ఈ-సిగరెట్లూ అంత సురక్షితం కావు!
కొత్త పరిశోధన
చాలామంది తమ పొగతాగే అలవాటును వదులుకునేందుకు ఈ-సిగరెట్ అని పిలిచే ఎలక్ట్రానిక్ సిగరెట్‌ను ఆశ్రయిస్తుంటారు. వాస్తవానికి సిగరెట్‌లో ఉండే దాదాపు 500 రసాయనాలలో 50కు పైగా క్యాన్సర్ కారకాలు (కార్సినోజెనిక్) కాబట్టి దానికి బదులుగా ఈ-సిగరెట్‌ను తాగితే అందులో సిగరెట్ తాగిన అనుభూతి కలుగుతుంది, కానీ హానికరమైన రసాయనాలు ఉండవనే భావనతో చాలామంది ఈ-సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే తాజా పరిశోధన ఫలితాలతో తేలిన విషయం ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
వాస్తవమైన సిగరెట్‌లో ఉండే ఫార్మాల్డిహైడ్ అనే హానికరమైన రసాయనం కంటే ఈ-సిగరెట్‌లో ఇది 15 రెట్లు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం కూడా కార్సినోజెనికే... అంటే క్యాన్సర్ కారకమే. కాబట్టి సిగరెట్ మానేయాలని అనుకున్నవారు ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్‌ను ఆశ్రయించడం కంటే పూర్తిగా మానేయడమే మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయాలను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో నమోదయ్యాయి.