సాక్షి, అమరావతి: భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరుల్ని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రభుత్వం ప్రకటించింది.
నాలుగున్నరేళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 8,998.323 మెగావాట్లకు చేరినట్టు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీ ఏపీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా తాజాగా వెల్లడించింది.
పునరుత్పాదక విద్యుత్‌తో ఉపాధి
ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్ పవర్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్లపాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8,025 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్‌కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. వీటిద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో 2 వేల మందికి ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్‌కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి.
భారీగా పెరిగిన సామర్థ్యం
నెడ్‌క్యాప్ లెక్కల ప్రకారం.. 2019లో రెండు మెగావాట్లు, 2021లో 4.20 మెగావాట్ల చొప్పున కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన విద్యుత్ పెరిగింది. సౌర విద్యుత్ విషయానికి వస్తే.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం పెరిగింది.
చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు చొప్పున కొత్తగా వచ్చాయి. మునిసిపాలిటీల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులు 2021లో గుంటూరులో 15 మెగావాట్లు, 2022లో విశాఖలో 15 మెగావాట్లు సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది.
ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment