సరదా సరదా సిగరెట్టూ విలువ 4,00,00,000 | Among 10 lakhs youth slaved to smoke cigarette in Hyderabad | Sakshi
Sakshi News home page

సరదా సరదా సిగరెట్టూ విలువ 4,00,00,000

Published Mon, Jul 7 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

సరదా సరదా సిగరెట్టూ విలువ 4,00,00,000

సరదా సరదా సిగరెట్టూ విలువ 4,00,00,000

అగరొత్తులు ఎన్ని ఉన్నా సిగరెట్టుకు సాటి రావన్నాడు మహాకవి. అందుకే వాటికంత ‘పొగ’రు. యువతరాన్ని సిగరెట్లకు బానిసలు చేసుకునేలా పొగాకు కంపెనీలు కొత్త కొత్త ఎత్తులు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నాయి.యువతరానికి నిశ్శబ్దంగా ‘పొగ’పెట్టేందుకు అవి సిగరెట్లలో మేళవిస్తున్న ‘నవ’రసాలివి.. బీ కేర్‌ఫుల్ !
 
 సరదా సరదా సిగరెట్టూ.. అంటూ దమ్ముకొట్టే వాళ్లు నగరంలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. కంపు కొట్టు ఈ సిగరెట్టు, దీన్ని కాల్చకండంటూ ఇంట్లో వాళ్లు వేసిన ఒట్టును.. గట్టున పెట్టి పొగలో తేలుతున్నారు. ఊపిరితిత్తులను పిప్పి చేస్తూ రోజుకు ఏడు ల క్షల సిగరె ట్ పెట్టెలను ఊది అవతల పారేస్తున్నారు. వీటి విలువ అక్షరాలా రూ.4 కోట్లు. మహానగరంలో పొగరాయుళ్లు సగటున సిగరెట్లపై నెలకు రూ.900 నుంచి రూ.14 వందల వరకు బూడిదపాలు చేస్తున్నారు. ఇంట్లో పోషకాహారానికి ఖర్చు చేసే దాని కన్నా మిన్నగా.. సిగరెట్లకు వెచ్చించి ప్రాణాంతక వ్యాధుల కౌగిట్లోకి చేరుతున్నారు. సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు బానిసగా మారి.. ఆరోగ్యానికి హానికరమైన నికోటిన్ లాంటి నాలుగు వేల రకాల విషతుల్యాలను శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. సిగరెట్ల కంపెనీలు యేటా వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్నాయి. మానవ వనరులను మసకబారుస్తున్న పొగాకు ఉత్పత్తులు.., ఆదాయం రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ. 300 కోట్లు సమకూరుస్తున్నాయి.
 
 పొగరాయుళ్ల బ్రాండ్
 కింగ్ గోల్డ్‌ఫ్లాగ్  36 శాతం
 18- 35 ఏళ్ల వయసు గలవారు
 చిన్న గోల్డ్‌ఫ్లాగ్  24 శాతం
 35-45 ఏళ్ల వయసు గలవారు
 లైట్ గోల్డ్‌ఫ్ల్లాగ్  20 శాతం 18-45 ఏళ్ల వయసు గలవారు
 బ్రిస్టల్, ఫోర్‌స్కేర్, చార్మినార్,
 ఇతరత్రా 20 శాతం : 45-80 వయసు గలవారు  
 
 బ్రాంకో డైలేటర్లు:
 ఊపిరితిత్తులను వ్యాకోచింపజేసే రసాయనాలివి. వీటి ప్రభావంతో ఊపిరితిత్తుల్లోకి మరింత పొగ చేరుతుంది.
 
 నికోటిన్ మోతాదు:
 కొత్తగా సిగరెట్లు ఊదడం ప్రారంభించే వారు శీఘ్రంగానే దానికి బానిసలయ్యేందుకు తగిన పరిమాణంలో నికోటిన్ ఉండేలా పొగాకు కంపెనీలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. నికోటిన్‌కు ఒకసారి అలవాటు పడితే, వదులుకోవడం దుస్సాధ్యం.
 
 వెంటిలేటెడ్ ఫిల్టర్లు:
 పొగతాగేవారు మరింత గట్టిగా దమ్ము లాగాల్సి వచ్చేలా వెంటిలేటెడ్ ఫిల్టర్ల తయారీ. ఫలితంగా ఊపిరితిత్తుల్లోకి మరింత గాఢంగా పొగ చేరుతుంది.
 
 మెంథాల్:
 చల్లదనాన్ని ఇచ్చే మెంథాల్ కారణంగా గొంతులో స్పర్శ తగ్గుతుంది. ఫలితంగా పొగ ప్రవేశించినప్పుడు ఇబ్బంది ఉండదు.
 
 సుగర్స్, ఎసెటాల్‌డీహైడ్ :
 చక్కెర పదార్థాలను కలపడం వల్ల పొగపీల్చడం తేలికగా ఉండటమే కాకుండా, ఎసెటాల్‌డీహైడ్ అనే పదార్థం ఏర్పడేలా చేస్తాయి. ఫలితంగా పొగరాయుళ్లు నికోటిన్‌కు త్వరగా బానిసలవుతారు.
 
 ఫ్లేవరింగ్స్:
 చాక్లెట్ మాస్క్, లిక్కొరైస్ వంటి పరిమళాలను జోడించడం వల్ల సిగరెట్లకు అదనపు ఆకర్షణ. వాటి ప్రభావంతో కొత్తగా సిగరెట్లు ప్రారంభించే వారు త్వరగానే వ్యసనానికి బానిసలవుతారు.
 
 టొబాకో స్పెసిఫిక్ నైట్రోసమైన్స్:
 అమెరికన్ తరహా సిగరెట్లలో బ్లెండెడ్ టొబాకో వాడతారు. సాధారణ పొగాకు కంటే ఇందులో మరింత ఎక్కువగా కేన్సర్ కారక పదార్థాలు ఉంటాయి.
 
 అమోనియా సమ్మేళనాలు:
 సిగరెట్లలోని అమోనియా సమ్మేళనాల వల్ల పొగాకులో ఉండే నికోటిన్ మరింత వేగంగా మెదడును చేరుకుంటుంది.
 
 లెమాలినిక్ యాసిడ్ :
 ఆర్గానిక్ యాసిడ్ లవణాలను చేర్చడం వల్ల నికోటిన్ కరుకుదనం, పొగలోని ఘాటు తగ్గుతాయి.
- హమీద్‌ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement