హవాయి: సిగరెట్లతో క్యాన్సర్ వస్తుందనే విషయం తెలిసిందే. తాగేవారే కాదు.. చుట్టుపక్కల ఉన్నవారికి కూడా సిగరెట్ ముప్పు తప్పదు. అందుకే సిగరెట్ డబ్బాల మీద ‘క్యాన్సర్ కారకం’ అని రాస్తారు. కొన్నిదేశాల్లో అమ్మకాలపై నిషేధం కూడా ఉంది. మనదేశంలో 18 సంవత్సరాల లోపువారికి సిగరెట్లు అమ్మడంపై నిషేధం అమలులో ఉంది. అయితే అమెరికాలోని హవాయీ రాష్ట్రం మాత్రం ఈ నిషేధాన్ని కాస్త ఆసక్తికరంగా అమలుచేస్తోంది. గతంలో ఈ రాష్ట్రంలో 21 సంవత్సరాలలోపు వయసున్నవారికి సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించగా.. తాజాగా దానిని వందేళ్లకు పెంచారు.
అంటే ఏదో ఒకరిద్దరు తప్ప బతికున్నవారెవరూ సిగరెట్ కొనడానికి వీల్లేదన్నమాట. అయితే ఈ నిషేధాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయకుండా 2024 నాటికి అమలు చేయాలని నిర్ణయించింది. అంటే వచ్చే సంవత్సరం 30 ఏళ్లలోపువారికి, ఆ తర్వాత సంవత్సరం 40 ఏళ్ల లోపువారికి.. ఇలా 2024 వచ్చేసరికి 100 ఏళ్ల లోపువారికి నిషేధాన్ని అమలు చేస్తారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును హవాయి కాంగ్రెస్ ఆమోదించింది. సిగరెట్ల ద్వారా వచ్చే పన్ను ఆదాయాన్ని అనుభవించే వ్యసనానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బానిస అయిందంటూ బిల్లులో చమత్కరించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment