ఈ నెల 31‘యాంటీ టొబాకో డే’
ఒక ఫ్యాషన్‌గా మొదలయ్యే పొగతాగడం అన్న అలవాటు తల వెంట్రుకల దగ్గర్నుంచి మొదలై శరీరంలోని అన్ని భాగాలనూ దెబ్బతీస్తుంది. అన్ని పనులనూ అతి చులాగ్గా, అతి చురుగ్గా చేసే కార్యసాధకులు పొగతాగుతారనే తరహా ప్రకటనలతో యువత దీనిపట్ల ఆకర్షితమవుతుంటుంది. అంతే... పొగతాగడం వల్ల వాళ్లు చురుగ్గా నిర్వహించగలిగే చాలా చిన్న చిన్న పనులు కూడా ఒక దశ తర్వాత అతి కష్టంగా మారతాయంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ఊపిరి తీయడం కూడా అంతులేని భారంగా పరిణమించేంతగా పొగాకు దెబ్బతీస్తుంది. శరీరంలో తలవెంట్రుకల మొదలు కాలిగోటి వరకు ఉండే భాగాలతో పాటు అంతర్గతంగా ఉండే అనేక కీలక శరీర వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయన్న అంశంపై అవగాహన కలిగించేదే ఈ ప్రత్యేక కథనం.
పొగ... అనేక హానికర రసాయనాల మిశ్రమం
పొగ వదులుతుండటం మనకు చాలా స్టైల్‌గా కనిపించవచ్చేమోగానీ... అందులోని రసాయనాలు ఎంత హానికరమో వర్ణించడానికి మాటలు చాలవు. ఒక సిగరెట్ పొగలో 7,000కు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటితో పాటు క్రోమియం, ఆర్సెనిక్, లెడ్, క్యాడ్‌మియం వంటి ప్రమాదకరమైన లోహాలూ ఉంటాయి. అంటే మనం నేరుగా లోహాలను శరీరంలోకి స్వీకరిస్తున్నామంటే ఎంత ప్రమాదమో ఆలోచించుకోవచ్చు.
ఇలాంటి వాటినా మనం స్వీకరించేది!
సిగరెట్ పొగ వదలడం చాలా ఫ్యాషనబుల్‌గా కనిపించవచ్చు. కానీ ఆ పొగలో ఏముంటాయో, అవి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుంటే మళ్లీ సిగరెట్ ముట్టాలంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఉదాహరణకు...
ఫార్మాల్డిహైడ్: సిగరెట్ పొగలో ఉండే ఫార్మాల్డిహైడ్ అన్న రసాయనాన్ని మృతదేహాలను సంరక్షించేందుకు వాడతారు. అనేక జువాలజీ ల్యాబ్‌లలో విద్యార్థులకు చూపించడానికి అనేక జీవుల మృతదేహాలను గాజుకుప్పెల్లో భద్రపరిచే విషయం తెలిసిందే. ఈ ఫార్మాల్డిహైడ్ ద్రావణంలోనే వాటిని ఉంచుతారు.
బెంజీన్: మనం రోజూ వాడే పెట్రోలు, గ్యాస్‌లలో ఉండే వ్యర్థ పదార్థం ఇది. మనం ఆఘ్రాణించడానికి విముఖత చూపే విచిత్రమైన వాసనను వెలువరుస్తూ ఉంటుందిది.
పొలోనియమ్: ఇది రేడియోధార్మిక పదార్థం. రేడియోధార్మికత వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే.
వినైల్ క్లోరైడ్: ఈ రసాయనాన్ని ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ ఉపకరణాలు తయారు చేయడానికి వాడతారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే సిగరెట్ తాగడం అంటే ఈ ప్లాస్టిక్‌ను శరీరంలోకి ఆహ్వానించడం లాంటిదే.
అనేక వ్యాధులకూ కారణమే!
పొగతాగడం కేవలం క్యాన్సర్లను మాత్రమే గాక... అనేక వ్యాధులనూ ప్రేరేపిస్తుంది. గుండెపోటు, రక్తపోటు, పక్షవాతంతో పాటు మధుమేహం వచ్చేలా చేస్తుందీ అలవాటు. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చేందుకు 30 - 40 శాతం వరకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఇక పొగతాగడం మన పూర్తి వ్యాధి నిరోధకశక్తిని దెబ్బతీసి మరిన్ని వ్యాధులకు కారణం కావచ్చు.
అనేక క్యాన్సర్లకు కారణం ఈ పొగ...
సిగరెట్ తాగే వారికి వచ్చే ప్రధాన వ్యాధి క్యాన్సర్. అది ఎన్ని రూపాల్లో వస్తుందో ఊహించడమూ కష్టమే. సాధారణంగా పొగ దుష్ర్పభావాల వల్ల నోటి క్యాన్సర్లు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లను అందరూ ఊహిస్తారు. కానీ నిజానికి ఈ కింది క్యాన్సర్లన్నింటికీ పొగతాగే అలవాటే ప్రధాన కారణం. అవి...
మూత్రాశయ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ (ప్రధానంగా ఆక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా)
పెద్దపేగు క్యాన్సర్
మలద్వార క్యాన్సర్
ఈసోఫ్యాగియల్ క్యాన్సర్
మూత్రపిండాల క్యాన్సర్
యురేటర్ క్యాన్సర్
లారింజ్ క్యాన్సర్
కాలేయ క్యాన్సర్
ఓరోఫ్యారింజియల్ క్యాన్సర్స్ (గొంతు, నాలుక, అంగిలి, టాన్సిల్స్... అన్ని రకాల క్యాన్సర్లను కలగలిపి ఇలా పిలుస్తారు)
పొట్టలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు (స్టమక్ క్యాన్సర్)
ట్రాకియా, బ్రాంకస్, లంగ్ క్యాన్సర్స్.
పొగతాగే తండ్రుల వల్ల పుట్టబోయే పిల్లల్లో క్యాన్సర్!
బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. దీనికి కారణాన్ని కూడా పరిశోధకులు చెబుతున్నారు. తమ జన్యువులను పిల్లలకు అందించే వీర్యకణాల్లోని డీఎన్‌ఏ... పొగ వల్ల దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన డీఎన్‌ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ. అయితే ఈ రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయం కూడా ఉంది. దంపతులు గర్భధారణకు ప్లాన్ చేసుకున్న సమయం కంటే... కనీసం మూడు నెలల ముందే పొగతాగే అలవాటు మానేస్తే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ డయానా యాండర్సన్. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం.
అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్‌ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది.
మరింత ప్రమాదం ప్యాసివ్ స్మోకింగ్...
కొందరు నేరుగా సిగరెట్ తాగకపోయినా... పొగతాగే వాళ్ల సాన్నిహిత్యంలో ఉంటుంటారు. ఫలితంగా పొగతాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలన్నీ వీళ్లపైనా ఉంటాయి. పైగా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియ వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ. ఈ ప్యాసివ్ స్మోకింగ్‌కు ప్రధానంగా ఇంట్లోని అమాయకమైన పిల్లలు ఎక్కువగా గురవుతుంటారు. ఫలితంగా సిగరెట్ వల్ల పెద్దలకు వచ్చేందుకు అవకాశాలున్న వ్యాధులన్నీ పిల్లలకు సైతం వాళ్ల ప్రమేయం లేకుండానే రావచ్చు.
తల్లిదండ్రుల ధూమపానంతో పిల్లల్లో కలిగే దుష్పరిణామాలు
అకస్మాత్తుగా ఆస్తమా కనిపించడం
శ్వాసకోశవ్యాధులు
చెవి ఇన్ఫెక్షన్లు
అకస్మాత్తుగా పిల్లలు మృతిచెందడం (దీన్నే సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ -సిడ్స్ అంటారు).
పొగతాగే అలవాటున్న తల్లిదండ్రుల పిల్లలకు గుండె
జబ్బులు వచ్చే అవకాశాలు 25% నుంచి 30% అదనంగా ఉంటాయి.
మహిళలూ... తస్మాత్ జాగ్రత్త!
