కాల్చకురా... కాలేవు... | On May 31st World No Tobacco Day! | Sakshi
Sakshi News home page

కాల్చకురా... కాలేవు...

Published Sun, May 29 2016 2:01 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

కాల్చకురా... కాలేవు... - Sakshi

కాల్చకురా... కాలేవు...

మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా...
పొగతాగని వాడు దున్నపోతై పుడతాడో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు గానీ, పొగతాగే వాడు మాత్రం ‘ధూమ్రపోతై’ గిట్టడం ఖాయం. ఈ సంగతి పొగరాయుళ్లకు కూడా బాగానే తెలుసు. అయినా ఎడాపెడా పొగచుట్టలు తగలేస్తూనే ఉంటారు. సిగరెట్, చుట్ట, బీడీ, హుక్కా... ఏదైతేనేం నిదానంగా ప్రాణాలు తీయడానికి. అందుకే ‘కాల్చకురా... కాలేవు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కూడా మొత్తుకుంటూనే ఉన్నాయి.

పొగ తాగే పాడు అలవాటును మానుకోవాలంటూ దశాబ్దాలుగా మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తూ, మారుమూల ప్రాంతాలకు సైతం చేరే రీతిలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి.

 
ఇదీ నేపథ్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సాగిస్తున్న విస్తృత ప్రచారం వల్ల కొంతవరకు సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో పొగరాయుళ్ల శాతం గడచిన మూడు దశాబ్దాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శాతం లెక్కల్లో తగ్గుదల కనిపిస్తున్నా, జనాభా పెరుగుదల కారణంగా పొగరాయుళ్ల సంఖ్యాబలం  పెరిగిందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పొగరాయుళ్ల జనాభా 113 కోట్లకు పైనే ఉంది. వారిలో దాదాపు 95 కోట్ల మంది పురుషులే కాగా, సుమారు 18 కోట్ల మంది మహిళలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పొగాకు వ్యతిరేక ప్రచారం ఫలితంగా అగ్రరాజ్యాల్లో పొగరాయుళ్ల సంఖ్య బాగానే తగ్గుముఖం పట్టినా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, వెనుకబడిన దేశాల్లోను ఈ సంఖ్య ఇంకా ఆందోళనకరమైన స్థాయిలోనే ఉంది.

ముప్పయ్యేళ్ల కిందట అమెరికా జనాభాలో 42 శాతం మంది యథేచ్ఛగా పొగపీల్చేవారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రచార ఫలితంగా ఇప్పుడు ఆ సంఖ్య 20.8 శాతానికి తగ్గింది. ఇదే వ్యవధిలో భారత్‌లో పొగతాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. ఇది కొంతవరకు ఆశాజనకమైన పరిణామమే అయినా, పొగతాగే వారి సంఖ్య మరింతగా తగ్గితే తప్ప ప్రపంచం ఆరోగ్యకరంగా మారదని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది. అందుకే పొగతాగడం మాత్రమే కాదు, ఇతర రూపాల్లోనూ పొగాకు వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలనే సంకల్పంతో 1988 సంవత్సరంలో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించింది. పొగాకు వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలనే సంకల్పంతో డబ్ల్యూహెచ్‌ఓ 1998 నుంచి ‘టొబాకో ఫ్రీ ఇనీషియేటివ్’ను చేపట్టింది.
 
పొగ’సెగపై అవీ... ఇవీ...
40 వేల కోట్ల డాలర్లు
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువులు సిగరెట్లే. ఏటా దాదాపు లక్ష కోట్ల సిగరెట్లు అమ్ముడుపోతున్నట్లు అంతర్జాతీయ సంస్థల అంచనా. వీటి విలువ సుమారు 40 వేల కోట్ల డాలర్లు (రూ. 2.70 లక్షల కోట్లు).
 
70%
సిగరెట్ల అమ్మకాల్లో అమెరికాదే గుత్తాధిపత్యం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ సిగరెట్ల మార్కెట్‌లో దాదాపు 70 శాతం అమెరికాకు చెందిన మూడు బ్రాండ్లదే.
 
43 రకాల రసాయనాలు
సిగరెట్ పొగలో నికోటిన్‌తో పాటు ఆర్సెనిక్, ఫార్మల్‌డీహైడ్, హైడ్రోజన్ సైనైడ్, అమోనియా, సీసం, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి 43 రకాల ప్రమాదకర రసాయనాలు ఉంటాయి.
 
15 ఏళ్లు
పొగతాగని వారితో పోలిస్తే పొగతాగే వారు దాదాపు పదిహేనేళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోతారు.
 
10 సెకన్లు
సిగరెట్ పొగ పీల్చిన పది సెకన్లలోనే అందులోని నికోటిన్ మెదడుకు చేరుతుంది.
 
20%
సిగరెట్లలో దాదాపు 20 శాతం చక్కెర ఉంటుంది. అందుకే ఇవి మధుమేహం ఉన్నవారికి మరింత ముప్పు కలిగిస్తాయి.
 
113దేశాలు  74% మరణాలు భారత్‌లోనే
పొగాకు నమిలినా ముప్పే. అయితే, దీని వల్ల ఆ ముప్పు అలవాటు ఉన్నవాళ్లకు మాత్రమే పరిమితం. పొగాకును జర్దా, ఖైనీ, గుట్ఖా, ఖారామసాలా వంటి నానారకాల రూపాల్లో నమిలే అలవాటు చాలా దేశాల్లో ఉంది. ముఖ్యంగా భారత ఉపఖండ ప్రాంతంలో ఈ అలవాటు మరీ ఎక్కువ. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం 113 దేశాల్లో పొగాకు నమిలే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల తలెత్తే వ్యాధులతో ఏటా దాదాపు 2.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల్లో 74 శాతం కేవలం భారత్‌లోనే సంభవిస్తుండటం గమనార్హం.
 
సమాజంపై ప్రభావం
* పొగతాగే అలవాటు సమాజంపై చూపే ప్రభావం కూడా తక్కువేమీ కాదు.
* పొగతాగే పెద్దలను చూసి పిల్లలు ఈ అలవాటును నేర్చుకుంటారు. పొగతాగే వారిలో దాదాపు 60 శాతం మంది పద్దెనిమిదేళ్ల లోపు వయసులోనే ‘పొగ’కు అలవాటుపడుతున్నారు.  
* ఇక ఆహార పంటలు పండించాల్సిన నేలలో పొగాకు సాగు చేయడం వల్ల వ్యవసాయరంగానికి ఏటా వాటిల్లుతున్న నష్టం లెక్కలకు అందనిది.
* పొగతాగే అలవాటు ఉన్నవారు అల్పాదాయ వర్గాలకు చెందిన వారైతే, వారు తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఈ అలవాటు కోసమే ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్నారు.
* హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు పెద్ద నగరాల్లో విచ్చలవిడిగా నడిచే హుక్కాసెంటర్లకు టీనేజర్లు బానిసలవుతున్నారు. వీరు చాలా చోట్ల అక్రమంగా నడిచే హుక్కా సెంటర్లపై జరిగే పోలీసు దాడుల్లో పట్టుబడుతున్న టీనేజర్లు తల్లిదండ్రులకు తలనొప్పిగా పరిణమిస్తున్నారు.
* సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటి నుంచి వెలువడే పొగ వల్ల పర్యావరణం దెబ్బతిని, వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
 
పొగ’బడితే... ప్రాణాంతకమే
‘పొగ’ నిర్మూలన కోసం ఎందరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పొగతాగే అలవాటు కారణంగా ఏటా దాదాపు 60 లక్షల మంది మరణిస్తున్నారు. వారిలో సుమారు 10 లక్షల మంది భారతీయులు ఉంటుండటం ఆందోళన కలిగించే అంశం. నేరుగా పొగతాగకపోయినా, ఇంటా బయటా ఇతరులు వదిలే పొగ పీల్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరో 6 లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతేకాదు, పొగరాయుళ్ల బాధ్యతారాహిత్యం కారణంగా గర్భస్థ శిశువులకు సైతం హాని కలుగుతోంది.

‘పొగ’ ప్రభావానికి గురై పుట్టిన పిల్లలు రకరకాల శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. కొన్ని వెనుకబడిన దేశాల్లో పొగాకు తోటల్లో పనుల కోసం పిల్లలను వినియోగిస్తున్నారు. పచ్చి పొగాకును ఎక్కువసేపు చేతులతో పట్టుకోవాల్సి రావడంతో అన్నెంపున్నెం ఎరుగని పిల్లలు ‘గ్రీన్ టొబాకో సిక్‌నెస్’కు గురవుతున్నారు. దీని ఫలితంగా ఊపిరితిత్తులు, జీర్ణాశయం, గుండె, నాడీవ్యవస్థ, చర్మం దెబ్బతిని బలహీనంగా మారుతున్నారు. వైద్య చికిత్స అందని పరిస్థితుల్లో కొందరు చిన్న వయసులోనే కన్నుమూస్తున్నారు.
 
పొగ మానుకోవాలంటే..?
పొగరాయుళ్లలో దాదాపు సగం మందికి ఆ అలవాటును మానేయాలనే ఉంటుంది. అయితే, పొగాకులోని నికోటిన్ ప్రభావానికి బానిసలుగా మారడం వల్ల అంత తేలికగా అలవాటును వదులుకోలేరు. ‘పొగ’ను వదులుకోవడం కష్టం కావచ్చేమో గానీ, అసాధ్యం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఈ అలవాటు నుంచి బయటపడవచ్చని అంటున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఇవీ...
 
* సిగరెట్‌ను మానేయడానికి మిమ్మల్ని బాగా ప్రభావితం చేయగల బలమైన కారణాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు పరోక్ష పొగ నుంచి మీ కుటుంబ సభ్యులను రక్షించడం, మరింత యవ్వనంగా కనిపించడం, క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవడం వంటి కారణాలు.
* మీ మెదడు నికోటిన్ ప్రభావానికి బాగా అలవాటు పడే ఉంటుంది. దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బలంగా తీర్మానించుకోండి. అందుకు మానసికంగా సంసిద్ధులవండి.
* పొగతాగడం మానేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పి, ఈ విషయంలో వారి సహాయ సహకారాలను కోరండి.
* మానేయడం వల్ల తలనొప్పి, భావోద్వేగాల్లో మార్పులు వంటి ఇబ్బందులు తలెత్తినా కంగారు పడకండి. పదేపదే సిగరెట్ కోసం నాలుక పీకుతున్నా దాని నుంచి మనసు మళ్లించే ప్రయత్నాలు చేయండి. అప్పటికీ సాధ్యం కాకుంటే, మానసిక వైద్యులను సంప్రదించండి.
* ‘పొగ’ నుంచి మనసు మళ్లించుకోవడానికి మీకు ఇష్టమైన వ్యాపకాన్ని ఏర్పరచుకోండి. ఉదాహరణకు సంగీతం, పుస్తక పఠనం, వ్యాయామం, ట్రెక్కింగ్ వంటివి ప్రయత్నించండి.
* ‘పొగ’ నుంచి మనసు మళ్లించే మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహాపై వాటిని క్రమం తప్పకుండా వాడి, ఈ అలవాటు నుంచి విజయవంతంగా బయటపడండి.
* పొగతాగే అలవాటును మానేసే ప్రయత్నంలో ఒకటికి రెండుసార్లు విఫలమైనా మరేమీ బాధపడకండి. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండండి. తప్పకుండా మీ ప్రయత్నం ఫలిస్తుంది.
 
పొగ’ మానేసిన సెలిబ్రిటీలు
పొగతాగడం వల్ల తలెత్తే అనర్థాలపై డబ్ల్యూహెచ్‌ఓ, ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రచారానికి పలువురు సెలిబ్రిటీలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు గుప్పుగప్పుమంటూ సిగరెట్లను తెగ తగలేసిన పలువురు సెలిబ్రిటీలు విజయవంతంగా ఈ అలవాటు నుంచి బయటపడ్డారు. అలా ‘పొగ’ మానేసిన సెలిబ్రిటీలలో కొందరు...
 
సల్మాన్ ఖాన్: ఇదివరకు విరివిగానే సిగరెట్లు తాగేవాడు. కొన్నేళ్ల కిందట నరాల సమస్య మొదలవడంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాడు. వైద్యుల సూచన మేరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించి, ఈ అలవాటును మానేశాడు.
 
