సిగరెట్ ఇవ్వలేదని అన్నని చంపేశాడు
సిగరెట్ ఇవ్వలేదని అన్నని చంపేశాడు
Published Fri, Dec 18 2015 2:08 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
న్యూఢిల్లీ: అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదంలో అన్న దారుణహత్యకు గురికావడం ఢిల్లీలో కలకలం రేపింది. కంటికి రెప్పలా పెంచుకుంటున్న బిడ్డల్లో ఒకరు శాశ్వతంగా దూరంకావడం, మరొకరు నేరస్తుడిగా మిగలడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో క్షణికావేశంలో అన్నపై దాడి చేశాడో బాలుడు. తప్పు తెలుసుకొనేలోపే ఘోరం జరిగిపోయింది.
సిగరెట్ తాగుతున్న అన్న(18) ను చూసిన తమ్ముడు (16).. తనకూ ఒకటి ఇమ్మని అడిగాడు. దీనికి అన్న నిరాకరించాడు. ఆగ్రహానికి గురైన తమ్ముడు ఈ విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో పక్కనే ఉన్న ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అన్నపై దాడిచేసి తలపై తీవ్రంగా కొట్టాడు. రక్తమోడుతున్న అతడిని అలాగే వదిలేసి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న పెద్దకొడుకు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అయితే కుమారుడు పడి ఉన్న తీరు చూసి, దొంగతనం జరిగిందనే అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
అయితే చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి సారీ చెబుదామని చిన్నకొడుకు ఇంటికి చేరాడు. అప్పటికే అన్న తిరిగిరాని లోకాలకు తరలిపోయాడని తెలిసి బావురుమన్నాడు. జరిగిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని జువెనైల్ హోంకు తరలించారు.
Advertisement