పురుషులతో పోలిస్తే మహిళల్లో పొగతాగే అలవాటు బాగా తక్కువే. అయితే సిటీల్లోని నాగరక సమాజంలో కొందరు స్త్రీలతో పాటు, ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో అడ్డపొగాకు పేర పొగతాగే అలవాటు మహిళల్లోనూ ఉంది. ఇక గర్భవతి అయిన మహిళకు పొగతాగే అలవాటు ఉంటే దాని దుష్పరిణామాలు మరీ మరీ ఎక్కువ. గర్భవతులైన మహిళల్లో పొగతాగడం వల్ల కనిపించే దుష్ర్పభావాల్లో కొన్ని...
నెలలు నిండటానికి ముందే ప్రసూతి (ప్రీ-టర్మ్ డెలివరీ)
మృతశిశువు జన్మించడం (స్టిల్ బర్త్) పుట్టిన శిశువు బరువు బాగా తక్కువగా ఉండటం
పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోవడం (దీన్నే సిడ్స్ లేదా క్రిబ్ డెత్ అంటారు)
ముత్యాల గర్భం (దీన్నే ఎక్టోపిక్ పెగ్నెన్సీ అంటారు)
పుట్టిన పిల్లల్లో గ్రహణం మొర్రి కనిపించడం (క్లెఫ్ట్ ప్యాలెట్). ఇక మహిళలకు పొగతాగే అలవాటు ఉంటే వారి ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోయి పెళుసుబారి, తేలిగ్గా విరిగిపోతాయి.
సిగరెట్ మానేస్తే...తక్షణం కలిగే ప్రయోజనాలు
మీరు చాలాకాలం మీ కుటుంబంతో, మీ మిత్రులతో సురక్షితంగా, ఆరోగ్యంగా జీవిస్తారు.
మీ పిల్లల పుట్టిన రోజులను చాలా చూస్తారు.
మీరు జబ్బుపడే రోజులు తగ్గుతాయి.
మీరు మందులకూ, చికిత్సలకూ పెట్టే ఖర్చూ చాలా వరకు తగ్గుతుంది.
మీరు మరింత శక్తిమంతంగా ఉంటారు.
మీరు తేలిగ్గా శ్వాసిస్తారు.
అన్ని రకాల రుచులూ, వాసనలూ గ్రహిస్తారు.
మీ రిటైర్‌మెంట్ తర్వాతి జీవితం చాలా హాయిగా ఉంటుంది.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
వెంట్రుకలనూ రాల్చేసే పొగ
పొగతాగడం వల్ల వయసు పైబడటం అన్నది చాలా సాధారణ ప్రక్రియ అనీ, దాంతో చర్మం ప్రభావితమవుతుందన్నది తెలిసిందే. ఇదే ప్రభావం తలపైన ఉండే చర్మానికీ వర్తిస్తుంది. దాంతో ఆ భాగంలోని చర్మానికి వయసు త్వరగా మీద పడటంతో తలవెంట్రుకలు రాలిపోవడం చాలా సాధారణం. దీంతో పాటు తల వెంట్రుకలను పట్టి ఉంచే హెయిర్ ఫాలికిల్ తాలూకు డీఎన్‌ఏ బలహీనమవుతుంది. దాంతోపాటు హెయిర్ ఫాలికిల్ నుంచి వెంట్రుకకు రక్తసరఫరా దెబ్బతినడం కూడా వెంట్రుకను పూర్తిగా పెరగనివ్వకుండా చేసి, మధ్యలోనే తెగిపోయేలా చేస్తుంది. అందుకే పొగతాగేవారి వెంట్రుకలు పెళుసుగా మారి తమ పెరుగుదల చక్రం (సైకిల్) పూర్తి చేయకుండానే చిట్లిపోతాయి. దాంతో పొగతాగేవారి వెంట్రుకలు పలచబారిపోతాయి. కొందరిలో బట్టతల వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
పొగచూరిపోయే కళ్లు
పొగతాగేవారి కంట్లో ఉండే పారదర్శకమైన లెన్స్ త్వరగా తన పారదర్శకతను కోల్పోతుంది. దాంతో వారికి ‘క్యాటరాక్ట్’ చాలా త్వరగా వచ్చేస్తుంది. మామూలుగానూ క్యాటరాక్ట్ వచ్చే అవకాశాలున్నా... పొగతాగడం వల్ల అవి రెట్టింపవుతాయి. ఈ అలవాటు కారణంగా ‘మాక్యులార్ డీజనరేషన్’ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్‌స్పాట్స్ ఏర్పడతాయి. మామూలుగానూ వయసు పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కానీ పొగతాగే అలవాటు వల్ల వయసు త్వరగా పైబడటం అనే పరిణామం జరిగి అది ఈ ‘మాక్యులార్ డీజనరేషన్’కు దారితీస్తుంది. పొగతాగే అలవాటు ఉండి డయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో డయాబెటిక్ రెటినోపతికి కారణమై అది అంధత్వానికి దారితీసే అవకాశాలు మరింత ఎక్కువ.
చెవులు... పొగలు
పొగతాగే అలవాటు లేనివారితో పోలిస్తే పొగ తాగే వారిలో వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు 75 శాతం ఎక్కువ. సిగరెట్‌లో ఉండే ఫార్మాల్డిహైడ్, ఆర్సెనిక్, వినైల్ క్లోరైడ్, అమోనియాలతో పాటు నికోటిన్‌నూ కలుపుకుని ‘ఒటో టాక్సిక్’ పదార్థాలుగా పేర్కొంటారు. అంటే అవి వినికిడి శక్తిని లోపింపజేస్తాయన్నమాట. దీంతోపాటు పొగతాగే అలవాటు వల్ల శరీరాన్ని సమతౌల్యంతో (బ్యాలెన్స్‌డ్) గా ఉంచే మధ్యచెవిలోని యంత్రాంగం దెబ్బతిని, ఒళ్లు నిలకడగా ఉండే శక్తి కొరవడవచ్చు. అంతేకాదు. చెవిలో గుయ్ అంటూ శబ్దం వచ్చే టినైటిస్ అనే జబ్బు కూడా రావచ్చు.
పొగలొదిలే ముక్కు... వాసన శక్తి తగ్గు
సిగరెట్ పొగలను ధారాళంగా వదులుతుండే వారు నోట్లోంచే గాక... ముక్కుల్లోంచి వాటిని వదిలేస్తుంటారు. దాంతో ముక్కులో ఉండే అతి సునిశితమైన వాసనను గ్రహించే యంత్రాంగం దెబ్బతింటుంది. అంతేకాదు... ముక్కులోపలి పొరలను రక్షిస్తూ ఉండే పొరలు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ముక్కులోంచి తలలో ఉండే గాలి గదులైన సైనస్‌లు కూడా దెబ్బతింటాయి. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను నిరోధించే శక్తి కూడా ముక్కు కోల్పోతుంది. క్రానిక్ సైనుసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.
నోరు... నష్టపోయే తీరే వేరు
పొగతాగడం అనే ప్రక్రియ నేరుగా నోటి ద్వారానే జరుగుతుంది కాబట్టి అన్ని అవయవాల కంటే నష్టం జరిగే అవకాశాలు నోటికే ఎక్కువ. పైగా నోటిలో సున్నితమైన మ్యూకస్ పొరలు ఉంటాయి. వీటిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. పైగా వేర్వేరు జిల్లాల్లో ఉంటే రకరకాల పొగాకు వినియోగ అలవాట్ల (అంటే అడ్డపొగ తాగడం, బీడీలు కాల్చడం, గుట్కా తినడం వంటివాటి) వల్ల మన రాష్ట్రంలో నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువ. నోటికి జరిగే నష్టాలు చాలా ఉన్నా వాటిలో ప్రధానమైనవి...
నోటిలో ‘ల్యూకోప్లాకియా’ అనే పుండ్ల వంటివి ఏర్పడి, అవి క్యాన్సర్‌గా రూపొందవచ్చు. నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్)కు అవకాశాలు చాలా ఎక్కువ.
నోటిలో ఉండే పంటి చిగుళ్ళు, పలువరస ప్రభావితమై పళ్లు, చిగుళ్ళ వ్యాధులు (పెరియో డాంటల్ డిసీజెస్) రావచ్చు. చిగుళ్ళపై మచ్చలు రావడం (స్మోకర్స్ మెలనోసిస్), పళ్లు పసుపుపచ్చగా మారడం వంటి ప్రమాదాలు చాలా ఎక్కువ.
నాలుకపై ఉండే అతి చిన్న చిన్న బుడిపెలపై బ్యాక్టీరియా, ఈస్ట్, నోటిలోని వ్యర్థాలు చిక్కుకుపోవడంతో నాలుక నల్లగా మారే ‘బ్లాక్ హెయిరీ టంగ్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు.
నోటిలో ఉండే పైభాగమైన అంగిలి తన మృదుత్వాన్ని కోల్పోయి, పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయే ‘స్మోకర్స్ ప్యాలెట్’ అనే కండిషన్‌కు అవకాశాలు చాలా ఉంటాయి.
నోటిలో ఉండే లాలాజల గ్రంథుల పనితీరు, ప్రభావం దెబ్బతిని కేవలం నోరు మాత్రమే గాక... అది మొత్తం జీర్ణవ్యవస్థపైనా దుష్ర్పభావం చూపవచ్చు.
గొంతులో వాయురూప గరళం... పొగ
నోటి ద్వారా పీల్చే సిగరెట్ పొగ మొదట ప్రవేశించేది గొంతులోకే కావడంతో నోటికి ఎంతగా నష్టం చేకూరుతుందో, గొంతుకూ అంతగానే నష్టం జరుగుతుంది. పొగపీల్చగానే అందులోని ఫార్మాల్డిహైడ్, ఆక్రోలీన్ అనే రసాయనాలు గొంతును మండిస్తాయి. స్వరం కూడా మారిపోయి దీర్ఘకాలంలో బొంగురుగానూ, చాలా లోగొంతుకతోనూ మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. గొంతులోని లారింజ్స్ దెబ్బతిని లారింజైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధికి దారితీయవచ్చు. ఇక గొంతులో గడ్డలకూ, గొంతు క్యాన్సర్‌కు అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
మెదడుపై పొగ ప్రభావం
సిగరెట్ పొగ మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పొగతాగిన కొద్దిసేపటికే కొద్దిపాటి మత్తు కలగడంతో ఆ అలవాటు ఉన్నవారు దాని ప్రభావాన్ని గ్రహించగలరు. ఈ కిక్ తాపత్రయంతో పొగకు అలవాటు పడ్డవారిలో మెదడుపై అది చూపే అనేక రకాల దుష్ర్పభావాలను తెలుసుకుంటే పొగ తాగాలంటేనే భయం వేస్తుంది. అంత దారుణంగా ఉంటాయా ప్రభావాలు. ఉదాహరణకు పొగతాగేవారిలో రక్తనాళాలు సన్నబారే ప్రమాదం ఉన్నందున, అది మెదడు రక్తనాళాల్లో జరిగితే పక్షవాతం వచ్చి కదలలేక, కాళ్లూ చేతులు ఆడక - జీవితాంతం మరొకరిపై ఆధారపడుతూ జీవించాల్సి రావచ్చు. 65 ఏళ్లు దాటాక చాలామందిలో వచ్చే పక్షవాతానికి పొగతాగే అలవాటే ప్రధాన కారణం. ఇక ఒకసారి సిగరెట్‌లోని నికోటిన్‌కు మెదడు బానిస అయితే ఎలాగోలా సిగరెట్ తాగేందుకు వెంపర్లాడేలా అనేక మాయలు చేస్తుంది మెదడు. దీన్నే ‘క్రేవింగ్ ఎఫెక్ట్’ అంటారు. అందుకే సిగరెట్‌కు బానిస కాకుండా దాన్ని వదిలేయడం మేలు. శరీరంలోని ఏ భాగాన్ని నియంత్రించే రక్తనాళాలు మెదడులో సన్నబడ్డాయో, ఆ అవయవం పనితీరు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
గుండె, రక్తప్రసరణ వ్యవస్థపైనా... ప్రభావం
గుండెపోటునూ, రక్తప్రసరణ వ్యవస్థను పొగతాగే అలవాటు అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ అలవాటు అనేక రకాల గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌కు) కారణమవుతుంది. పొగవల్ల గుండెపై పడే దుష్ర్పభావాలలో కొన్ని...
గుండెపోటు (హార్ట్‌స్ట్రోక్), గుండెకు సంబంధించిన రక్తనాళాల వ్యాధులు రావచ్చు.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే గుండె శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు... ఇలా ఈ రక్తనాళాలు సన్నబారడం వల్ల రక్తం మరింత వేగంగా ప్రవహిస్తుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. ఇక రక్తపోటు అన్నది నిశ్శబ్దంగా, పైకి ఏమాత్రం కనిపించకుండా శరీరంలోని అనేక కీలక అవయవాలను దెబ్బతీసి, మరణానికి కారణమవుతుందన్న విషయం తెలిసిందే. అందువల్లనే దాన్ని సెలైంట్ కిల్లర్‌గా అభివర్ణిస్తారు. అంతే పొగ తాగే అలవాటు రక్తపోటుకూ కారణమవుతుందన్నమాట.
పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయి. వీటినే బ్లడ్‌క్లాట్స్‌గా అభివర్ణిస్తారు. ఈ రక్తపు క్లాట్స్ శరీరంలోని ఏయే భాగాల్లోని రక్తనాళాల్లో కనిపిస్తే, ఆయా భాగాలు శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ క్లాట్స్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏర్పడితే గుండె కండరానికి తగిన ఆక్సిజన్ అందకపోవచ్చు. ఫలితంగా గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది.
ఈ రక్తపు గడ్డలు కాళ్లకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏర్పడితే కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది.
ఊపిరితిత్తులను దెబ్బతీసి... ఊపిరి తీసేయవచ్చు
నోరు, గొంతు తర్వాత పొగ నేరుగా ప్రవేశించేది ఊపిరితిత్తుల్లోనికే. దాంతో పొగ ఊపిరితిత్తుల్లోని ట్రాకియా, ల్యారింజ్స్‌తో పాటు గాలిని లోపలికీ, బయటకూ తీసుకెళ్లే ఎయిర్‌వేస్, ఊపిరితిత్తుల్లో ఉండే గాలిగదులు (ఎయిర్ స్యాక్స్)... వీటన్నింటినీ దెబ్బతీస్తుంది. పొగ ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ఈ అలవాటు ఉన్నవారిలో సీఓపీడీ, బ్రాంకైటిస్ అనే వ్యాధులకు దారితీయవచ్చు. అప్పటికీ ఈ అలవాటు మానకపోతే క్రమంగా ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిని ఒక్క అడుగు వేసినా ఆయాసపడే దశకు చేరుకుంటారు. అంతేకాదు సిగరెట్ అలవాటు వల్ల ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం చాలా ఎక్కువ. ఇక ఆస్తమా ఉన్నవారికి ఉండే ధూమపానం అలవాటు వాళ్ల పరిస్థితిని మరింత తీవ్రతరం చేసి, జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.
మూత్రపిండాలకు దెబ్బే!
పొగతాగడం వల్ల రక్తనాళాలు సన్నబారిపోతాయన్న విషయం తెలిసిందే. పైగా అలా సన్నబారిపోవడంతో అక్కడ రక్తపోటు విపరీతంగా పెరుగుతుందన్న విషయం కూడా తెలిసిందే. మూత్రపిండాల్లో రక్తాన్ని శుద్ధి చేసే రక్తనాళాలు అతి సన్నగా ఉంటాయి. ఫలితంగా మూత్రపిండాల్లోని అతి సన్నటి రక్తనాళాలు చిట్లిపోయి, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.
పురుషుల్లో లోపించే సెక్స్ సామర్థ్యం
సిగరెట్ తాగే అలవాటుతో రక్తనాళాలు సన్నబడడమనే పరిణామం ఒకవేళ పురుషాంగంలో జరిగితే అక్కడికి తగినంత రక్తం చేరే అవకాశాలు లేక అంగస్తంభన సమస్యలు వస్తాయి. అంతేకాదు... పొగతాగే అలవాటు వల్ల వీర్యకణాల కదలికలు, వీర్యం నాణ్యత తగ్గిపోతాయి. దాంతో పిల్లలుపుట్టే అవకాశాలూ గణనీయంగా తగ్గుతాయి.
ప్రోస్టేట్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం
పొగతాగడం ప్రోస్టేట్ క్యాన్సర్‌కు పెద్ద రిస్క్ ఫాక్టర్. ఓ వ్యక్తి తాగిన సిగరెట్లు ఎన్ని అనే కొలతకు ఒక ప్రవూణం ఉంది. ఆ కొలత పేరే ‘ప్యాక్ ఇయుర్’. ఒక వ్యక్తి రోజుకో ప్యాకెట్ చొప్పున ఏడాది పాటు తాగిన సిగరెట్లను ఒక ‘ప్యాక్ ఇయుర్’ అంటారు. అంటే... ఉదాహరణకు ఓ వ్యక్తి రోజుకు రెండు పెట్టెలు తాగుతాడనుకుందాం. అప్పుడు ఆర్నెల్ల వ్యవధిలో తాగే సిగరెట్లే ఓ ‘ప్యాక్ ఇయుర్’ అవుతాయున్నవూట. ఇలా ఓ వ్యక్తి తాలూకు ప్యాక్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ప్రోస్టేట్‌పై దాని ప్రభావం తాలూకు దుష్పరిణామాలు అంతకంతకూ రెట్టింపవుతూ, అదే నిష్పత్తిలో పెరుగుతూ పోతాయన్న మాట! స్మోకింగ్‌ను పూర్తిగా మానేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను గణనీయం తగ్గించుకోవచ్చు.
‘పొగ’చూరి... పెళుసుబారిపోయే ఎముకలు
ఎముకలు పటిష్ఠంగా ఉండాలంటే అందులో క్యాల్షియం ఎక్కువగా చేరుతుండాలి. ఈ పని రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. కానీ పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఎముకలకు అందాల్సిన పోషకాలు తగ్గుతూ పోతాయి. దాంతో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే.
చర్మానికి పొగబెట్టే సిగరెట్
పొగతాగడం వల్ల చర్మం ముడుతలు తీవ్రతరమవుతాయి. పొగలోని హానికర రసాయనాలూ, శరీరంలో జరిగే జీవక్రియల నుంచి వెలువడే హానికర పదార్థాలను బయటికి తొలగించే యంత్రాంగం బలహీనంగా మారడంతో చర్మం తన వయసు కంటే ముందుగానే వృద్ధాప్యానికి లోనవుతుంది. దాంతో పొగతాగేవారు తమ వాస్తవ వయసు కంటే పెద్దవారిగా కనబడటం చాలా సాధారణం.
పాదాలకూ రిస్కే!
పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు సన్నబడతాయి కాబట్టి పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడితే ఒక్కోసారి పాదం కుళ్లిపోవడానికి (గ్యాంగ్రీన్‌కు) దారితీస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి పొగతాగే అలవాటు ఉంటే ఈ ముప్పు మరీ ఎక్కువ. దీన్ని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అని అంటారు. ఒకవేళ సమస్య కేవలం పొగతాగేవారిలో కేవలం ఆ అలవాటు కారణంగానే రావచ్చు. అలాంటి సమస్యను బర్జర్స్ డిసీజ్ అంటారు. పాదాలను రక్షించుకుని చివరివరకూ మీ పాదాలపై మీరు నిలబడాలంటే తక్షణం పొగతాగే అలవాటును వదులుకోవాల్సిందే.
మీకు సిగరెట్ అలవాటు ఉంటే పైన చెప్పిన కారణాలన్నింటి వల్ల దాన్ని తక్షణం మానేయండి. ఒకవేళ ఆ అలవాటే ఇప్పటి దాకా లేకపోతే ఎప్పుడూ దాన్ని ముట్టుకోకండి.
‘పొగ’ చూరిపోకండి... మసిబారిపోకండి
Published Mon, May 26 2014 10:59 PM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM
Advertisement
Advertisement