మహేష్‌బాబు: కొన్నేళ్ల కిందటి వరకు చైన్‌స్మోకర్‌గా ఉండేవాడు. భార్య నమ్రత కానుకగా ఇచ్చిన పుస్తకం ‘ద ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్’ చదివిన తర్వాత సిగరెట్ అలవాటును పూర్తిగా మానేశాడు. తన సినిమాల్లో ‘పొగ’ దృశ్యాలు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
 
ఆమిర్ ఖాన్: ఇదివరకు దమ్ముకొడుతూ బహిరంగంగానే కనిపించేవాడు. సిగరెట్లు తాగొద్దంటూ పిల్లలు జునియాద్, ఇరా పోరు పెట్టడంతో చాలావరకు సిగరెట్లను బాగా తగ్గించుకున్నాడు. ఐదేళ్ల కిందట చిన్న కొడుకు ఆజాద్ పుట్టిన తర్వాత అలవాటును పూర్తిగా మానేశాడు.
 
సైఫ్ అలీఖాన్: ఒకప్పుడు విచ్చలవిడిగా సిగరెట్లు కాల్చేవాడు. ఐదేళ్ల కిందట గుండెలో అవరోధం ఏర్పడి గుండెపోటు వచ్చినంత పనైంది. వైద్యులు హెచ్చరించడంతో అలవాటుకు దూరమయ్యాడు. ఇప్పుడు పొగాకు వ్యతిరేక ప్రచారంలో క్రియాశీలంగా పాల్గొంటున్నాడు.
 
ఆర్థిక రంగానికి ‘పొగ
పొగాకు వాడకం వల్ల ఆర్థిక రంగంపై కూడా పెనుభారం పడుతోంది. పొగాకు వల్ల తలెత్తే వ్యాధులకు గురైన వారి ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు పొగతాగే అలవాటు ఉన్నవారి కారణంగా విలువైన పనిగంటలు వృథా కావడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది.
 
* పొగాకు వాడకం వల్ల వాటిల్లే అన్ని రకాల ఖర్చులనూ, నష్టాలను కలుపుకొంటే ప్రపంచ ఆర్థికరంగంపై ఏటా 50 వేల కోట్ల డాలర్ల (రూ.33.69 లక్షల కోట్లు) భారం పడుతోంది.
* ఇందులో పొగాకు వాడకం వల్ల తలెత్తే వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చే చాలా ఎక్కువ. ఇది కాకుండా పొగాకు వాడకం వల్ల సంభవిస్తున్న అకాల మరణాల కారణంగా చాలా దేశాలు విలువైన మానవ వనరులను అర్ధంతరంగానే కోల్పోతున్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే అగ్నిప్రమాదాల్లో దాదాపు 10 శాతం ప్రమాదాలకు సిగరెట్లు, బీడీలు వంటి పొగచుట్టలే కారణం. ఈ ప్రమాదాల వల్ల సంభవిస్తున్న నష్టం 2700 కోట్ల డాలర్లు (రూ.1.81 లక్షల కోట్లు) ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా.
- పన్యాల జగన్నాథదాసు
 
పొగ మానేస్తే... లాభాలు
నెల తర్వాత: చర్మం కాంతిమంతంగా మారుతుంది.
3  నెలల తర్వాత: ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది
ఏడాది తర్వాత: రోజుకు ఒక ప్యాకెట్ చొప్పున వాడే వారికైతే రూ.36,500 మిగులుతాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి
5-15 ఏళ్ల తర్వాత: పక్షవాతం ముప్పు చాలావరకు తగ్గిపోతుంది. పూర్తిగా పొగతాగని వారితో సమానంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
పొగ తాగితే నష్టాలు
పొగ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు అర్ధంతరంగానే ఆయువు తీరిపోయేలా చేస్తాయని తెలిసిందే. పొగ తాగడం వల్ల తక్షణ ఆనందం కలిగినా, కాలం గడుస్తున్న కొద్దీ ఈ అలవాటు వల్ల చాలా అనర్థాలు తప్పవు. పొగ తాగడం వల్ల కలిగే అనర్థాలు ఇవీ...
8 గంటల తర్వాత: రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్ బయటకు పోతుంది
వారం రోజుల తర్వాత: నోటికి రుచులు, ముక్కుకు వాసనలు మరింత మెరుగ్గా తెలుస్తాయి. శరీరంలో పేరుకుపోయిన నికోటిన్ చాలా వరకు బయటకు పోతుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement