2016 EgyptAir Crash That Killed 66 Was Caused By Pilot's Cigarette: Report - Sakshi
Sakshi News home page

ఘోర విమాన ప్రమాదం.. పైలెట్‌ సిగరెట్‌ అంటించడం వల్లే 66 మంది ప్రాణాలు గాల్లోకి!

Published Thu, Apr 28 2022 2:04 PM | Last Updated on Thu, Apr 28 2022 2:58 PM

Egypt 2016 Plane Crash Caused By Pilot Cigarette - Sakshi

EgyptAir Flight 804 Mishap Details: ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదం గురించి దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. అనేక అనుమానాల నడుమ దాదాపుగా చిక్కుముడి వీడింది. మొత్తం 66 మంది ప్రయాణికులతో 37వేల అడుగులో వెళ్తూ.. సముద్రంలో కూలిన ఈజిప్ట్ ఎయిర్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈజిప్ట్‌
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు.. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని తేల్చారు. పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో గత నెల సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో ‘న్యూయార్క్ పోస్ట్’ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

తొలుత ఈ విమాన ప్రమాదాన్ని ఉగ్రవాద దాడిగా ఈజిప్ట్‌ ప్రకటించింది. కానీ, ఏ ఉగ్రసంస్థ కూడా దానిని తామే చేసినట్లు నిర్ధారించలేదు. ఈ తరుణంలో విమానంలోని లోపమే కారణమని ఇంతకాలం అనుకున్నారు. అయితే.. ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు మాత్రమే పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్‌ 30 నుంచి 40 ఏళ్ల ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుమానాలు.. విస్తృతస్థాయి దర్యాప్తు వైపు అడుగులు వేయించాయి.

కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి. ఇక పైలెట్‌ సిగరెట్‌ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్‌ పత్రిక కార్రియర్‌ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది.

ప్రమాదానికి గురైన ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఎ320, 2016 మే 19న తేదీన పారిస్‌ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్‌​ పౌరులు, 15 మంది ఫ్రెంచ్‌ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అంతా ప్రాణాలు కోల్పోయారు.

చదవండి: పాక్‌-అఫ్గన్‌.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement