపిణీ, విక్రయం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 2,088 వద్ద ముగిసింది. -
ఉ.కొరియాలో మళ్లీ అణు కార్యకలాపాలు
సియోల్: ఉత్తరకొరియా తన ప్రధాన అణు రియాక్టర్‌ను అణ్వస్త్ర ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. తమ దేశంపై విధించిన ఆంక్షల తొలగింపు, ద.కొరియాతో సైనిక విన్యాసాలను అమెరికా నిలిపివేయకుంటే అణ్వస్త్ర తయారీని తిరిగి ప్రారంభిస్తామంటూ ఉ.కొరియా బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఈఏ ఈ మేరకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. యాంగ్బియోన్లోని ప్రధాన అణు సముదా యంలో ఉన్న 5 మెగావాట్ల రియాక్టర్‌ను ఈ ఏడాది జూలై నుంచి పనిచేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం విశ్లేషించి ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది. ఇదే సముదాయంలో ఉన్న రేడియో కెమికల్ లేబొరేటరీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు పని చేసినట్లు సూచనలు కనిపించాయని పేర్కొంది. అణ్వా యుధాల తయారీలో వినియోగించే ప్లుటోనియం ఈ సముదాయంలో ఉత్పత్తవుతుంది. రియాక్టర్ల నుంచి తొలగించిన ఇంధన కడ్డీలను తిరిగి ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇక్కడ ప్లుటోనియంను వేరు చేస్తారు. ‘ఉ.కొరియా అణు కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. 5 మెగావాట్ల రియాక్టర్తోపాటు రేడియో కెమికల్ లేబొరేటరీ తిరిగి పనిచేయించడం ఇబ్బందికరమైన విషయం’అని ఐఏఈఏ పేర్కొంది. తమ దేశంలోని అణు సముదాయాలను ఐఏఈఏ బృందాలు తనిఖీ చేయడాన్ని 2009 నుంచి ఉ.కొరియా నిలిపివేసింది. -
నేను మీ కణాన్ని!
ఒక డజను పవర్ స్టేషన్స్‌ను అణు పరిమాణంలోకి మారిస్తే... ఒక పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థను సూక్ష్మరూపానికి తగ్గిస్తే... ఒక పెద్ద నగరాన్ని మినియేచర్ స్కేలుకు కుదిస్తే... అదే నేను. ఆనంద్ జీవకణాన్ని. అనేక పవర్ స్టేషన్లో శక్తి ఉత్పత్తి, రకరకాల రవాణా వ్యవస్థలో రాకపోకలూ, ఆత్మరక్షణకు ఓ పోలీసు వ్యవస్థ, ఇతర వస్తువుల ఉత్పాదన... ఇన్ని మాటలెందుకు? ఒక మెట్రోపాలిటన్ సిటీని అమాంతం సూక్ష్మీకరిస్తే ఒక కణం అవుతుంది. అలాంటి కణాలు ఆనంద్ ఒంట్లో ఎన్ని ఉంటాయో తెలుసా? 60 ట్రిలియన్! (ఒక ట్రిలియన్ అంటే... ఒకటి పక్కన పన్నెండు సున్నాలు. అంటే పది లక్షల కోట్లు). నేను జీవానికి మూలం. నేను ఇలాగే ఉంటానని చెప్పడం కష్టం. ఒక్కో చోట ఒకలా ఉంటా. అంటే కన్ను కణమైతే ఒకలాగా... కాలేయ కణం మరొకలాగా ఉంటానన్నమాట. అంతెందుకు... అంతెత్తున ఉండే జిరాఫీలో ఒకలాగా... చిన్న చిట్టెలుకలో మరోలా ఉంటాను. ఎన్నెన్నో ఆకృతులు... మరెన్నో రూపాలు నాకు నిర్దిష్టంగా ఒక రూపం అంటూ ఉండదు. నాకు ఎన్నో ఆకృతులు. గుండ్రంగా, గోళాకృతిలో, రాడ్ షేప్‌లో ఇలా ఎన్నెన్నో ఆకారాలు. కణాన్ని బట్టి... అది ఉండే స్థానాన్ని బట్టి... నిర్వహించాల్సిన పనిని బట్టి... అనుక్షణం స్పందించే గుండె దగ్గర్నుంచి... ఎప్పటికీ స్థిరంగా ఉన్నట్లు అనిపించే ఎముక వరకు ఎన్నెన్నో రకాల కణాలుంటాయి. ఆనంద్ ఏ పని చేయాలన్నా అందులో కోట్లాది కణాలు పనిచేస్తాయి. కణం అంటూ ఒకే దాన్ని గురించి చెప్పడం కష్టం. కాబట్టి ఉదాహరణకు రాడ్ కణాన్ని తీసుకుందాం. ఉదాహరణకు ఆనంద్ రాత్రిపూట మిణుకు మిణుకుమనే ఒక చుక్కను చూడాలనుకోండి. అతడిలోని 25 కోట్ల రాడ్ కణాలు పనిచేయాలి. అందులోని కనీసం మూడు కోట్ల కణాలు వెలుగును పట్టేసే విద్యుత్ రసాయనాలను వెలువరించాలి. ఇందుకు శక్తి కావాలి. ఆ శక్తి కోసం నాలోని పవర్ జనరేటింగ్ యూనిట్స్ పనిచేయాలి. నా పవర్ జనరేటింగ్ యూనిట్స్ పేరు మైటోకాండ్రియా. చాలా మెటోకాండ్రియాల ద్వారా ఆ శక్తిని ఉత్పత్తి జరుగుతుంది. అసలు నాదే చాలా సూక్ష్మ రూపం కదా. మరి నాలోని కణాంశమైన ఆ మైటోకాండ్రియా ఇంకెంత సూక్ష్మరూపంలో ఉంటుందో ఊహించండి. శక్తి కోసం మండించే ఇంధనం... చక్కెర! చక్కెరను మండించి శక్తిని తయారు చేస్తాను. ఫ్యాక్టరీలో వస్తువుల ఉత్పాదనకు ఇంధనం మండిస్తే... పొగ, కాలుష్యాల లాగే నాలోనూ వ్యర్థాలు వెలువడతాయి. అవి ప్రధానంగా కార్బన్ డైయాక్సైడ్, నీళ్ల రూపంలో ఉంటాయి. మీకు కనిపించే శక్తి విద్యుత్ రూపంలో కనిపిస్తుంది కదా. అలాగే నాలోని శక్తి అడినోసిస్ ట్రై ఫాస్ఫేట్ (ఏటీపీ) అనేది రసాయన శక్తి రూపంలో ఉంటుంది. శ్వాస పీల్చడం అనే పెద్ద పని దగ్గర్నుంచి, రెప్పపాటులో కనురెప్ప మూయడానికీ ఆ శక్తి ఉపయోగపడుతుంటుంది. ఆనంద్ చురుగ్గా ఉన్నప్పుడే కాదు... మామూలు సమయంలోనూ ఆనంద్‌లో శక్తి వెలువడటం జరుగుతూనే ఉంటుంది. అంతెందుకు ఆనంద్ నిద్రపోతున్నా, కలలు కంటున్నా అవసరమైన శక్తిని నేను ఉత్పత్తి చేసుకుంటూనే ఉంటా. ఒక్క ఎర్రరక్తకణాల్లో తప్ప మైటోకాండ్రియా అనే ఈ శక్తి ఉత్పాదక కేంద్రాలు అన్ని కణాల్లోనూ ఉంటాయి. అవి రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండాలి. వాటికి ప్రత్యేకంగా శక్తి అవసరం లేదు కాబట్టి ఎర్రరక్తకణాల్లో మైటోకాండ్రియాలు ఉండవు. అది క్షణక్షణాభివృద్ధి... క్షణకణాభివృద్ధి... నేను అనుక్షణం అభివృద్ధి చెందే క్రమాన్ని... ఒకటి రెండుగానూ, రెండు నాలుగుగానూ విడిపోయే అద్భుతాన్ని చూడాలంటే... అమ్మ కడుపులో పడ్డ తర్వాత ఆనంద్ మొదటి కణం విడిపోవడాన్ని చూడవచ్చు. అక్కడి నుంచి మొదలైన కణకణాభివృద్ధి చూడవచ్చు. కణకణాభివృద్ధి కాదది... క్షణక్షణాభివృద్ధి! కణాల్లోని డీఎన్ఏలలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా ఒక కణం నుంచి ఒక రూపం పెరుగుతుంది. ఒక ప్లాన్ తాలూకు బ్లూప్రింట్‌ను చూసి... నిర్మాణం పూర్తయ్యాక పెద్ద బిల్డింగ్‌ను చూసిన అనుభవమే పిండం పూర్తి ఆకృతిని పొందాక కలుగుతుంది. అక్కడ కణంలోని అతి చిన్న కణాంశాలలో ఉన్న సమాచారం మేరకు వెంట్రుకల ఆకృతి, వాటి రంగు, ఒంటి రంగూ... ఇవన్నీ చిన్నారికి వచ్చేస్తాయి. ఇది ఒక అద్భుతమైతే ఒక అవయవం ఎంత పెరగాలో అంతే పెరిగి అక్కడ ఆగిపోవడం మరో అబ్బురం. అన్ని వేళ్లూ ఒకేలా పెరిగినా చిటికెన వేలు చూడండి... ఎంత చిన్నగా ఉంటుందో! మీకు మరో అద్భుత విషయం చెప్పనా...? ఆనంద్ కంటిలో ఉన్న రాడ్ కణంలోని డీఎన్ఏలోనూ ఒక పూర్తి ఆనంద్‌ను రూపొందేందుకు అవసరమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అతడి కాలి కణంలోనూ అదే సమాచారం ఉంటుంది. అయితే ఆనంద్‌ను మళ్లీ రూపొందించే పని మేం చేయం. ఉదాహరణకు నేను కంటిలోని రాడ్ కణాన్ని అనుకోండి. మరో రాడ్ కణాన్ని రూపొందిస్తానంతే. కాకపోతే నేనున్న చోటిని బట్టి ఒక కణం వేగంగా విభజితం కావాలా, లేక ఆలస్యంగా కావాలా అన్నది నేను ఏ కణాన్ని అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు మరో ఉదాహరణ ఇస్తా. నేను కొవ్వు కణాన్ని అనుకోండి. కాస్తంత ఆలస్యంగా కణభివృద్ధి జరుగుతుంది. అదే చర్మం కణాన్ని అనుకోండి. ప్రతి పదిగంటలకోసారి కొత్త కణాలు రూపొందడం జరుగుతుంది. ఇలా మిగతా కణాలు పుట్టడం, చనిపోతూ ఉండటం జరుగుతుంటాయి. కానీ... మెదడు కణాలు మాత్రం ఒకసారి పుట్టాక చనిపోవడం అంటూ జరిగితే కొత్త కణాలు పుట్టవు. అయితే మెదడులో ఎన్నెన్నో కణాలుంటాయి. అవి జీవితకాలానికి సరిపోయేంతగానే కాదు... మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే అవి చనిపోతూ ఉన్నా... మిగతావి జీవితకాలపు అవసరాలకు మించి ఉంటాయి. నాకూ ఒక అద్భుతమైన ప్యాకింగ్... నాకు రూపం ఇచ్చేందుకు నాపైన ఒక పొర ఉంటుంది. అదెంత పలచగా ఉంటుందో మీకు తెలుసా? దాని మందం 0.0000001 మిల్లీమీటర్లు. నిన్నమొన్నటి వరకూ అది పల్చటి ఒక పొర మాత్రమే మాత్రమే అని అందరూ అనుకునే వారు. నాలోని అంతర్గత అవయవాలకు పైన సెలోఫెన్ బ్యాగ్‌లా మాత్రమే నా పొరని చూసేవారు. కానీ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనిపెట్టాక నా పొర గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. అది నాలోని వాతావరణాన్ని ఒకేలా ఉంచడానికి పనికి వచ్చే ఒక పొర. నాలోని లవణాలూ, రసాయనాలూ, నీళ్లూ అన్నీ సమతులంగా ఉంచేలా చూసే ఒక కోటగోడ. ప్రోటీన్లు పుట్టడానికి నా లోపలికి వేటిని అనుమతించాలో, వేటిని రానివ్వకుండా చూడాలో తెలిసిన ఒక మహాదుర్గం. ఇదెలా జరుగుతుందో చెప్పడానికి అందరికీ అర్థం కావడానికి ఒక పోలిక చెప్పనా? నాలోకి రావాల్సిన రసాయనాలూ, బయటి పదార్థాలూ నా గోడ గుర్తుపట్టేలా ఒక ఐడెంటిటీ కార్డ్‌ను ధరిస్తాయి. ఆ ట్యాగ్‌లను చూసి గుర్తుపట్టాకే ఆ పదార్థాలను లోపలికి పంపుతుందది. నా పొర గుర్తుపట్టలేదంటే నాలోకి నో ఎంట్రీ. నాలోకి అనుమతించకపోవడమే కాదు... నా కాలనీలోని ఇరుగుపొరుగు కణాలన్నీ కలిసి దాన్ని కొంతదూరం తరిమికొడతాయి. ఇదే పని చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోండి. కనురెప్ప దగ్గర దుమ్ము చేరితే కళ్లు చికిలించుకోవు. దాంతో కంట్లోకి దుమ్ము చేరుతుంది. కంట్లోకి దుమ్ము చేరినట్టే ఏ కాలేయంలోకో, కిడ్నీలోకో ఫారిన్‌బాడీ వెళ్తే? అందుకే ఈ తరిమి కొట్టడాలు. మాలోనే ఒక కణానికీ మరో కణానికీ సంభాషణ జరుగుతూ ఉంటుంది. అదెలాగో ఇంకా స్పష్టంగా తెలియదు. బహుశా ఎంజైములే కావచ్చు. ఇలా సంభాషణ ఎలా జరుగుతుందని అబ్బురపడకండి. దీనికీ ఉదాహరణ ఉంది. ఆనంద్ శరీరం నుంచి గుండెను వేరు చేస్తే కణాలన్నీ క్రమబద్ధంగా కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు స్పందిస్తూ ఉంటాయి. కానీ మళ్లీ గుండెను ఒంట్లోకి చేర్చండి. వేళ్లతాటింపుతో క్రమబద్ధంగా కదిలే హార్మోనియం మెట్లలా మళ్లీ ఇవి క్రమబద్ధంగా కదలడం మొదలవుతుంది. ఈ సమాచారం ఎలా చేరుతుందన్నది ఇంకా మిస్టరీయే. హర్మోనులు కూడా కణాల మధ్య కమ్యూనికేషన్స్‌కు ముఖ్యమైన సాధనాలే! ఉదాహరణకు ఆనంద్ ఒంటికి శక్తి కోసం చక్కెరను మండిస్తూ ఉంటాం కదా. ఇంతలోనే... ‘‘ఇంక ఉత్పత్తి అయిన శక్తి చాలు. ఆ ప్రక్రియ ఆపేయండి’’ అంటూ హార్మోన్ల సహాయంతో రక్తప్రవాహ మార్గంలో ఆదేశాలు అందుతాయి. అంతే... శక్తి ఉత్పత్తి ఆగిపోతుంది. మళ్లీ అవసరం పడగానే ‘‘పవర్ కావాలి. ఏటీపీలను అందించండి’’ అంటూ ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఆ శత్రువుతో పోరాటం కష్టం... మాకు ప్రధాన శత్రువు వైరస్. అదీ కణంలాగే ఉంటుంది. కానీ దానికి శక్తి ఉత్పాదన కేంద్రాలైన మైటోకాండ్రియాలు ఉండవు. అది కణం తాలూకు కోటగోడ అయిన పైపొరను దాటి వస్తుంది. కణంలో అచ్చం కణంలాగే ఇమిడిపోయి మా మైటోకాండ్రియానుంచి శక్తిని విచ్చలవిడిగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దాంతో అసలు కణం చనిపోతుంది. చనిపోయిన కణాన్ని వదిలేసి పొరుగుకణంలోని మైటోకాండ్రియాను మళ్లీ పట్టుకుంటుంది వైరస్. ఇలా ఒంటిలోకి చేరిన కొద్దిసేపట్లోనే వైరస్ లక్షలాది కణాలను ధ్వంసం చేస్తుంది. ఇదే ప్రక్రియ అదేపనిగా జరిగితే ఆనంద్ ప్రాణాలకు ముప్పు తప్పదు. ఆనంద్ ఫ్రెండ్స్ పదిమంది ఒక చోట చేరితే... వాళ్ల మధ్య సమన్వయం ఉంటుందా? ఆలోచించండి... మేం అరవై ట్రిలియన్స్ మందిమి అద్భుతమైన క్రమశిక్షణతో ఆనంద్ ఒంట్లో నూరేళ్లు ఉంటాం కదా. ఇది వేనోళ్ల చెప్పుకోవాల్సిన మాట కాదా! ఎన్నో పనుల్లో ఇదీ ఒకటి... నేనేం చేస్తానో... ఎలా చేస్తానో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ... ఒక చేపలో ప్రొటీన్స్ ఉంటాయి. మనం తినే మాంసంలో ప్రొటీన్లు ఉంటాయి. పప్పుల్లోనూ అవి ఉంటాయి. వాటిని మీరు తింటారు కదా... అలాగే మన గోరు తయారయ్యే పదార్థమూ ప్రొటీనే. చేపల్లో, మాంసాహారంలో, పప్పుల్లో ఉన్న ప్రొటీన్లను విడగొట్టి... మళ్లీ ఒంటికి కావాల్సిన ప్రొటీన్‌గా రూపొందించుకుంటూ ఉంటా. ఇలా నేను రకరకాల ఎన్ని ప్రోటీన్లను నా అవసరానికి తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటా. నాలో కనీసం 600 రకాల ఎంజైములు తయారవుతుంటాయి. ఆర్ఎన్ఏ (రైబో న్యూక్లిక్ యాసిడ్) అనే మాస్టర్ కెమిస్ట్ ఆదేశాల మీద ఈ ఎంజైములు తయారవుతుంటాయి. నాలో ఆవిర్భవించే సెల్యులార్ ఎంజైముల సహాయంతో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం ఉండే హార్మోన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక యాంటీబాడీలు రూపొందుతుంటాయి.