
గాయపడిన మహ్మద్ అబ్దుల్ ముషారఫ్
పట్నంబజారు (గుంటూరు): చెప్పిన మాట వినలేదని బీటెక్ విద్యార్థులు పదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటన గుంటూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయంపై బాధితులు సోమవారం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. బాధితుడు మహ్మద్ అబ్దుల్ ముషారఫ్ తండ్రి తఖీ తెలిపిన వివరాల మేరకు.. శ్యామలానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌ముషారఫ్ బాలకుటీర్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
సమీప ప్రాంతాల్లో ఉండే బీటెక్, ఇంటర్మీడియట్ విద్యార్థులు శ్యామలానగర్ 8వలైను వద్ద నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కూర్చుని అటుగా వెళ్లే విద్యార్థులను పిలిచి అల్లరి చేస్తుంటారు. కొద్ది రోజుల కిందట ముషారఫ్ సాయంత్రం ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో అక్కడ కూర్చున్న విద్యార్థులు అతడిని పిలిచి సిగరెట్లు తీసుకు రమ్మని చెప్పగా ట్యూషన్‌కు సమయం అవుతోందని ముషారఫ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఆగ్రహించిన బీటెక్ విద్యార్థులు ఈ నెల 13న ముషారఫ్ స్నేహితుడు పృధ్వీన్ ద్వారా ఇంట్లో ఉన్న ముషారఫ్‌ను బయటకు తీసుకొచ్చారు. తాము చెబితే వినవా అంటూ ఉదయ్, శివ, వినయ్ అనే యువకులు ఇష్టానుసారంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
అనంతరం వారే ముషారఫ్‌ను పట్టాభిపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి సిబ్బందితో నగరంలో ఉన్న బాధితుడి నివాసానికి ఫోన్ చేయించారు. విషయం తెలుసుకున్న ముషారఫ్ పెద్దనాన్న అక్కడకు చేరుకుని హైదరాబాద్‌లో ఉన్న తండ్రి తఖీకి సమాచారమందించాడు. కంటికి తీవ్ర గాయమై లోపలి పొరలు పూర్తిగా దెబ్బ తినటంతో ఆపరేషన్ చేశారని బాధితులు తెలిపారు.