Andhra Pradesh: దేశీయ బొగ్గు.. తగ్గొద్దు | CM YS Jagan Mandate To Officials On Coal Storage | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: దేశీయ బొగ్గు.. తగ్గొద్దు

Published Thu, Oct 13 2022 3:22 AM | Last Updated on Thu, Oct 13 2022 8:05 AM

CM YS Jagan Mandate To Officials On Coal Storage - Sakshi

సాక్షి, అమరావతి: విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే బొగ్గు సమకూర్చుకునేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా సులియారీ, మహానది కోల్‌ బ్లాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని, వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

జగనన్న కాలనీలు పూర్తయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంధన శాఖపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
ఇంధన శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

మీటర్లపై విస్తృత అవగాహన..
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేలా అత్యంత మెరుగైన వ్యవస్థను తేవాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. మీటర్ల ఏర్పాటు వల్ల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని సూచించారు. ‘మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంట్‌ అవసరమో తెలుస్తుంది. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది.

వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆ డబ్బు అక్కడ నుంచి విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుంది. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు రైతులకు జవాబుదారీగా ఉంటాయి.

మోటార్లు కాలిపోయినా, నాణ్యమైన కరెంట్‌ సరఫరా కాకపోయినా డిస్కంలను రైతులు ప్రశ్నించగలుగుతారు. ఈ వివరాలన్నింటిపైనా వారికి నిరంతరం అవగాహన కల్పించాలి’ అని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయిందనే వివరాలతో సమగ్ర లేఖ ద్వారా విడుదల చేయాలని అధికారులను  సీఎం ఆదేశించారు. 

16.63 లక్షల మంది రైతుల అంగీకారం
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతులు  అంగీకరించారని అధికారులు తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలను దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైన 24 గంటల్లోపే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని, గత 90 రోజుల్లో 99.5 శాతం ట్రాన్స్‌ఫార్మర్లను  24 గంటల్లోపే రీప్లేస్‌ చేశామని వివరించారు. అయితే ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సాంకేతికతతో ముందడుగు..
విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్‌లో ధరలు తదితర అంశాలపై స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)లో డేటా అనలిటిక్స్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని వినియోగిస్తున్నామని, దీనివల్ల గతంలో 4 నుంచి 5 శాతం ఉన్న మీన్‌ యావరేజ్‌ పర్సంటేజ్‌ ఎర్రర్‌ (ఎంఓపీఈ) 2 శాతానికి తగ్గిందని వెల్లడించారు. 

అందుబాటులోకి కొత్త యూనిట్లు..
పోలవరంలో విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే టర్బైన్‌ మోడల్‌ టెస్ట్‌ ముగిసిందని, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. పవర్‌ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అప్పర్‌ సీలేరులో 1,350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తైందని, టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.

కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాజెక్టును ఈ నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ రెండు యూనిట్లను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు.  

పంప్డ్‌ స్టోరేజీతో రాష్ట్రానికిæ ప్రయోజనం..
పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి చాలా ప్రయోజనాలున్నాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులకు భూములిచ్చిన వారికి, అసైన్డ్‌ భూములున్న వారికి కూడా ఏడాదికి ఎకరాకు రూ.30 వేల చొప్పున ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలం ఈ ప్రయోజనాలు అందుతాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున ఈ ధర పెరుగుతుంది. భూములిచ్చే రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం’ అని సీఎం తెలిపారు. 

గ్రీన్‌ ఎనర్జీకి భారీ ప్రతిపాదనలు..
గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు అందాయని, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులను నెలకొల్పనున్నట్లు రెన్యూ కంపెనీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సమీపంలో దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదించారని తెలిపారు.

ఎన్టీపీసీ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇ– మెథనాల్, గ్రీన్‌ అమ్మోనియా, ఆఫ్‌ షోర్‌ విండ్‌ పవర్, హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన ప్రతిపాదనల గురించి అధికారులు సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.

ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రావత్, ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు కె.సంతోషరావు, జె. పద్మా జనార్ధనరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement